వార్తలు తెలుసుకోవడంకోసం మర్నాటిదాకా వేచి చూడవలసిన అగత్యం డిజిటల్ మీడియా అవతరణ తరవాత లేకుండా పోయింది. సమాచారం, వ్యాఖ్యల కోసం ఇప్పుడిప్పుడే డిజిటల్ మీడియా మీదే ఆధార పడ్తున్నారు. ఈ వేదికలలో ఎక్కువ జనాదరణ ఉన్న సంస్థలలో ఎక్కువ భాగం మోదీ ప్రభుత్వ దుష్ట విధానాలను ఎండగడ్తున్నాయి. అందువల్ల వీటికి ఎక్కువ జనాదరణ ఉంటోంది. రవీశ్ కుమార్, అజిత్ అంజుం, అభిసార్ శర్మ, ధృవ్ రాఠీ లాంటి వారి డిజిటల్ మీడియా నిర్వాహకుల పేరెత్తితేనే మోదీ ప్రభుత్వం వెన్నులో స్పష్టమైన ఒణుకు కనిపిస్తోంది. దీన్ని అదుపు చేయడానికే బ్రాడ్ కాస్టింగ్ బిల్లు తీసుకు రావాలనుకున్నారు. కానీ ఈ ప్రయత్నానికి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైనందువల్ల ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు. గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం నిర్వహించిన తీరుకు ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి కనీస మెజారిటీ దక్కనందువల్ల మోదీ ఇష్టారాజ్యానికి కొంత మేరకైనా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలన్నది మోదీ ప్రభుత్వ ప్రయత్నం. ప్రతిపాదిత బిల్లును ఇప్పుడు ఉపసంహరించినప్పటికీ మీడియాను అదుపు చేయాలన్న మోదీ లక్ష్యాన్ని వెనక్కు తీసుకున్నట్టు కాదు. మరో రూపంలో ఈ బిల్లును ప్రతిపాదించే ప్రమాదం పొంచేఉంది. నిర్భయంగా వార్తలు, వ్యాఖ్యలు అందిస్తూ మోదీ ప్రభుత్వ అకృత్యాలను వెల్లడిస్తున్న వారికి బిల్లు ఉపసంహరణ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు. ముఖ్యంగా యూట్యూబర్లు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకునే అవకాశం చిక్కింది. ఈ బిల్లు ముసాయిదా గురించి 2023 నవంబర్‌లో మొట్ట మొదట ఉప్పందింది. అప్పటి నుంచి నిరపేక్షంగా పని చేసే వారు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమకు అనుకూలమైన కొద్ది మందికే పంపించడం అంటేనే ప్రజలకు ఈ బిల్లులో ఏముందో తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం పన్నాగంగా కనిపిస్తోంది. మీడియాను అదుపు చేయడానికి బిల్లు ప్రతిపాదించాలన్న ప్రభుత్వ ఆలోచనే రాజ్యాంగం పూచిపడ్డ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఈ బిల్లును ప్రభుత్వం తాత్కాలికంగానైనా వెనక్కు తీసుకోవదం అంటే తాము దేవతా వస్త్రాలలో ఉన్నామని మోదీ ప్రభుత్వం అంగీకరించడమే. తమకు అనుకూలమైన వారికి ముసాయిదా బిల్లును పంపించిన ప్రభుత్వం అక్టోబర్ 15కల్లా దీనిమీద అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. యూ ట్యూబుల ద్వారా వార్తలు, వ్యాఖ్యలు తెలుసుకునే వారి సంఖ్య 29 శాతం ఉందని సి.ఎస్.డి.ఎస్. సర్వేలో తేలింది. పత్రికల ద్వారా ప్రజలు తెలుసుకున్న సమాచారం 11 శాతం మాత్రమే ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. యూట్యూబ్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు జనాభిప్రాయాన్ని ఎక్కువగా నిర్దేశిస్తున్నాయని గ్రహించిన మోదీ ప్రభుత్వం వీటికి కళ్లెం వేయాలనుకుంది. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాబిల్లు చట్టరీత్యా కానీ, రాజ్యాంగ రీత్యాకానీ, రాజకీయ దృష్టిని బట్టి కానీ సవ్యంగాలేదు. ఇటీవలి ఎన్నికల ఫలితాల కారణంగా ఈ వాస్తవాన్ని మోదీ గ్రహించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. అందుకే ఉపసంహరించారు. రాజ్యాంగంలోని 19 (1) (ఎ) అధికరణం పౌరులందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ప్రసాదించింది. పత్రికలు, వివిధ రకాల ప్రసార మాధ్యమాలకు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉన్న స్వేచ్ఛలో భాగమే. అందుకని ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో దీన్ని విచిత్రమైన రీతిలో కట్టడి చేయాలని అనుకుంది. ఉదాహరణకు ఈ దేశంలో ప్రజాభిప్రాయాన్ని మలిచే వారికి అడ్డు తగిలితే అది భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారన్న విమర్శ వస్తుంది కనక విదేశాలనుంచి జరిగే ప్రభుత్వ వ్యతిరేక ప్రసారాలు చేసే వారిని శిక్షించడానికి ఈ ముసాయిదాలో అవకాశం కల్పించారు. ధృవ్ రాఠీ వీడియోలను మన దేశంలో నిషేధిస్తారు అన్న మాట గట్టిగా వినిపించిన నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనపై విపరీతమైన వ్యతిరేకత పెల్లుబికింది. విలేకరుల సమావేశాలు పెట్టి ఈ ముసాయిదాను దుయ్యబట్టారు. భారత ప్రెస్ క్లబ్, ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలూ తీవ్ర అభంతరం వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాలూ గళమెత్తాయి. ఇప్పుడున్న ప్రతిపక్షం గత పదేళ్ల కాలంగా ఉన్నట్టు గొంతెత్తే సామర్థ్యం లేనిది కాదు. పార్లమెంటులోనూ, వెలుపల ప్రతిపక్షాలు ప్రభుత్వ అకృత్యాలను గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే సమాచారం, వ్యాఖ్యల నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇది కచ్చితంగా సెన్సార్ షిప్ విధించడమే. వివిధ మాధ్యమాలు కూడా తాము అందించే సరంజామ నిగ్గు తేల్చడానికి కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీలకు అదనం. బిల్లు ముసాయిదాను ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికే బట్వాడా చేసింది తప్ప జనాదరణఉన్న వారిని సంప్రదించే ఏ ప్రయత్నమూ చేయలేదు. అంటే సంప్రదింపులు అన్న లాంఛనాన్ని పూర్తి చేయడానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం అయింది. డిజిటల్ న్యూస్ బ్రాడ్‌్ కాస్టర్లందరినీ కూడా అదుపు చేయాలన్న సంకల్పం ఈ ముసాయిదాలో స్పష్టంగా ఉంది. యూట్యూబుల్ల్లాంటివి నిర్వహించే వారు తమ వేదికలను ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవలసి ఉంటుంది. చేసుకోకపోవడం శిక్షార్హమైన నేరం అవుతుంది. మాధ్యమాలు ఏర్పాటు చేసే పర్యవేక్షక కమిటీలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్న నిబంధనా ఉంది. ఈ జాబితాను ప్రభుత్వం ఆమోదించాలి. ఆ కమిటీ ఆమోదించిన సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి. అసలు కమిటీ ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వం దగ్గర నమోదు చేయకపోవడం లాంటి సందర్భాలలో రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశమూ బిల్లులో చేర్చారు. ప్రతి వార్తను, వ్యాఖ్యను ఈ కమిటీల ఆమోదం తరవాతే ప్రసారం చేయాలన్న నియమం వల్ల ఆఖరి నిముషంలో ఏదైనా సంఘటన జరిగితే, ఆ సమయంలో కమిటీ సభ్యులు అందుబాటులో లేకపోతే ఆ వార్తను ప్రసారం చేయడానికి అవకాశం ఉండదు. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు నిగళంగా తయారు కావడమే కాక, తాజా వార్తల ప్రసారాన్ని కూడా అడ్డుకుంటుంది. ఈ విషయంలో పొరపాటుచేస్తే రూ. 50 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే మూడున్నర కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి. మూడేళ్ల శిక్ష విధించవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుచేసే 11 మంది సభ్యుల కమిటీలో పత్రికా రచనలో నైపుణ్యం ఉన్నవారు కాకుండా అయిదుగురు అధికారులు ఉంటారు. వీరు ఎవరి పక్షాన నిలబడతారో చెప్పక్కర్లేదు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం జరిమానాలు, శిక్షలు విధిస్తుంది. రాజ్యాంగంలోని 19 (2) అధికరణంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎనిమిది పరిమితులు ఉన్న మాట నిజమే కానీ ఎక్కడా ప్రసారంచేసే అంశాలను ప్రభుత్వం పర్యవేక్షించే అవకాశమే లేదు. ఈ దృష్టితో కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమే. ప్రజా ప్రయోజనం ఏమిటో నిర్ణయించే అవకాశం రాజ్యాంగం ఇవ్వనే లేదు. అయినా ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ ముసాయిదా బిల్లులోని అంశాలను రూపొందించామని ప్రభుత్వం చెప్తోంది.