ఇది మీడియా ఆధిపత్యం పెరుగుతున్న యుగం. దీని ప్రాధాన్యాన్ని, ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బ్రాడ్ కాస్టింగ్ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలనుకునే వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఇప్పటికైతే వెనక్కు తీసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ తమ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా బుధవారం ఒక మీడియా విధానాన్ని రూపొందించారు. తమ ప్రభుత్వాన్ని పొగిడే వారికి నెలకు ఎనిమిది లక్షలదాకా వ్యాపార ప్రకటనల రూపంలో ఆదాయం వచ్చే దారి చూపిస్తారట. అదే సమయంలో యోగీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిమీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా ఈ విధానంలో ముఖ్యమైన హెచ్చరిక ఉంది. నిజానికి సంఫ్‌ు పరివార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, విద్వేష పూరిత విధానాలను ఎండగట్టే వారిని సహించేదిలేదని హెచ్చరించడానికే రూపొందిన విధానం. దృశ్య, శ్రవ్య మాధ్యమాలకు తోడు అనేక రకాల డిజిటల్ మీడియా ఇప్పుడు అందుబాటులో ఉంది. మీడియా అంటే పత్రికలు, ప్రసార సాధనాలు చాలావరకు ప్రభుత్వం ఒళ్లో కూర్చుని అధికార పక్షానికి స్వచ్ఛందంగా అనుకూల ప్రచారంచేసే వ్యవస్థలుగా మారిపోయాయి. దీన్నే గోదీ మీడియా అంటున్నాం. ప్రభుత్వ అనుకూల పత్రికలు ఇదివరకూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ, పరిపాలనలోని లోటుపాట్లను బయటపెట్టి ప్రజల్లో చైతన్యం పెంచే మాధ్యమాలూ ఉన్నాయి. మీడియామీద ఆంక్షలు పెట్టిన రోజులూ చూశాం. ఏది ప్రచురించాలో ఏది ప్రచురించకూడదో ప్రభుత్వాధికారులు అంతిమ నిర్ణేతలుగా వ్యవహరించిన ఎమర్జెన్సీ రోజులనూ చూశాం. ఇప్పుడు గోదీ మీడియా అంటే స్వచ్ఛందంగా ప్రభుత్వ అనుకూల ప్రచారంచేసి నాలుగు రాళ్లు వెనకేసుకునే వ్యవస్థలే. ఎమర్జెన్సీ రోజులనాడు అందుబాటులో లేని డిజిటల్ మీడియా ఇప్పుడు విస్తారంగా అమలులోకి వచ్చింది. సమాచార, సాంకేతిక విప్లవంలో వచ్చిన మార్పులు డిజిటల్ మీడియాను ప్రజలకు చేరువ చేశాయి. ప్రభుత్వ బాకాలుగా వ్యవహరించడానికి సమ్మతించని, గుత్త వ్యాపారుల గుప్పెట్లో ఉన్న మాధ్యమాలలో ఊపిరాడక బయటకు వచ్చిన అనేకమంది ప్రసిద్ధ పత్రికా రచయితలు డిజిటల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లబ్దప్రతిష్ఠులైన పత్రికా రచయితలలో ఎక్కువ మంది యూ ట్యూబ్ లాంటి మాధ్యమాల ద్వారా తమ భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుంటున్నారు. అంతిమంగా ఈ వేదికలు విద్వేషాన్ని నింపే పాలక పక్షాలకు కంటక ప్రాయంగా మారాయి. ట్విట్టర్ (ఇప్పుడు ‘‘ఎక్స్’’, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, యూ ట్యూబ్ లాంటి అనేక డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. సహజంగానే వీటిలో ప్రయోజనకరమైనవి ఉన్నట్టే చిల్లరమల్లర అంశాలు, వంటలు వార్పులు, మొక్కల పెంపకం, ఇల్లు చక్క దిద్దుకోవడం, ఆరోగ్య పరిరక్షణ, అసత్య వార్తలు ఇబ్బడి ముబ్బడిగా ప్రచారంచేసే డిజిటల్ వేదికలూ ఉన్నయి. ఇలాంటి వాటితో ఏ ప్రభుత్వానికైనా ఆటంకం కలిగించేవి ఏమీ ఉండవు. కానీ వార్తలు, వ్యాఖ్యలు, అభిప్రాయ వేదికలు ప్రభుత్వానికి నచ్చకపోతే వాటి మీద కత్తిగట్టే తత్వం ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక డిజిటల్ మీడియాను కట్టడి చేయడానికే యోగీ ఆదిత్యనాథ్ నూతన డిజిటల్ మీడియా విధానాన్ని తెర మీదకు తెచ్చారు. ప్రభుత్వాన్ని సమర్థించే వేదికలకు వ్యాపార ప్రకటనల రూపంలో నెలకు ఎనిమిది లక్షల దాకా ఆదాయ మార్గం చూపుతామంటున్నారు. అంటే యోగీ ఆదిత్యనాథ్ హయాంలో రామరాజ్యం కొనసాగుతోంది, ధరలు తగ్గాయి. సంఘ వ్యతిరేక శక్తులు మాయమైనాయి. నిరుద్యోగం ఇసుమంత కూడా లేదు అని ప్రచారం చేసే వారికి ఆదాయం సమకూర్చడానికి ఈ విధానం రూపొందించారు. అలాగే సంఫ్‌ు పరివార్ విద్వేష రాజకీయాలను ఎండగడ్తూ, ప్రజా సమస్యలను ఏకరువుపెడ్తూ నిర్వహించే వేదికలు నడిపే వారిని చట్టరీత్యా శిక్షిస్తామన్న తీవ్ర హెచ్చరిక కూడా ఈ విధానంలో అంతర్భాగం. స్థూలంగా చెప్పాలంటే యోగి ప్రభుత్వ కీర్తిగానంలో మునిగి తేలాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి డబ్బు ముడ్తుంది. దానికి భిన్నంగా వ్యవహరించే వారు చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి యోగి కొన్ని కొలమానాలూ నిర్దేశించారు. వెరసి యోగీ ప్రభుత్వం ‘‘సంఘ వ్యతిరేక’’, ‘‘జాతి వ్యతిరేక’’ ప్రచారం చేసే వారిని చట్ట రీత్యా శిక్షిస్తారు.
ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే సమాజానికి హానిచేసే సమాచారం ఏదో నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సమాజానికీ హాని చేసే, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారానికి, అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడాన్ని అభ్యంతరపెట్టక్కర్లేదు. కానీ ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సంఘ వ్యతిరేకమో, ఏది జాతి వ్యతిరేకమో తేల్చేది ప్రభుత్వం కావడమే భావప్రకటనా స్వేచ్ఛకు పెద్ద సంకెల అవుతుంది. సంఫ్‌ు పరివార్ ప్రభుత్వాలు ప్రజలను నిలువునా చీల్చే పనిలో నిమగ్నమై పోయి ఉన్నాయి. దాన్ని ఎండగట్టడం యు.పి. ప్రభుత్వ దృష్టిలో జాతి వ్యతిరేక అంశం అయి పోతుంది. అంటే నిరసన వ్యక్తం చేయడం, భిన్నాభిప్రాయం ప్రకటించడం ఇక మీద యు.పి. లో జాతి వ్యతిరేక చర్యగా మారిపోవచ్చు. ప్రభుత్వ విధానాలను ప్రచారం చేసేవారికి డబ్బు ఎర చూపారు. దీనికి సామాజిక మాధ్యమాలను ఎ.బి.సి.డి. అని నాలుగు వర్గాలుగా విభజిస్తారట, ఎక్కువ మంది వీక్షకులు, చందాదార్లు ఉన్న వేదికలేవో తేల్చి ప్రభుత్వ ప్రకటనలు జారీ చేస్తారు. యూ ట్యూబ్ లో ఇలాంటి ఏర్పాటు ముందు నుంచే ఉంది. అపారమైన సంఖ్యలో వీక్షకులు ఉండి, ఆ వేదికలో చందాదార్లుగా చేరితే గూగుల్ వ్యాపార ప్రకటనలు సేకరించి ఇచ్చి అందులో కొంత వాటా ఆ వేదిక నిర్వాహకులకు ఇస్తుంది. ఇదే ఏర్పాటు యోగీ డిజిటల్ మీడియా విధానంలో కూడా అమలు చేస్తారు. యోగీ విధానంలో విశేషం ఏమిటంటే యూ ట్యూబ్ వేదికలు నిర్వహించే వారికే కాక ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రాం ద్వారా బట్వాడా చేసే ప్రభుత్వ అనుకూల సమాచారం అందించే వారికి ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రూపంలో డబ్బు చెల్లింపు నెలకు రూ. రెండు లక్షల నుంచి అత్యధికంగా నెలకు రూ.ఎనిమిది లక్షల దాకా ఉంటుంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే అది జాతి వ్యతిరేక ప్రచారం అయిపోవచ్చు. అప్పుడు చట్ట రీత్యా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ వెసులుబాటు ఇప్పటికి అమలులో ఉన్న వివిధ చట్టాలలో ఎటూ ఉంది. తమకు వ్యతిరేక డిజిటల్ వేదికలను నిర్వహించేవారికి సంకెళ్లు వేయడమే అసలు ఉద్దేశం. ఇది కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేయడమే. గుణ దోష నివారణ ప్రభుత్వాల గుప్పెట్లో ఉండడం అత్యంత ప్రమాదకరం.