ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో ప్రభుత్వం రాజ్య ఉగ్రవాదాన్ని ప్రజల మీద రుద్దుతోంది. నిరసనకారులను ఏకపక్షంగా ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా`యూఏపీఏ)ను మోదీ ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేస్తోంది. ఈ చట్టం వల్ల తనకు నచ్చని, ప్రశ్నించే, విమర్శించే వారిపై ఉగ్రవాదిగా ముద్రవేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చట్టంలోని సెక్షన్ 35, 36 ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు, నిర్దేశించిన విధానం లేకుండా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించి కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో రాజకీయ, సైద్ధాంతిక విభేదాల ఆధారంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎందరినో లక్ష్యంగా చేసుకుని వారిపై ఉపా కింద కేసులను బనాయిస్తోంది. ఉపా కింద నమోదైన కేసుల్లో నేరారోపణలు రుజువు చేయడం కష్టసాధ్యంగా ఉందని, అటువంటి కేసులలో దర్యాప్తును నిర్వహించడంలో విపరీతమైన సంక్లిష్టత కారణంగా ఉందని, దీనికి ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం అవసరమని భద్రతా నిపుణులు అంటున్నారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను సమర్ధవంతంగా అడ్డుకోడానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి 1967లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య 2019 ఆగస్టులో ఈ చట్టానికి వివాదాస్పద సవరణలు చేశారు. నిరసనకారులను ఏకపక్షంగా ఉగ్రవాదులుగా ప్రకటించడం అందులో ప్రధాన సవరణ. ఈ సవరణప్రకారం ఒకరిపై ఉగ్రవాదిగా ముద్రవేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించి కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మన న్యాయ వ్యవస్థలో ఒక నిందితుడు దోషిగా నిరూపణ అయ్యే వరకు నిర్దోషి కిందే లెక్క. కానీ ఇక్కడ విచారణకు ముందే ఉగ్రవాదిగా ముద్రవేస్తారు. అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధం అన్న ప్రతిపక్షాల ఘోషను మోదీషా ద్వయం ఏమాత్రం ఖాతరు చేయకుండా మందబలంతో సవరణలకు ఆమోదముద్ర వేసుకున్నారు. 2019కి ముందు ఈ చట్టంలో ఐదుసార్లు మార్పులు, చేర్పులు జరిగాయి. 1995లో టాడా, 2004లో పోటా చట్టాలు రద్దయ్యాక, అదే సంవత్సరం నుంచి యూఏపీఏ చట్టంలో గణనీయమైన మార్పులు జరిగాయి. టాడా, పోటా చట్టాలు అమలులో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలున్నాయి. పోటాలోని కొన్ని నిబంధనలను ఇందులో చేర్చారు. టెర్రరిస్టు నిందితులకు సంబంధించి చార్జ్‌షీట్ వేయకుండానే 180 రోజులు నిర్బంధంలో ఉంచేలా ఈ చట్టంలో నిబంధనలు చేర్చారు. 2008లో ఉగ్రవాదం అనే మాటకు విస్తృతమైన అర్ధాన్ని నిర్వచిస్తూ ఈ చట్టంలో మార్పులు చేశారు.
రాజకీయ కారణాలతో ప్రభుత్వం మోపుతున్న రాజద్రోహం కేసులలో ఎక్కువ మంది నిర్దోషులుగా బయటపడుతున్నారు. కఠినమైన ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేరారోపణలు రుజువు చేయడం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు కష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డేటా స్పష్టం చేస్త్తోంది. 2014 నుంచి 2022 వరకు ఈ చట్టం కింద మొత్తం 8,719 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 567 కేసులలో దోషులు నిర్దోషులుగా తేలింది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం ఈ చట్టం కింద కేసులు బనాయించిన వారిలో మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేరారోపణల రుజువు అయిన వారికంటే, నిర్దోషులే చాలా ఎక్కువగా ఉన్నారు. 2014 నుంచి 2022 వరకు మధ్యలో ఒక సంవత్సరం మినహా అన్ని సంవత్సరాలు ఈ చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొన్న వారికన్నా నిర్దోషులుగా అత్యధిక సంఖ్యలో విడుదలయ్యారు. ఈ చట్టానికి ముందున్న టాడా కింద అరెస్టయిన 76,036 మందిలో ఒకశాతం మందిపై మాత్రమే అభియోగాలు మోపారు. 2004లో పోటా చట్టం రద్దయ్యే సమయానికి 1031మందిని అరెస్టు చేశారు. వీరిలో 18మందిపై మాత్రమే విచారణ జరిగింది. 13మందిని దోషులుగా నిర్ధారించారు. 2014 నుంచి 2016 వరకు నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఉపా చట్టం కింద మోపిన 75శాతం కేసుల్లో నిందితుల విడుదల లేదా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. 2014లో 976 కేసులు నమోదు చేసినప్పటికీ కేవలం తొమ్మిది మంది మాత్రమే దోషులుగా తేలారు. 24 కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించారు. 2015లో 76 కేసులు నమోదు చేసినప్పటికీ కేవలం 11 కేసులలో మాత్రమే నేరారోపణలు నమోదు చేశారు. 65 కేసుల్లో నేరారోపణలు రుజువుకాకపోవడంతో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. 2016లో 33 కేసులు నమోదు చేయగా 22 కేసుల్లో నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. 2017లో ప్రభుత్వం అత్యధికంగా నిర్దోషులపై అక్రమ కేసులు బనాయించింది. ఈ సంవత్సరం 34 మందిపై ఉపా చట్టం క్రింద కేసులు బనాయించగా వారిలో ఒక్కరే దోషిగా తేలారు. మిగిలిన 33 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 2015తో పోలిస్తే ఉపా కింద మోపిన కేసులలో అరెస్టు అయిన వారి సంఖ్య 2019లో 75 శాతం పెరిగింది. 2019లో దేశవ్యాప్తంగా నమోదైన 1226 కేసుల్లో 1948 మంది వ్యక్తులు ఈ చట్టం కింద అరెస్టయ్యారు. 2015-2018లో నమోదైన కేసులు వరుసగా 897, 922, 901, 1182 కాగా, అరెస్టయిన వారి సంఖ్య వరుసగా 1128, 999, 1514, 1421. వీటిలో నిర్దోషుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. విమర్శలను సహించలేని మోదీ ప్రభుత్వం ఈ కాలంలో ప్రశ్నించిన వారిలో అత్యధికులపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేసి విమర్శకుల నోరు నొక్కేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో 68 కేసుల్లోనూ, 2019లో 64 కేసుల్లోనూ నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2020లో నిర్దోషుల సంఖ్య 99కి పెరగగా, నేరారోపణలు 27కి తగ్గాయి. 2020లో నిర్దోషుల సంఖ్య 99కి పెరగగా, నేరారోపణలు 27కి తగ్గాయి. 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగింది. 39 మందిని నిర్దోషులుగా ప్రకటించగా, 27 మందిపై నేరారోపణలు మోపారు. 2022 సంవత్సరంలో అత్యధికంగా 153 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. 2018 టెర్రర్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం టెర్రరిస్టు చట్టాల ద్వారా పాశ్చాత్య దేశాలు ఉగ్రవాదాన్ని చాలావరకు నియంత్రించగలిగాయి. విచారకరమేమంటే మన దేశంలో మాత్రం వాటి ఫలితాలు తారుమారవుతున్నాయి. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం సంకుచిత రాజకీయ ప్రయోజనాలను, కుయుక్తులను విడనాడి విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. ప్రశ్నించే వారికి అవకాశం కల్పించాలి. అంతే తప్ప ఇటువంటి చట్టాలను దుర్వినియోగం చేయడం తగదు.