ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారం చేపట్టి, ఆ తరవాత ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అనుసరించి ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ పాలన నడిపే అందరు పాలకులకు ఒకే రకమైన గతి పడ్తుందేమో. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో పదిహేనేళ్ల నుంచి నిరాఘాటంగా ప్రధానమంత్రిగా కొనసాగిన షేక్ హసీనా పాలనా కాలం పెరిగే కొద్దీ ఆమె నిరంకుశత్వం చెలాయించడం కూడా విపరీతంగా పెరిగింది. రిజర్వేషన్ల వివాదంపై చివరకు సోమవారం హసీనా విధిలేని పరిస్థితుల్లోనే కాదు అవమానకరమైన రీతిలో రాజీనామా చేయవలసి వచ్చింది. అక్కడితో కూడా ఆగలేదు. దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. దేశ విభజన తరవాత పశ్చిమ పాకిస్తాన్ దాష్టీకాన్ని వ్యతిరేకించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు మహోద్యమం నడిపిన షేక్ ముజీబుర్ రహమాన్ కూతురు షేక్ హసీనా నియంతగా మారడం వైపరీత్యాల్లోకెల్లా వైపరీత్యం. బంగ్లాదేశ్‌లో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. షేక్ హసీనా రాజీనామా చేయగానే నిరసనకారులతో సైన్యాధిపతి చర్చలు ప్రారంభించారు. గతంలోలాగా ప్రధానమంత్రి స్థానంలో ఉన్న హసీనాను బలవంతాన పదవి నుంచి తొలగించి సైన్యం ఈ సారి అధికారం చేజిక్కించుకోలేదు. మళ్లీ పౌర ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భవిష్యత్ ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పక్కన పెట్టినా హసీనా పదిహేనేళ్ల పాలనలో ప్రజాస్వామ్య ఛాయలు కలికానికి కూడా లేవన్న ఆరోపణ తాజాగా వినిపిస్తోంది. ప్రజలలో గూడుకట్టుకున్న ఆగ్రహం గత నెల మధ్య నుంచి అగ్నిపర్వతంలా బద్దలైంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగవంతంగా పెరుగుతోందంటున్నారు. గత పదేళ్ల కాలంలో తలసరి ఆదాయం మూడు రెట్లు అయిందంటున్నారు. రాజకీయాలకు మూలాధారం ఆర్థికాంశాలే అయినా కేవలం దేశం ఆర్థికంగా అభివృద్ధి పథంలో పయనించడం మాత్రమే ప్రజా సంక్షేమానికి కొలమానం కాదు. 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో మూడిరట రెండువంతులమంది యువకులే. వారి ప్రధాన సమస్య నిరుద్యోగం. ఈ అంశాన్ని హసీనా ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆమె పౌరుల హక్కులన్నింటినీ లాగేశారు. సర్వాధికారాలు ఆమె గుప్పెట్లోనే ఉండేవి. కోర్టులూ ఆమె ఎదుట మోకరిల్లాయి. ఏ స్థాయిలోనూ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రజాస్వామ్యం పీకే నొక్కేశారు. పోలీసు బలగాల మీదే ప్రధానంగా ఆధారపడ్డారు. హసీనా అండచూసుకుని పోలీసు బలగాల్లో అవినీతి తారస్థాయికి చేరింది. సైన్యంలోనూ అవినీతి పెరిగిపోయింది. పోలీసు విభాగం అధిపతి, సైన్యాధిపతి భయంకరంగా సంపద కొల్లగొట్టారు. ప్రజలకు భద్రత లేకుండా పోయింది. భవిష్యత్తు అంధకారమయమైంది. గత పదిహేను రోజులకుపై నుంచి దేశమంతటా పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. మొబైల్ ఫోన్లు పలకకుండా చేశారు. ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేశారు. నిరసన ప్రదర్శనలు మొదట్లో శాంతియుతంగానే కొనసాగాయి. కానీ ప్రభుత్వం చలించకపోవడంతో నిరసనలు హింసా మార్గం పట్టాయి. హసీనా అసలు సమస్యను పరిష్కరించడానికి బదులు పోలీసు, సైనిక బలగాలను దించి భయానకమైన వాతావరణం సృష్టించి నిరసన తీవ్రం కావడానికి కారకులయ్యారు. రోడ్లపైన అన్ని చోట్లా సైనికులను, ఇతర భద్రతా దళాలను మోహరించారు. కర్ఫ్యూ విధించారు.
ఆందోళనకు దారితీసిన రిజర్వేషన్ల సమస్య ప్రత్యేకమైంది. అక్కడ 56 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే మన దేశంలో లాంటి రిజర్వేషన్లు కావు. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించడానికి పోరాడిన స్వాతంత్య్ర సమర యోధులకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను పరిగణించి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అభ్యంతరకరమైంది కాదు. కానీ 1997లో ఈ రిజర్వేషన్లను స్వాతంత్య్ర సమర యోధుల సంతానానికి, 2010లో వారి సంతానానికీ హసీన వర్తింప చేశారు. స్వాతంత్య్రంకోసం ప్రధానంగా పోరాడిరది హసీనా నాయకత్వంలోని అవామీ లీగే కనక వీటి ప్రయోజనం ఆ పార్టీ వారికే ఎక్కువగా దక్కింది. 10 శాతం మహిళలకు, 10 శాతం వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారికి, 5 శాతం మైనారిటీలకు, ఒక శాతం దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించారు. అంటే కేవలం ప్రతిభ ఆధారంగా ప్రభుత్వోద్యోగాలు సంపాదించాలనుకునే వారికి మిగిలింది కేవలం 44 శాతం మాత్రమే. ఇది కూడా నిజానికి జనాగ్రహానికి కారణం కాదు. స్వాతంత్య్ర సమరయోధుల మనవలకు, మనవరాళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించడం కేవలం అధికారంలో ఉన్న అవామీ లీగ్ వారికే దక్కుతూ ఉండడం నిరసనకు ప్రధాన కారణమైంది. 2018లో ఏడుగురు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల మనవలకు, మనవరాళ్లకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకెక్కారు. గత జూన్ అయిదున హై కోర్టు ఈ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హసీనా సర్కారు దీన్ని మన్నించకపోవడంతో నిరసన జ్వాలలు లావాలా ఎగిసిపడ్డాయి. ఈ రిజర్వేషన్లను అమలు చేయడంలో విపరీతమైన అవినీతి కూడా ఉందంటున్నారు. హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీనా సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. అనుచితం అనుకుంటున్న రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన యువతకు క్రమంగా భిన్నవర్గాల మద్దతు సమకూరింది. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కడకు ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా ఉద్యమంలో భాగమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే సమర్థకులను మినహాయిస్తే దేశవాసులందరూ హసీనాకు వ్యతిరేకంగా గొంతెత్తారు. క్రమంగా ఉద్యమం హింసాత్మకమైంది. అదీ హసీనా నిర్వకమే. ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతతో కూడిన విధానాలను నిరసించే వారితో సంప్రదింపులు జరపడానికి బదులు హసీనా మరింత నిరంకుశంగా మారారు. సకల ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కారు. దేశం అట్టుడికి పోయింది. సర్వత్రా సంక్షోభం నెలకొంది. చివరకు పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే దేశ నలుమూలల నుంచి జనం ప్రధానమంత్రి హసీనా ఇంటిని ముట్టడిరచడానికి తరలి వచ్చారు. నిరసనకారులు కనిపిస్తే కాల్చేయాలని హసీనా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడానికి సైన్యం కూడా నిరాకరించింది. సైన్యంలో సగ భాగం హసీనా అంటే విముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను పడదోయడం కొత్త కాదు. ఇంతవరకు 29సార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. సైన్యాధిపతులు అధికారం చేపట్టిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. కానీ తాజాగా హసీనా రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడమే. అంటే జనమే హసీనా సర్కారును పడదోశారు. బంగ్లాదేశ్‌లో పరిణామాల ప్రభావం మన దేశం మీద కూడా ఉంటుంది. బంగ్లా అవతరణకు సాయపడిరది మన దేశమే. హసీనాతో మన ప్రభుత్వానికి సంబంధాలు బాగానే ఉన్నాయనే వారు. కానీ అక్కడి అంతర్గత రాజకీయాలను గమనించే శక్తిని ఈ ‘‘సత్సంబంధాలు’’ కోల్పోయేట్టు చేశాయేమో! బంగ్లాదేశ్‌తో మనకు 2,200 కి.మీ. మేర సరిహద్దు ఉంది. అందువల్ల పరిస్థితిని జాగ్రత్తగా గమనించడం అవసరం.