మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత పార్లమెంటు స్వరూపమే మారిపోయింది. అందులో జనం ఘోషే వినిపించడం మాయమై పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని బీజేపీతో ఢీకొన్నది నిజానికి సామాన్య ప్రజలే. ఈ ఎన్నికలలో అధికార పక్షం కుదుళ్లు కదిలి పోయాయి. దీనితో జనం సమస్యలు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయన్న ఆశలు చిగురించాయి. మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రైతుల సమస్యలు రెండు సార్లు ప్రస్తావనకు వచ్చాయి. ఒక్కసారి ధరల పెరుగుదల ప్రసక్తీ వచ్చింది. కానీ నిరుద్యోగ సమస్య, యువకుల నైరాశ్యం గురించి ఇసుమంత ప్రసక్తి కూడా రాలేదు. మహిళల దుస్థితి, ఈ దేశంలోని బ్యాంకుల డబ్బు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వ తీరుకూడా పార్లమెంటు చర్చల్లో ప్రతిధ్వనించనే లేదు. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనల గురించి వినిపించినా అవన్నీ అరణ్య ఘోషగా మారిపోయాయి. జనం సమస్యలు పార్లమెంటులో ప్రస్తావనకు రాకపోతే ఈ పార్లమెంటు ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. పార్లమెంటులో కొనసాగే రభస వెనకాల ఉన్న ఆంతర్యం ఎందుకో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోకసభ స్పీకర్ ప్రభుత్వం మీద చిన్నపాటి విమర్శలను కూడా సహించే స్థితిలోలేరు. అసలు సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినప్పుడల్లా వారిని మాట్లాడనివ్వకుండా చేశారు. ఇద్దరు సభాపతులు అడ్డుకున్నది ప్రజా సమస్యల ప్రస్తావనను కాదు. ఆ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలకు ఏ మాత్రం తావివ్వకుండా అడ్డు తగిలారు. ఈ ధోరణి మరో ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. సభాపతులు ఉన్నది ప్రభుత్వ పక్షాన నిలవడానికేనా అన్న ప్రశ్నా ఎదురైంది. సభాపతులు అధికార పక్షం కొమ్ము కాస్తూ ఉంటే ప్రతిపక్షాల మాట వినిపించే అవకాశం ఏది అన్న అంశమూ చర్చకు వచ్చింది. కానీ ఇటీవలి ఎన్నికలలో ప్రజలే కీలక పాత్ర పోషించారనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఏ వైఖరి అనుసరించాలన్నదీ ఆలోచించదగిన విషయమే. ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకులు ప్రసంగాల ద్వారానే కాక ప్రశ్నల రూపంలో, లేఖల రూపంలో ఈ అంశాలను లేవనెత్తే వారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత నేరుగా ప్రభుత్వాన్ని ఢీకొంటున్నారు. ఇతర ప్రతిపక్ష నాయకులు ఆయనకు తోడుగా గొంతెత్తున్నారు. జనం సమస్యలను, అణగారిన వర్గాల వాణిని రాహుల్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. జనం తమ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజలనే పార్లమెంటు ఆవరణలోకి తీసుకొచ్చే సంప్రదాయాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. రైతులు, మురికి కాలవలను శుభ్రం చేసేవారు, శ్రామికులు, ఆకలిమీద పోరాటం చేస్తున్న సంఘాల వారిని పార్లమెంటు ఆవరణలోకి తీసుకు రావడానికి రాహుల్ ప్రయత్నం చేశారు. తలమీద పెట్టుకుని మల మూత్రాలను తీసుకెళ్లేవారు ఎవరూ లేరని ప్రభుత్వం వాదిస్తూనే ఉంటుంది. కానీ ఆ పద్దతి ఇప్పటికీ సాక్షాత్కరిస్తూనే ఉంది. ఇప్పటిదాకా పార్లమెంటు సభ్యులు, మంత్రులు పార్లమెంటులో ఉండే అయిదు నక్షత్రాల సౌలభ్యాలను అనుభవించడానికి మాత్రమే అలవాటు పడ్డారు. అణగారిన వర్గాల సమస్యల మీద ప్రతిపక్షాలు, వివిధ వర్గాల వారు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఎన్ని ఉన్నా వారి వాణి పార్లమెంటులో పీలగానైనా వినిపించిన ఉదంతాలు చాలా స్వల్పం. కానీ ఈ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడమే కాకుండా ఆ వర్గాల వారు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించి తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ప్రతిపక్షాలు కల్పించడంతో ప్రభుత్వపక్షం కంపించి పోయింది. సభాపతులు భయకంపితులైపోయి ప్రభుత్వ సమర్థనే తమ కర్తవ్యం అన్న రీతిలో వ్యవహరించడం మొదలు పెట్టారు. సభాపతులు ఈ విధానాన్ని ఆమోదించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. పార్లమెంటులో నిరుద్యోగ సమస్యను లేవనెత్తడానికి సభాపతులు అనుమతించనే లేదు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వ పక్షం సమాధానాలూ చెప్పలేదు. ధరల పెరుగుదల సభలో రెండుసార్లు ప్రస్తావనకు వచ్చినా ప్రభుత్వం సమాధానం ఇవ్వనే లేదు. సభలో రైతుల సమస్య, మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చినా ఈ సమస్యలన్నీ పరిష్కరించేశాం అని దబాయించి అధికార పక్షం సంతృప్తి పడిరది. వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాల, రోడ్డు ప్రమాదాల వ్యవహారం కూడా సభలో ప్రస్తావించడానికి అవకాశమే ఇవ్వలేదు.
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) గిడ్డంగుల్లో తగ్గుతున్న ఆహార ధాన్యాల నిలవలు, పంటల బీమా ప్రయోజనం అందని వ్యవసాయ రంగంలోని వారి దుస్థితినీ సభలో ప్రస్తావించనివ్వలేదు. జనం సమస్యలను ప్రస్తావించనివ్వని స్థితిలోనే ఆ సమస్యలను ప్రస్తావించడానికి రాహుల్‌తో సహా ప్రతిపక్ష నాయకులు విశ్వప్రయత్నం చేశారు. ఆ సమస్యలు సభ దృష్టిలో మాయమై పోకుండా కాపాడారు. అనేక సమస్యలను సభలో ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకపోయినా రైతులు, మురుగు కాలవలు శుభ్రం చేసేవారు, మల మూత్రాలను ఎత్తి పోసేవారు సాక్షాత్తు పార్లమెంటు ఆవరణలో తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం మన పార్లమెంటు చరిత్రలో మొదటిసారి దర్శనం ఇచ్చింది. మురికి కాలవలను యంత్రాల ద్వారా మాత్రమే శుభ్రం చేస్తున్నట్టు ప్రభుత్వం ఎంత టముకు వాయించుకుని చెప్పుకుంటున్నా వారి ప్రతినిధులతో రాహుల్ గాంధీ పార్లమెంటు ఆవరణలోనే ముచ్చటించారు. పార్లమెంటులో జరుగుతున్న వాద వివాదాలు, దూషణ భూషణలతోపాటు ఇలాంటి చిత్రాలు కూడా జనం దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని రాహుల్ గాంధీ వారికి భరోసా ఇచ్చారు. వివిధ వర్గాలవారు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించి తమ గోడు వెళ్లబోసుకోవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇదంతా సభాపతుల సమ్మతితోనే జరుగుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సంకెళ్లను రాహుల్ గాంధీ ఛేదించగలిగారు. తనతో మాట్లాడడానికి వచ్చిన ప్రతినిధులను పార్లమెంటు ఆవరణలోకి రానివ్వని సందర్భాలలో రాహుల్ గాంధీ తానే వెళ్లి వారితో ముచ్చటించారు. అనువైనప్పుడు వారిని ప్రతిపక్ష నాయకుడిగా తనకు కేటాయించిన గదిలో మాట్లాడారు. అయితే జాలర్లు, ఆకలిమీద పోరాటం చేస్తున్న వారికి ఈ అవకాశమూ దక్కనివ్వలేదు. సభాపతుల వ్యవహారసరళి విచిత్రంగా తయారవుతోంది. బీజేపీ సభ్యుడు ఘనశ్యాం త్రివేదీ పెద్దంతరం చిన్నంతరం చూడకుండా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖడ్గేను అవమానించే రీతిలో మాట్లాడారు. సహజంగానే ఖడ్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ అధ్యక్షులు ధన్‌కర్ ఆ సభ్యుడిని మందలించడానికి బదులు ఇద్దరినీ తన చేంబర్‌లోకి తీసుకెళ్లి తుని తగువు చేయడానికి ప్రయత్నించారు. ఇదే మాట సభలో చెప్పండని ఖడ్గే కోరారు. ధన్‌కర్ నిరాకరించారు. లోకసభ స్పీకర్ వ్యవహారం దీనికి భిన్నంగా ఏమీలేదు. ఆయన ప్రతిపక్షాలవారు నోరు విప్పగానే ‘‘నో నో నో’’ అంటూ ఉంటారు. లేదా మీరు మాట్లాడేది రికార్డులకు ఎక్కడం లేదు అని తెగేసి చెప్తారు. రికార్డుల నుంచి తొలగించడంలో ఓం బిర్లా, ధన్‌కర్ ప్రత్యేక నైపుణ్యం సాధించేశారు. జనం నీడైనా పార్లమెంటు మీద పడనీయకుండా సభాపతులు సకల కట్టుదిట్టాలూ చేస్తున్నారు. కొయ్య కాళ్ల ఆధారంగా ప్రభుత్వం నడుపుతున్న మోదీ వైఖరి మారలేదనడానికి ఇదంతా నిదర్శనం.