కృష్ణానది, బుడమేరు వరదతాకిడితో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్రం ముఖ్యంగా విజయవాడ నగర ప్రజానీకం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, ముంపు ప్రాంతాల వాసుల కష్టాలు పది రోజులు గడిచినా పూర్తి స్థాయిలో తీరడంలేదు. ఆకస్మికంగా వచ్చిపడ్డ వరదలు, వర్షాలు ఊళ్లను, కాలనీలను తుడిచిపెట్టివేశాయి. వరదలు అపార నష్టం, అంచనాలకు మించిన కష్టం మిగిల్చాయి. ప్రతి తరగతి, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం బాధితులుగా మారారు. ఏ ఇంట విన్నా, ఏ వీధిలో చూసినా, ఏ కుటుంబాన్ని కదిలించినా అన్ని కష్టాలే. ఇంత విస్తృత స్థాయిలో, పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఏ వరదలోనూ నష్టపోలేదు. ప్రతి కుటుంబంలోనూ లక్షలాది రూపాయల నష్టం జరిగింది. కట్టుబట్టలతోనే మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి కోసం, ఆహారం కోసం ఎన్నో రోజులు ఎదురు చూశామని బాధితులు వ్యక్తం చేసిన వేదన హృదయ విదారకంగా ఉంది. వరద ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో వస్తువుల రూపంలో లక్షలాది రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మొత్తం పాడైపోయాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేదు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలు, వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. అరటి, కంద, పసుపు, కూరగాయ పంటలన్నీ నీటమునిగి సర్వనాశనమయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21.18 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేశారు. ఇందులో దాదాపు 2.20 లక్షల ఎకరాలలో వరి పంట నీటమునిగినట్టు అధికారుల ప్రాథమిక అంచనా. వరదలు సంభవించి పది రోజులు గడిచింది… వరద పై విజయం సాధించామని పాలకులు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అనేక కాలనీలలో ఇప్పటికీ రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంది. బురద, మరుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. లక్షలాది మంది అభాగ్యుల జీవనాన్ని ఈ వరదలు తల్లకిందులు చేశాయి. విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాలలో ఇంకా ఇళ్లల్లోకి వెళ్లగలిగిన, వంట చేసుకునే పరిస్థితి లేదు. బట్టలు మొదలుకొని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. పాత భవనాల గోడల నుంచి చెమ్మ కారుతోంది. ఆ భవనాలు ఎప్పుడు కూలిపోతాయోనని నివాసితులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.
ప్రకృతి ప్రకోపానికి ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. జలవిళయంతో రోడ్డునపడ్డ బాధితులకు ఈ ఆపదసమయంలో చేయూతను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా, నిధులు ఇవ్వకుండా కాలయాపన చేయటం భావ్యం కాదు. మానవతా యజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాల్సిందిపోయి కేంద్ర బృందాల పేరుతో మీనమేషాలు లెక్కపెట్టడం అత్యంత శోచనీయం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన భుజస్కందాలపై మోస్తున్నందున ఆయనను సంతోషపెట్టేందుకు, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు వరదలు సంభవించిన మూడు రోజులకే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మోదీ ప్రభుత్వం హుటాహుటిన ఆంధ్రప్రదేశ్‌కు పంపించింది. ఆయన విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాలు కొన్నింటిలో మొక్కుబడి పర్యటన చేసి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరదలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి, వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రశంసల జల్లు కురిపించి దిల్లీకి వెళ్లి తీరికగా పది రోజుల తరువాత బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నివేదికను సమర్పించారు. ఆయన తిరిగి దిల్లీకి వెళ్లకమునుపే కేంద్రానికి ప్రత్యేక సాయం అందిస్తున్నట్టు లీకులు విడుదల చేశారు. తనకేమి అటువంటి సమాచారం అందలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు కూడా. ఆ తరువాత కేంద్రం పంపిన బృందం భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై అధ్యయనం ప్రారంభించింది. రాష్ట్ర అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులు శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి ఏడు జిల్లాల్లో ప్రభావం ఉందని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. బుడమేరు కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక, పునరావాస చర్యలపై నివేదిక అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫొటోలను కేంద్ర బృందం ఎదుట అధికారులు ప్రదర్శించారు. ఈ విధంగా బృందాలను పంపి అధ్యయనాల పేరిట కేంద్రం కాలయాపన చేస్తోంది తప్ప వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి నయాపైసా సాయం అందించడానికి ఎన్డీయే ప్రభుత్వానికి చేతులు రావడంలేదు. తన ప్రతిపర్యటన, చర్యను రాజకీయానికి ఉపయోగించుకునే మోదీ ఇటీవల తీవ్ర ప్రకృతి వైపరీత్యానికి గురైన కేరళలోని వయనాడ్‌లో వర్ష బాధితులను పరామర్శించడానికి తీరిక చేసుకుని ఔదార్యం ప్రదర్శించారు. జరిగిన నష్టాన్ని హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఇది మహా విపత్తు అని రాని కన్నీటి బొట్లూ కార్చారు తప్ప కేరళను ఆదుకోవడానికి మాత్రం ఇప్పటి దాకా ఆయనకు మనసు ఒప్పినట్టు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఇప్పట్లో లేవు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం తన చెప్పుచేతల్లోనే ఉంటుంది కనుక ఈ రాష్ట్రంలో పర్యటించడం దండగను కున్నట్టున్నారు. వరదల వల్ల అన్ని రంగాలలో కలిపి రాష్ట్రానికి రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఈ మేరకు నివేదికను పంపింది. దానిపై ఎటువంటి స్పందనా లేదు. ఇంతటి విపత్తు సంభవించినా తక్షణ సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అత్యంత విచారకరం. కేంద్రంలో ముఖ్య పాత్ర వహిస్తున్న టీడీపీ రాష్ట్రంలో విరుచుకుపడిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో మోదీ వద్ద తన పలుకుబడిని ఉపయోగించాలి. రాజకీయ పార్టీలు పరస్పరం బురద చల్లుకోవటం ఆపి… విపత్తు నుంచి ప్రజలను బయటపడేయడానికి సమష్టిగా కృషి చేయాలి. ప్రకృతి కూల్చిన బాధితుల ఆవాసాలను, మనోనిబ్బరాన్ని తిరిగి నిలిపేవిధంగా వాటి చర్యలు ఉండాలి, ఈ సంక్షోభ సమయంలో చేయిచేయి కలిపి బాధితులకు భరోసా కల్పించే విధంగా ముందుకు సాగాలి.