కరువొచ్చినా, వరదొచ్చినా.. జనం ఖర్మ అన్నట్లుగా ఉంటోంది మన పాలకుల తీరు. ప్రకృతి విపత్తుల వేళ` కష్టనష్టాల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కార్యాచరణతో ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేసినా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్నాయి. కొద్దిరోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక రాష్ట్రాలు భీకర వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. నిన్నటి దాకా దుర్భర నీటి కటకటతో అలమటించిన ప్రాంతాలు నేడు భారీ వరద తాకిడికి అతలాకు తలమైపోతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్ తదితర రాష్ట్రాలు వరద ముట్టడితో కిందా మీదా అవుతున్నాయి. జులై నెలాఖరులో కేరళలోని వయనాడ్ జిల్లాను భారీ వర్షాలు, వరద రక్కసి కాటువేసి వేల ఇళ్లను కూల్చి వేసింది. వందలమంది అభాగ్యులను పొట్టన పెట్టుకున్నది. కొండచరియ విరిగిపడిన ఘటనలో దాదాపు 350మంది పైగా సజీవసమాధి అయ్యారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు అసోం, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో 305 మంది మృతి చెందగా పదుల వేల సంఖ్యలో నిర్వాసితులయ్యారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా కేరళ ఏటా జలదాడికి గురవుతోంది. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాంనగర్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు వరదలో కొట్టుకుపోయాడు. వరదలో కొట్టుకుపోయిన మరో కూలి మృతి చెందాడు. కాగా, నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకోని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో ఎవరు లేకపోవడం తీవ్ర ప్రమాదం తప్పింది. నగరం వివిధ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో మోకాలిలోతు వరకు నీరు చేరింది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రాలన్నీ ముమ్మర సహాయక చర్యల్లో మునిగితేలుతున్నాయి. వాతావరణ మార్పుల దుష్ప్రభావమే ఏటికేడు పోటెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులకు అత్యధికంగా గురయ్యే దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. వాతావరణ మార్పుల పర్యవసానంగా తలెత్తిన ప్రకృతి వైపరీత్యాలలో 1998 నుంచి 2017 మధ్య కాలంలోనే ప్రపంచంలో 5లక్షల 26వేల మంది బలయ్యారనీ, మూడు లక్షల 47వేలకోట్ల డాలర్ల ఆస్తినష్టం వాటిల్లిందని 52దేశాలకు చెందిన వందమంది నిపుణులు రూపొందించిన నివేదిక వెల్లడిరచింది. వరదలు, కరువులు, తుపానులు తదితర ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత కొరవడుతోందని కూడా ఆ నివేదిక హెచ్చరించింది. ఒక్క వరదల వల్ల ఈ ఇరవైఏళ్లలో ప్రపంచంలో 2.3బిలియన్ల మంది నష్టపోయారు. 1950-2015 మధ్యకాలంలో భారత్‌లో 268 భారీ వరదలు సంభవించగా కోటీ 70 లక్షలమంది నిర్వాసితులయ్యారనీ, 69 వేలమంది మృత్యువాత పడ్డారని అంతర్జాతీయ విపత్తుల సమాచార నిధి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్ నెలలో తొలకరి వర్షాల వల్ల సంభవించిన వరదల్లో మన దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు నిర్వాసితు లయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న అనేక గ్రామాల ప్రజలు నిత్యావసరాలకు నానా యాతన పడ్డారు.
వాతావారణ మార్పు, భూతాపం అనివార్యమైన నేపథ్యంలో ఏటా ఏదో ఒక స్థాయిలో వరదలు సంభవిస్తున్నా… వాటి వల్ల కలిగే నష్టాలను తగ్గించుకునేందుకు శాశ్వత చర్యలను చేపట్టే విషయంలో పాలకులు పూర్తి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. మన దేశంలో నూట పాతికపైగా భిన్న వాతావరణ జోన్లు ఉన్నాయి. వీటిలోని సేద్యయోగ్య భూమిలో 68శాతానికి కరవు ముప్పు, అయిదు కోట్ల హెక్టార్లకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని వాతావరణ నిపుణులు ఎప్పుడో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నివారణ యంత్రాంగాన్ని అన్ని స్థాయిల్లోనూ పరిపుష్టం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. భూకంపాల విలయాన్ని ఎదుర్కొనడంలో జపాన్ విజయగాథ మనకు స్ఫూర్తిగా నిలవాలి. దేశంలో వాతావరణ విపత్తులకు లోనయ్యే 151 జిల్లాలను గుర్తించినట్లు, వాటిని కాపాడుకునేందుకు పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు మోదీ ప్రభుత్వం చాలా కాలం క్రితం రాజ్యసభలో ప్రకటించింది. కానీ ఆ కార్యాచరణ ప్రణాళిక దాఖలాలేవీ ఆచరణలో కనిపించడంలేదు. వరదలు వచ్చినప్పుడు తూతూ మంత్రంగా ఆదరబాదరగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడం, తాత్కాలిక కేంద్రాలు ఉంచి పదో పరకో నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైపోయింది. ఏయే ప్రాంతాల్లో ఏ స్థాయిలో వరదలు వస్తున్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం, ఆ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడడం వంటి ముందస్తు ప్రణాళికలు కొరవడ్డాయి. నదీ ప్రవాహాలకు రకరకాల ఆటంకాలు కలగడం వల్ల వరదలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి. ఆకస్మికంగా వరదలు వచ్చిపడినప్పుడు అతి తక్కువ సమయాల్లో భారీ సంఖ్యలో జనాన్ని సరక్షిత ప్రాంతాలకు చేర్చడానికి తగిన పటిష్టమైన వ్యవస్థలను సంసిద్ధంచేసుకోవాలి. నదుల పొడవునా అవసరమైన మేరకు రిజర్వాయర్లు నిర్మించితే వరద తీవ్ర తగ్గించడంతోపాటు నీటిని పొదుపు చేసుకొనే వీలు కలుగుతుంది. రుతువులు గతి తప్పడం వల్ల వ్యవసాయ రంగం, ఆహారభద్రతపై తీవ్ర ప్రభావం కలుగుతుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలి. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అందుకు అనువైన రీతిలో నివారణోపాయలను పాటిస్తే వరదల ముప్పు చాలా వరకు అదుపులోకి వస్తుంది. అదే సమయంలో ప్రజల్లో సామాజిక చేతన పెంపొందించాలి. అప్పుడే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాల నుంచి దేశాన్ని, ప్రజలను సురక్షితంగా బయటపడేయగలుగుతారు.