వసంతం వస్తోందంటే కోకిలలు కూస్తాయి. ఆకులు రాలి పోయిన చెట్లు మళ్లీ చిగురిస్తాయి. చల్ల గాలులు వీస్తాయి. మనిషి ప్రకృతికి దగ్గరవుతాడు. కానీ ఎన్నికలు వస్తే, అందులోనూ బీజేపీ అధికారానికి ముప్పు ఉందనుకునే చోటో, అధికారం సంపాదించాలనుకునే చోటో ఎన్నికలు వస్తే మూక దాడులు పెరుగుతాయి. హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగవలసి ఉంది. మహారాష్ట్రలో కూడా నవంబర్‌లోగా ఎన్నికలు జరగాలి. ఈ రెండు చోట్లా ఇటీవల మూక దాడులు జరిగాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గోవులను దొంగిలిస్తున్నాడన్న అనుమానంపై మూకదాడుల ‘‘వీరులు’’ కారులో వెళ్తున్న పందొమ్మిదేళ్ల ఆర్యన్ మిశ్రాను ‘‘గో సం రక్షకులం’’ అని చెప్పుకునే వారు కాల్చి చంపారు. ఆ కుర్రోడు 12వ తరగతి విద్యార్థి. గో సంరక్షకులు అతడిని గోవుల దొంగ అనుకున్నారట. ఈ సంఘటన గత 23వ తేదీన జరిగితే, పోలీసులు పది రోజుల తరవాత కాని విషయం చెప్పలేకపోయారు. ఆ చెప్పిన విషయం కూడా అరకొరగా ఉంది. నిందితులెవరో, వారికి ఏ సంస్థతో, ఏ పక్షానికి చెందిన రాజకీయ నాయకులతో సంబంధంఉందో చెప్పడానికి పోలీసులు తికమక పడ్డారు. వీరు గో సంరక్షకులు అవునో కాదో పోలీసులకు తెలియదట. వారికి ఉన్న రాజకీయ సంబంధాల గురించి తెలియదట. ఆర్యన్ మిశ్రాను కడతేర్చిన కేసులో అయిదుగురిని అరెస్టు చేశారు. అనిల్ కౌశిక్, వరుణ్, సౌరభ్, క్రిషన్, ఆదేశ్ ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. పదిరోజులు గడిచినా పోలీసులు వారినుంచి అసలు సమాచారం సంపాదించలేక పోయారట. ఆర్యన్‌ను హత మార్చిన కేసులో అయిదుగురికి గోవులను దొంగిలిస్తున్నారని సమాచారం అందిందట. మరి ఆ సమాచారం ఎవరు అందించారో కూడా ఇప్పటిదాకా రహస్యమే. ఆర్యన్ ఒక కారులో మిత్రులతో కలిసి వెళ్తున్నప్పుడు అయిదుగురు నిందితులు వేరే కార్లో వెంబడిరచి కాల్పులు జరిపితే ఆర్యన్ ప్రాణాలు వదిలాడు. వీళ్ల దగ్గర తుపాకీ ఎక్కడిదో కూడా పోలీసులు కనిపెట్టలేక పోయారట. గో సంరక్షక దీక్షా బద్ధులు ఇంతకు ముందు కొట్టి చంపేవారు. ఇప్పుడు తుపాకీతో కాల్చి చంపే దశకు ఎదిగారు. పోలీసులకు తెలియదేమో కానీ నిందితుల్లో ఒకడైన అనిల్ కౌషిక్ ‘‘లివ్ ఫర్ ది నేషన్’’ అనే సంస్థ నడుపుతాడట. ఆ సంస్థ గో సంరక్షణ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వహిస్తుందట. ఆయనకు, ఆయన సహచరులకు గోవులను దొంగిలిస్తున్నారు అన్న సమాచారం అందిందట. ఈ సమాచారం ఎవరు అందించారో కూడా పోలీసులు పది రోజులైనా చెప్పలేక పోవడం విచిత్రమే. ఒక వేళ ఆర్యన్ మిశ్రా గోవులను దొంగిలించే వాడే అనుకున్నా కాల్చి చంపే హక్కు ఈ మూకకు ఎవరిచ్చారు? హంతకులు ఆర్యన్ మిశ్రాకు పరిచయస్థులు కూడా కారు. అందువల్ల పాత కక్షల కారణంగా చంపారు అని తప్పుదోవ పట్టించే అవకాశమూ లేదు. ఫరీదాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో నిందితులు ప్రయాణించిన కారును, వాడిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి జునైద్ ను హతమారుస్తారు. మరోసారి సాబిర్ ప్రాణాలు తీస్తారు. ఆర్యన్ మిశ్రా ముస్లిం కాకపోవడంవల్ల నిందితులు ఆత్మ రక్షణలో పడ్డట్టే. ఒక వేళ మిశ్రా గోవులను దొంగిలిస్తున్నాడని ఉప్పు అందినా ముస్లిం కానందువల్ల చంపి ఉండరేమో! ఆర్యన్ మిశ్రాను చంపింది గో సం రక్షకులు కారని పోలీసులు అనలేరు. కాని నిందితుల వివరాలు మాత్రం బయట పెట్టరు. వారి వెనక ఉన్న రాజకీయ నాయకులు ఏ పక్షంవారో కూడా చెప్పరు. ఇంతకు ముందు అదే హర్యానాలోని నూప్‌ాలో గో సంరక్షక మూక దాడులు ఇప్పటిదాకా అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
హర్యానాలో ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఇంతకు ముందు గో మాంసం తిన్నాడని ఒక పేద ముస్లిం యువకుడిని కొట్టి చంపారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ మూక హత్యలను ఖండిరచడానికి బదులు విచిత్రమైన వాదన లేవదీశారు. ‘‘మూక దాడులు సరైనవి కాదు. కానీ ఇటీవల గోమాత మీద శ్రద్ధ పెరిగింది. గోవులను దొంగిలిస్తున్నారంటే గోవును తల్లిగా భావించే వారికి సహజంగానే ఆగ్రహం కలుగుతుంది. వారిని ఎవరు ఆపగలరు?’’ అని సైనీ ఎదురుప్రశ్న వేశారు. ఇటీవలే మహారాష్ట్రలో మరో సంఘటన జరిగింది. 72 ఏళ్ల ఓ ముస్లిం వృద్ధుడు రైలులో వస్తుండగా అతడు గోమాంసం తింటున్నాడని కొందరికి అనుమానం వచ్చిందట. ఇంకేముంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతనిమీద దాడి చేశారు. నానా హింసా పెట్టారు. అతని దగ్గర ఉన్న 2800 రూపాయలు కాజేశారు. ఆ వృద్ధుడిని హింసించిన వారు సామాన్యులు కాదు. పోలీసు విభాగంలో చేరడానికి పరీక్ష రాసి వస్తున్నారట. ఇలాంటివారు పోలీసు విభాగంలో చేరితే గో సంరక్షణ అధికారికంగానే మూక దాడుల రూపంలో జరుగుతుందేమో! ఇలాంటి దాడులు చేయడానికి ప్రధాన కారణం ముస్లింల మీద దాడి చేసినా, చంపినా తమకు అయ్యేదేమీ లేదన్న ధీమా మోదీ, యోగి ఏలుబడిలో బలపడిరది. ఇలా దాడులుచేసే వారు కేవలం హతమార్చి ఊరుకోవడం లేదు. సాక్ష్యాలను చెరిపేయడం లేదు. ఆ దాడి క్రమాన్నంతా వీడియోల్లో చిత్రీకరించి విస్తృతంగా బట్వాడా చేస్తున్నారు. ఇంతకు ముందు ఓ పోలీసు ఉద్యోగి రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. అతనికి మతి స్థిమితం లేదని ముందు ప్రచారం చేశారు. ఆ తరవాత అది సాకు అని తేలింది. ఆ పోలీసు ఇన్‌స్పెక్టర్ రైలు ప్రయాణికులకు భద్రత కల్పించవలసిన వాడు. ప్రభుత్వోద్యోగంలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాన్నే వినియోగించి ఓ ముస్లింను నిర్భయంగా చంపగలిగాడంటే మతోన్మాదం ఎంతగా తలకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూక దాడులను 2016లో ప్రధానమంత్రి మోదీ లాంఛనంగా ఖండిరచారు. ‘‘నాకు ఇలాంటి వారి మీద పట్టరాని కోపం వస్తోంది. ఈ గో సంరక్షకులలో 80 శాతం మంది నకిలీలే’’ అని మోదీ అన్నారు. అంతకు ముందు, ఆ తరవాతే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మోదీ నోటి ముత్యాలు రాలనేలేదు. పదేళ్ల నుంచి గో సంరక్షణ పేరుతో మూక దాడులు విరివిగా సాగుతున్నాయి. గో సంరక్షక వీరులు తయారవుతున్నారు. ఇలాంటి ‘‘వీరోచిత’’ కార్యకలాపాలు మితి మీరుతున్నాయి. గో మాంసం ఎగుమతి చేసే వారిలో బీజేపీ నేతలే అగ్రస్థానంలో ఉన్నారు. గో మాంసంతో వ్యాపారం చేయడానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. మామూలు జనాన్ని వెర్రి వాళ్లను చేయడానికి గో సం రక్షణ అని గావు కేకులు పెడ్తుంటారు. బీజేపీ అగ్ర నాయకుల ప్రమేయం లేకుండా, ప్రోద్బలం లేకుండా మూక హత్యలు జరుగుతాయనుకోలేం.