జార్ఖండ్ ఖనిజ వనరులకు ప్రసిద్ధి. ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ లోటస్ వైఫల్యాలకు ప్రతీక. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నాయకత్వంలోని జార్ఖండ్‌్ ముక్తి మోర్చా (జె.ఎం.ఎం.)ను చీల్చి హేమంత్‌ను గద్దె దించడానికి బీజేపీ అగ్రనాయక ద్వయం నరేంద్ర మోదీ, అమిత్ షా చేయని ప్రయత్నం లేదు. కానీ ఇంతవరకు సఫలం కాకపోవడం జార్ఖండ్ రాజకీయాలలో హేమంత్ సొరేన్‌కు ఉన్న పట్టుకు నిదర్శనం. బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి జె.ఎం.ఎం. సుదీర్ఘ పోరాటం చేసింది. ఒకప్పుడు జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉండేది. హేమంత్ సొరేన్ అధికారంలోకి వచ్చిన తరవాత బీజేపీ నాయకత్వానికి నిద్రపట్టడం లేదు. ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కానప్పుడు బీజేపీ ఇతర పార్టీలను చీల్చి అధికారం చేజిక్కించుకుంటుంది. గత పదేళ్ల కాలంలో కనీసం 12 రాష్ట్రాలలో బీజేపీ చేసిన పని ఇదే. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సచిన్ పైలెట్‌ను పావుగా వాడుకుని గెహ్లాత్‌ను గద్దె దించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికి అయిదు సార్లు హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఎన్నికలలో జె.ఎం.ఎం.ను ఓడిరచే ప్రయత్నం జరుగుతోంది. జె.ఎం.ఎం.ను మాత్రమే కాకుండా ఆ పార్టీకి ఓటు వేసే వారిలోనూ చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తోంది. జార్ఖండ్‌లో జె.ఎం.ఎం.-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. మొట్టమొదటిసారి 2021లో మహారాష్ట్రకు చెందిన ఒక బీజేపీ నాయకుడు కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యుల సహాయంతో సొరేన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేశారు. ఒక హోటల్‌లో మంత్రాగం జరుగుతుండగా హేమంత్ ఆ కుట్రను భగ్నం చేశారు. అప్పుడు ఆ హోటల్ గదిలో 50 లక్షల రూపాయల నగదు బయట పడిరది. హేమంత్ సొరేన్‌ను గత జనవరిలో అరెస్టు చేసినప్పుడు సొరేన్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసి చంపై సొరేన్‌ను ఆ స్థానంలో కూర్చోపెట్టి వెళ్లారు. హేమంత్ సొరేన్ ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఆక్రమించారన్న ఆరోపణ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఒక్క ఆధారం కూడా చూపించలేక పోవడంతో కేసు కొట్టేశారు. హేమంత్ సొరేన్ విడుదలయ్యారు. చంపై సొరేన్ చేత రాజీనామా చేయించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దీనితో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ప్రయోజనాలను వదులుకోవడం ఇష్టంలేని చంపై సొరేన్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. కానీ ఆయనను సమర్థించే ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకపోవడంతో దిల్లీ బీజేపీ పెద్దలు చంపై సొరేన్ ను కలుసుకోవడానికి కూడా నిరాకరించారు. అంతమాత్రం చేత బీజేపీ హేమంత్ సొరేన్ ను గద్దె దించే ప్రయత్నాలు వదిలి పెట్టిందని కాదు. చంపై సొరేన్ చేత కొత్త పార్టీ పెట్టించి జె.ఎం.ఎం. ఓట్లను చీల్చాలని అనుకుంటోంది. చంపై కొత్త పార్టీ పెట్టడానికి కావలసిన ఆర్థిక సహాయం చేయడానికి బీజేపీ సుముఖంగా ఉంది. 2021 జులై 24న హేమంత్‌ను పడదోసే మొదటి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ సభ్యులకు డబ్బు ఎర వేసి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రను పసిగట్టిన హేమంత్ కేసు దాఖలు చేయించారు. అయితే తాము జార్ఖండ్ నుంచి మహారాష్ట్రకు కూరగాయలు తీసుకు వెళ్లడానికి ఈ డబ్బు తెచ్చామని బుకాయించారు. నిజానికి అది పచ్చి అబద్ధం. రెండోసారి 2022 జులై 30న అదే కుట్ర చేశారు. అప్పుడూ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. ఇందులో బెంగాల్, అసోం బీజేపీ నేతల పాత్ర కూడా ఉంది. అప్పుడూ బీజేపీకి మిగిలింది వైఫల్యమే. కాంగ్రెస్ శాసనసభ్యులు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నవీన్ మిత్తల్‌ను సొరేన్ అరెస్టు చేయించగలిగారు. వారు నెల రోజుల పాటు జైలులో ఉండవలసి వచ్చింది. ఆ ముగ్గురినీ కాంగ్రెస్ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరవాత మళ్లీ చేర్చుకోవడం రాజకీయ నైతిక పతనానికి నిదర్శనం. ఆ తరవాత హేమంత్ సొరేన్ భూమి ఆక్రమించారని ఆరోపించింది. ఈ విషయమై ఎన్నికల కమిషన్ దర్యాప్తునకు జార్ఖండ్ గవర్నర్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ హేమంత్ సొరేన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. హేమంత్ సొరేన్ ఆ శాసనసభ్యులను అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు తరలించగలిగారు. హేమంత్ సొరేన్ వెంటనే విశ్వాస ప్రకటనా తీర్మానం ప్రతిపాదించి నెగ్గ గలిగారు. అదే సమావేశంలో ఓ.బి.సి.ల రిజర్వేషన్లను 32 శాతానికి పెంచడానికి తీర్మానం కూడా ఆమోదింప చేసుకున్నారు. దీనితో హేమంత్ సొరేన్ ప్రజానుకూల నాయకుడు అన్న అభిప్రాయం బలపడిరది. మళ్లీ 2024 జనవరి 31 న మరో కుట్ర జరిగింది. అప్పుడు బీజేపీ తన అమ్ముల పొదిలోంచి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్ ను బయటికితీసి హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేయించింది. అరెస్టు చేయడానికి ముందే హేమంత్ జాగ్రత్తపడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంపై సొరేన్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చో పెట్టారు. అదే సమయంలో తన సోదరుడు వసంత్ సొరేన్‌కు కూడా మంత్రి పదవి దక్కేట్టు చేశారు. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆదివాసులు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అప్పుడు గానీ హేమంత్ సొరేన్ జోలికి వెళ్తే జార్ఖండ్ ఆదివాసులు సహించబోరన్న విషయం బీజేపీ తలకెక్కలేదు.
తరవాత తాత్కాలిక ప్రాతిపదికపై ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంపై సొరేన్ రాజీనామా చేయక తప్పలేదు. కానీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ పెరిగింది. బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేక పోయింది. ముఖ్యమంత్రి పదవిమీద ఆశతో చంపై బీజేపీలో చేరాలనుకున్నారు. చంపై సొరేన్‌ను బీజేపీలో చేర్చుకోకపోవడానికి ఆయన వెంట శాసన సభ్యులెవరూ లేకపోవడం ఒక్కటే కారణంకాదు. అంతకు ముందే బీజేపీలో ఉన్న నాయకులు ఆయనను చేర్చుకోవడానికి చాలా విముఖంగా ఉన్నారు. వారు తిరుగుబాటుచేస్తే కొరవితో తలగోక్కున్నట్టేనని బీజేపీకి అర్థం అయింది. అందుకే తమను నమ్ముకుని హేమంత్ మీద తిరుగుబాటు చేసిన చంపై సొరేన్ కోసం బీజేపీ ఒక పథకం సిద్ధం చేసింది. ఆదే ఆయన చేత కొత్త పార్టీ పెట్టించడం. కొత్త పార్టీ ఏర్పాటుకు ఖర్చయ్యే డబ్బంతా ఇవ్వడానికి బీజేపీ సిద్ధపడిరదంటున్నారు. చంపై చేయాల్సిందల్లా ఆదివాసుల ఓట్లకు గండి కొట్టడం. ఆదివాసుల ఓట్లలో చంపై సొరేన్ 25 శాతం ఓట్లు సంపాదించగలిగినా బీజేపీకి అధికారం దక్కే అవకాశం ఉంటుంది. హేమంత్ సొరేన్ పరిస్థితి అప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారవుతుంది. ఒక వేపున చంపై సొరేన్‌ను ఎదుర్కోవాలి. మరో వేపు బీజేపీ కుట్రలను భగ్నం చేయగలగాలి. ఇది సునాయాసమైన వ్యవహారమైతే కాదు. చివరకు చంపై సొరేన్ బీజేపీ సేవలో తరించిపోయిన అసదుద్దీన్ ఒవైసీ, మాయావతి, ప్రకాశ్ అంబేద్కర్, చౌతాలా స్థాయిలోనైనా మిగులుతారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా బీజేపీ ఎక్కడైనా ఆపరేషన్ లోటస్ ప్రారంభిస్తే చిటికెలో పని పూర్తిచేస్తుంది. కానీ హేమంత్ సొరేన్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు.