దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నాగపూర్ లోని బొంబాయి హైకోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో వారికి జీవితఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. 90 శాతం అవయవాలు పని చేయని డా.సాయిబాబాకు ఈ తీర్పు స్వల్ప ఉపశమనమే కావచ్చు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణతో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు 2014 మేలో అరెస్టు చేశారు. సాయిబాబాకు ఇంతకు ముందు రెండుసార్లు బెయిలు మంజూరు అయింది. అయినా ఆయన విడుదల కాకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకుంది. సాయిబాబును నిర్దోషిగా ముంబయి హైకోర్టు నేడు చెప్పిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాయిబాబాపై కేసును ప్రాసిక్యూషన్ వారు రుజువు చేయలేకపోవడంతో ఆయనను నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్పింది. మొదటిసారి 2015లో బొంబాయి హైకోర్టు, తరవాత 2016 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సాయిబాబాకు బెయిలు మంజూరు చేసినా ఆయనకు విముక్తి అయితే కలగలేదు. ఆయన మీద నేరారోపణ రుజువై జైలు శిక్షపడ్డ 2017 మార్చి ఏడు నుంచి సాయిబాబా నాగపూర్ జైలులోనే ఉన్నారు. ఏమైతేనే చిన్నప్పుడు పోలియో సోకినందువల్ల 90 శాతం అవయవాలు పనిచేయని సాయిబాబాకు తాత్కాలికంగానైనా జైలు జీవిత యాతన నుంచి ఉపశమనం కలిగింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు సందర్భం వచ్చినప్పుడల్లా బెయిలు హక్కు, తప్పనిసరి పరిస్థితిలోనే జైలు అన్న ఆకర్షణీయమైన సూత్రాన్ని వల్లిస్తుం టాయి. కానీ అనేక మంది ఎన్నిసార్లు ఎన్ని కోర్టుల మెట్లెక్కినా బెయిలు రాని ఉదంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఉదారవాద అభిప్రాయాలు ఉన్న, రాజ్యాంగాన్ని గౌరవించే న్యాయమూర్తులు కూడా సాయిబాబా విషయంలో బెయిలు ఇవ్వకుండా కాళ్లీడ్చారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఇస్తుందని న్యాయమూర్తులు చెప్తూనే ఉంటారు. 90 శాతం శరీరం నిస్తేజం అయిన సాయిబాబాలాంటి వారు రాజ్య వ్యవస్థను, లేదా ప్రభుత్వాన్ని ఎలా కూల్చి వేయగలరో మాత్రం ఒక్కసారైనా ఆలోచించరు. సాయిబాబాకు ఒంట్లో సత్తువ లేదు. ఆయన తనంత తాను బట్టలు వేసుకోలేరు. భోజనం చేయలేరు. మంచి నీళ్లు కూడా తాగలేరు. కానీ గత పదేళ్లుగా ఆయన మనోబలం ఎన్నడూ క్షీణించలేదు. నమ్మిన సిద్ధాంతం నుంచి అరక్షణమైనా బెసకలేదు. ఒక పేజీ రాయడానికి ఒక రోజంతా పట్టే సాయిబాబా లాంటి దివ్యాంగుడు వ్యవస్థను కూల్చేయగలడన్న ఆరోపణలను కోర్టులు ఎలా నమ్ముతాయో తెలియదు. జైలులో ఆయనను కలుసుకోవాలనుకున్నప్పుడల్లా ఆయన భార్య వసంత 14 గంటలు రైలులోనో, బస్సులోనో ప్రయాణించవలసి వచ్చేది. 2014లో అరెస్టుచేసి 2017కల్లా విచారణ పూర్తి చేసి శిక్ష వేయడం ఒక రకంగా కోర్టులు ఆఘమేఘాల మీద పని చేసినట్టే. బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన మేధావులు, పౌర హక్కుల కార్యకర్తలు, రచయితలు అరెస్టై అయిదేళ్లుపూర్తి అయినా కనీసం బెయిలైనా దక్కింది కొద్ది మందికే. అంటే న్యాయవ్యవస్థ మందకొడి తనంలో నత్తకు నడకలు నేర్పే స్థాయిని మించిపోయిందనుకోవాలి. ఇంతకు ముందు సాయిబాబాకు హైకోర్టు బెయిలు మంజూరు చేస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ బెయిలును రద్దు చేయించింది. 2022 అక్టోబర్ 14న సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన బెయిలును కూడా రద్దు చేసింది. ప్రభుత్వం పెట్టుకున్న అర్జీని సుప్రీంకోర్టు ఇసుమంత కూడా జాప్యం లేకుండా విచారించి బెయిలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన బెంచీలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఆ తరవాత మూడు రోజులకే ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అప్పుడు ఈ కేసును హైకోర్టు మళ్లీ సమగ్రంగా విచారించాలని హైకోర్టుకు తిప్పి పంపారు. 2021లో మొదటి సారి, 2022లో రెండోసారి సాయిబాబాకు కరోనా వ్యాధి సోకింది.
దుర్బల శారీరక స్థితిలో ఉన్నవారు జైళ్లల్లో ఉండగానే మరణించడం మన దేశంలో కొత్తేమీ కాదు. తాజా ఉదాహరణగా స్టాన్‌స్వామి అలా మరణించిన జాబితాలో చేరిపోయారు. సాయిబాబాతో పాటు అరెస్టయిన నరోట్ ఫ్లూ సోకి సరైన చికిత్స అందక 2022లో ప్రాణాలు వదిలారు. ఏటా కనీసం ఇలా రెండువేల మంది మరణిస్తారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ప్రభుత్వాలకు, కోర్టులకు ఈ దారుణం చూసి చీమ కుట్టినట్టైనా ఉండకపోవడం ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే మన వ్యవస్థ అంతగా బండబారిపోయింది. రాజ్యవ్యవస్థను కూల్చేయాలని కుట్రపన్నారని శారీరకంగా అశక్తుడైన సాయిబాబా మీద కేసు మోపడం బధిరాంధులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు మోపారు. ఈ చట్టం కింద బెయిలు రావడం దుర్లభం అంటారు. బెయిలు కూడా దక్కకుండా, విచారణ ఊసే లేకుండా కేవలం ఆరోపణ ఆధారంగా నిరవధికంగా జైలులో మగ్గేట్టు చేయడమే ఇలాంటి కిరాతక చట్టాల పరమ లక్ష్యం. సుప్రీంకోర్టు బెయిలు రద్దు చేసినప్పుడు ఈ బాధ ఇక ఎంత మాత్రం భరించలేనని సాయిబాబా నిట్టూర్చారు. సాయిబాబాకు అంగవైకల్యంతో పాటు గుండె జబ్బు, మెదడులో ద్రవకోశం, మూత్ర పిండాల్లో రాళ్లు, క్లోమ సంబంధ సమస్య, వెన్నుపూస నొప్పితో పాటు అనేక రుగ్మతలున్నాయి. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉందని ఊదరగొట్టే న్యాయమూర్తులకు ఇన్ని రుగ్మతలున్న వ్యక్తిని భయంకరమైన పరిస్థితుల్లో జైలులో ఉంచడం జీవించే హక్కుని నానాటికీ హరింప చేయడమని ఎందుకు తట్టదో తెలియదు. ఏ వ్యక్తికైనా బెయిలు మంజూరు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆ ఉత్తర్వును గౌరవించాలి. కానీ అలాంటి తప్పనిసరి పరిస్థితులు లేకపోయినా సుప్రీంకోర్టు ఆయన బెయిలును రద్దు చేసిన వైనం గడ్డకట్టుకు పోయిన న్యాయమూర్తుల జడత్వాన్ని రుజువు చేస్తుంది. శారీరక వైకల్యం చిన్నప్పటి నుంచి సాయిబాబా ఆత్మస్థైర్యానికి ఎన్నడూ ఆటంకం కాలేదు. ఆయన చదువుకునే సమయంలో అందరికన్నా ముందుండేవారు. సమానత్వం అంటే ఆయనకు ప్రాణం. జైలులో సాయిబాబా లాంటి వారు ఎంత దుర్భర జీవితం గడపవలసి వస్తుందో చెప్పడం కూడా కష్టమే. ఆయన తనంత తాను కాలకృత్యాలు తీర్చుకోలేరు. స్నానం చేయలేరు. బట్టలు మార్చుకోలేరు. పైగా ఆయనను ఉంచిన సెల్లులో నిరంతరం కెమెరా కన్ను నిఘా ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నారో జైలు సూపరింటెండెంట్ కార్యాలయ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. చట్టాలకు, న్యాయశాస్త్ర నియమాలకు అనుగుణంగా కోర్టులు వ్యవహరించడం అరుదైపోయిన సమయంలో సాయిబాబాకు బెయిలు రావడం అబ్బురమే. చట్టానికి, రాజ్యాంగానికి నిబద్ధమై ఏ కోర్టు అయినా తీర్పులు చెప్తే అది సాహసోపేతమైన నిర్ణయం అంటున్నాం. ఆ న్యాయమూర్తులను నోరారా పొగడుతున్నాం. అంటే చట్టానికి, న్యాయానికి కట్టుబడడం వీరోపచితమైన కార్యకలాపం అయిపోయింది.