పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ప్రధానంగా పోరాడవలసింది పత్రికల యజమానులు. మీడియా విస్తరించిన తరవాత వివిధ రకాల ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, ఆ మాటకొస్తే సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్న వారు దీని కోసం పోరాడాల్సింది. కానీ పత్రికా స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడుతున్నది మీడియాలో పని చేసే సిబ్బందే. అంటే పత్రికా రచయితల సంఘాలే ఆ పని చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించడం గత పదేళ్లుగా మోదీని విమర్శించడంగా, బీజేపీని విమర్శించడంగా మోదీ సర్కారు భావిస్తోంది. మోదీ హయాంలో ఇద్దరు అత్యంత ధనవంతులైన అంబానీ, అదానీ అనేక మీడియా సంస్థలను తమ డబ్బు సంచుల శక్తితో కొనేసి గుప్పెట్లో పెట్టుకున్న తరవాత ప్రభుత్వాలను నిలదీయడానికి భయపడని అనేకమంది పత్రికా రచయితలు ఆ మీడియా సంస్థలలో ఇమడ లేక యూట్యూబ్ చానళ్ల ద్వారా సత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మోదీ ప్రభుత్వానికి రుచించ లేదు. అందువల్ల 2021 నాటి సమాచార సాంకేతిక చట్టం నిబంధనలను మోదీ ప్రభుత్వం 2023లో సవరించింది. ఈ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార విభాగం (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో – పి.ఐ.బి.) లో వాస్తవాల నిగ్గు తేల్చడానికి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో కూడా పి.ఐ.బి, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ సమాచార శాఖ అధికారులు పత్రికలలో ప్రచురించే వార్తలలో ఏవి ప్రచురించవచ్చో, ఏవి ప్రచురించకూడదో తేల్చే వారు. సంపాదకీయాలకు, వ్యాఖ్యలకు, వ్యాసాలకు, వార్తలకు కూడా సదరు అధికారులు కత్తెర వేసే వారు. దీన్ని సెన్సార్ షిప్ అనే వారు. సెన్సార్ షిప్ అంటే ప్రచురణకు ముందే అడ్డుకోవడం. ఎమర్జ్జెన్సీని దివారాత్రులు తప్పు పట్టే మోదీ ప్రభుత్వం పి.ఐ.బి.లో వాస్తవ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేయడం పరోక్షంగా సెన్సార్‌షిప్ విధించడమే. దీనికి నిజం చెప్పాలన్న నిష్ఠ ఉన్న పత్రికా రచయితలు, వివిధ మాధ్యమాలలో పని చేసే పత్రికా రచయితల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. మరో వేపున ప్రభుత్వం ఒడిలో కూర్చుని వార్తలు రాసే వ్యవస్థలు, పత్రికా రచయితలు మోదీ కీర్తి గానంలో మునిగిపోవడం చూస్తూనే ఉన్నాం. వాస్తవ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేయడాన్ని మీడియా సంస్థలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సింది. ప్రభుత్వం నిబంధనలను సవరించడాన్ని సవాలు చేయాల్సింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. చివరకు ఒక హాస్య నటుడు కుణాల్ కామ్రా కోర్టుకెక్కి మోదీ ప్రభుత్వం నిర్దేశించిన నిబధనలు చెల్లవని బొంబాయి హైకోర్టు నుంచి తీర్పు రాబట్టగలిగాడు. కుణాల్ కామ్రా పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బొంబాయి హైకోర్టు పీఠం ఎటూ తేల్చని తీర్పు చెప్పింది. న్యాయమూర్తి పటేల్ ప్రభుత్వం నిబంధనలను సవరించడం రాజ్యాంగ విరుద్ధం అని భావిస్తే ఆ బెంచీలోని మరో న్యాయ మూర్తి నీలా గోఖలే ప్రభుత్వం చేసిన సవరణలను సమర్థించారు. అంటే కుణాల్ కామ్రా పిటిషన్ మీద ఏమీ తేలలేదు. ఆ తరవాత బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించే బాధ్యతను గత ఫిబ్రవరిలో న్యాయమూర్తి చందూర్కర్‌కు అప్పగించారు. మూడు రోజుల కింద న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ అంతకు ముందు న్యాయమూర్తి పటేల్ వాదనతో ఏకీభవించారు. అంటే ఈ తీర్పు ప్రకారం సమాచార సాంకేతిక చట్ట నిబంధనలకు మోదీ ప్రభుత్వం గత సంవత్సరం చేసిన సవరణలు చెల్లవు. న్యాయమూర్తి చందూర్కర్ తీర్పువల్ల భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించినట్టయింది.
మోదీ ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం ‘‘ఎక్స్’’ (మునుపు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం), ఫేస్‌బుక్‌పై రాసే రాతలు, చేసే వ్యాఖ్యలు పి.ఐ.బి. లో అంతర్భాగంగా ఉన్న వాస్తవ నిర్ధారణ కమిటీలు తీసుకున్న నిర్ణయమే అంతిమం అయ్యేది. అంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్రతికూల వ్యాఖ్య మీద అయినా ప్రభుత్వం చర్య తీసుకోవడానికి వీలయ్యేది. అంతకన్నా ముందు ఆ రాతలను, వ్యాఖ్యలను చేసిన వారు సామాజిక మాధ్యమాల నుంచి ఉపసంహరించవలసి వచ్చేది. ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం పి.ఐ.బి.లోని వాస్తవ నిర్ధారణ కమిటీల అభిప్రాయమే అంతిమం అయ్యేది. ఇది ప్రాథమిక హక్కులకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం అని న్యాయమూర్తి చందూర్కర్ తీర్పు అనుమానాలకు తావు లేకుండా విడమర్చింది. రాజ్యాంగంలోని 19 (1) అధికరణం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూచీ పడ్తుంది. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛ నిర్నిబంధమైంది కాదు. ఆ అధికరణంలోనే భావ ప్రకటనా స్వేచ్ఛపై హేతుబద్ధమైన ఆంక్షలు విధించడానికి అవకాశం ఉంది. కానీ న్యాయమూర్తి చందూర్కర్ తీర్పు ప్రభుత్వం నిబంధనలను సవరించడం హేతు బద్ధమైన ఆంక్షలు విధించడంలో భాగం కాదని తేల్చి చెప్పింది. తీర్పు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ‘‘అధికారికం అయి ఉండడం’’ వాస్తవాధారంగా ఉండడానికి ఈ సవరణ ఉపయుక్తంగా ఉండేదని వాదిస్తోంది. ప్రభుత్వ సమాచారం అవాస్తవికంగా ఉన్నా ఫరవా లేదని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిని కట్టడి చేయాలన్న ప్రభుత్వం ప్రయత్నం కచ్చితంగా దురుద్దేశంతో కూడుకున్నది. దాన్ని వ్యతిరేకించవలసిందే. ఈ తీర్పు విమర్శలను నేరంగా పరిగణించే ప్రభుత్వ కుట్రను అడ్డుకోవడానికి ఉపకరిస్తుంది. వాస్తవ నిర్ధారణ కమిటీలు నిగ్గు తేల్చిన సమాచారం మాత్రమే బట్వాడా చేయాలన్న మోదీ ప్రభుత్వ పరోక్ష సెన్సార్‌షిప్‌కు అవకాశంలేని రీతిలో న్యాయ మూర్తి చందూర్కర్ తీర్పు నిలిచి పోతుంది. ప్రభుత్వం నిజం బయటకు పొక్కకుండా ఉండడం కోసం వాస్తవ సమాచారం అందుబాటులో ఉంచక పోవచ్చు. అప్పుడు ప్రభుత్వం చెప్పింది లేదా పి.ఐ.బి. వాస్తవమైందని నిర్ధారించిన సమాచారమే వాస్తవమైంది అనుకోవడం ప్రభుత్వ కుటిల యత్నాలకు దోహదం చేస్తుంది. న్యాయమూర్తి చందూర్కర్ తీర్పు ఈ ప్రయత్నాలను సాగకుండా చూడడానికి ఉపయోగపడ్తుంది. ప్రభుత్వం ఎప్పుడూ సత్యాన్నే వెల్లడిస్తుందన్న భరోసా ఏమీ లేదు. ఉదాహరణకు కరోనా సమయంలో మన దేశంలో 50 లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తే మోదీ ప్రభుత్వం మృతుల సంఖ్య అయిదు లక్షలు మాత్రమేనని వాదిస్తూ వాస్తవాన్ని దాచేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఆసరాగా చాలా మంది వాస్తవాలు బయట పెడ్తున్నారు. ఈ ధోరణే ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ప్రభుత్వ లెక్కలనే నమ్మాలని బలవంత పెట్టడం అంటే వాస్తవాన్ని కప్పి పుచ్చడమే. ఈ తీర్పు ఆ అవకాశం లేకుండా చేసింది. అంతకు ముందు ఇద్దరు న్యాయమూర్తులు భిన్న రకాలుగా తీర్పు చెప్పి వేసిన పీట ముడిని చందూర్కర్ విప్పేశారు.