వరద ముంచెత్తినప్పుడో, నిరంతరం వర్షం వల్ల రోడ్లు జలమయం అయిపోయినప్పుడో ప్రాణనష్టం జరగడం అనివార్యం కావొచ్చు. ఇవి ప్రకృతి విపత్తుల కింద లెక్క. కానీ అద్భుతంగా నిర్మించిన భవనాల్లోని బేస్మెంట్‌లో నీళ్లు చేరి ప్రాణ నష్టం జరగడం వైపరీత్యమే. దిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఐ.ఎ.ఎస్. అధికారులు కావడానికి అవసరమైన కోచింగ్ ఇచ్చే రావూస్ కోచింగ్ సంస్థ భవనంలోని బేస్మెంటులో వర్షపు నీరు చేరి కనీసం ముగ్గురు విద్యార్థులు మరణించడం మన భవన నిర్మాణాలలో అక్రమాలు, ఇలాంటి అక్రమాలను చూసీ చూడనట్టు ఉండిపోయే నగర పాలక సంస్థల అధికారుల దురాశ, నగరంలో మురికి నీరు సాఫీగా వెళ్లడానికి తీసుకోవలసిన చర్యలను నిర్లక్ష్యం చేయడం లాంటి కారణాలు ప్రధానంగా మారడం ఎంత తక్కువ మాట వాడినా దుర్మార్గమే. ఈ దుర్ఘటన శనివారం జరిగితే ఆదివారం ఆ భవన యజమానిని, కోచింగ్ కేంద్రం సమన్వయకర్తను అరెస్టు చేశారు. ఈ భవనం బేస్మెంటు నేలమట్టానికి ఎనిమిది అడుగుల లోతులో ఉందట. నిబంధనల ప్రకారం ఈ బేస్మెంటును సామాగ్రి నిలవ ఉంచుకోవడానికి, వాహనాల పార్కింగ్ కు వినియోగించుకోవాలి. కాని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు దాన్ని తరగతులు నిర్వహించడానికి, గ్రంథాలయానికి వినియోగించుకుంటున్నారు. ఇది పూర్తిగా నియమ విరుద్ధం. అక్రమ పద్ధతుల్లో భవనాలు నిర్మించడం, అనుచిత రీతిలో వినియోగించడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరగడంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఆ భవనం ఎదురుగుండా వెళ్లే మురికి కాలవ తెగిపోయి భవనం బేస్మెంట్‌లో నీళ్లు చేరాయి. ప్రమాద సమయంలో కనీసం అక్కడ 20 మంది విద్యార్థులు ఉన్నారంటున్నారు. అధికారికంగా మృతులు ముగ్గురేనని చెప్తున్నా కనీసం అయిదుగురు మరణించారని అంటున్నారు. మృతుల సంఖ్య 15-20 మంది దాకా ఉండొచ్చునని చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న మిగతా భవనాలలోకి నీరు చేరలేదని దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఆ భవనం ఎదురుగుండా ఉన్న మురికి కాలవ తెగిపోయి భవనం బేస్మెంటులో చేరిందన్నది కూడా నిజమో కాదో ఇంకా తేలలేదు. ఏమైనా బేస్మెంట్లను పార్కింగ్, సామాగ్రి నిలవకు కాకుండా వాణిజ్య కార్యకలాపాలకు వాడుకోవడం దుర్మార్గమని నిస్సందేహంగా భావించవచ్చు. దీనికి ఎవరు బాధ్యులో కొన్ని నెలలపాటు విచారణ తంతు జరిగిన తరవాత కాని తేలదు. ఈ దుర్ఘటన జరిగిన తరవాత రావూస్ ఐ.ఎ.ఎస్. కోచింగ్ సెంటర్ బేస్మెంట్‌నే కాక చుట్టుపక్కన ఉన్న కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లను కూడా మూసేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించవచ్చు. అది ఎంత మొత్తం ఉండాలి అన్న విషయంలో కూడా వివాదాలు సాగవచ్చు. ఇలాంటి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందడానికి వచ్చే వారు లక్షలాది రూపాయలు చెల్లిస్తారు. అంటే కాస్త కలిగిన వాళ్లే తమ పిల్లలను ఇలాంటి కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు కనక అయిదు కోట్లో, పది కోట్లు చెల్లించాలన్న డిమాండును నెరవేర్చడం ఆశ్చర్యకరం కాదు. బేస్మెంట్లను అనుమతిలేని కార్యకలాపాలకు వినియోగించుకోవడంవల్ల గత ఏడాది ముఖర్జీ నగర్‌లో అగ్ని ప్రమాదం జరింగింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని విద్యార్థులకు సంబంధించిన వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఎప్పుడు వెళ్తుందో, ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో, నిర్ణయం ఎంత కాలానికి వెలువడ్తుందో ఎదురు చూడడం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఎంత పరిహారం చెల్లిస్తారు, భవన యజమానులు లేదా దాన్ని నిర్వహిస్తున్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది క్రమంగా తేలవచ్చు. ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్న జాడలు మాత్రం కనిపించవు.
ఈ సమస్య పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో కోరాయి. దోషులను గట్టిగా శిక్షించాలనీ అన్నాయి. కానీ పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అధికార పక్ష సభ్యులు మటుకు నేరభారాన్ని మొత్తం దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తోసేయడానికి సర్వ శక్తులూ వినియోగించారు. ఉత్తరప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాలన్న ముద్ర వేసి పేదల, ముస్లింల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు కదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిల్లీలోని అక్రమ నిర్మాణాలపై కూడా బుల్డోజర్లు నడిపించవచ్చుకదా అని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూటిగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఈ కోచింగ్ కేంద్రానికి అసలు అనుమతే లేదని కాంగ్రెస్ నాయకుడు కె.సి.వేణుగోపాల్ అన్నారు. షరా మామూలుగా బీజేపీ సభ్యురాలు, సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్ మొత్తం నిందను ఆమ్ ఆద్మీ పార్టీపై తోసేయడానికి తన వాదనా పటిమనంతా వినియోగించారు. కోచింగ్ సెంటర్లు పెద్ద వ్యాపారంగా మారిపోయాయని రాజ్యసభ ఛైౖర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అంశంపై ఏ నిబంధనకు అనుగుణంగా రాజ్యసభలో చర్చించాలన్న అంశం నిర్ణయించడంలో మాత్రం ఆయన తన మునుపటి ధోరణిలోనే బీజేపీని సమర్థించడంలో ముణిగి పోయారు. ఈ అంశాన్ని 267వ నిబంధన కింద చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. 176వ నిబంధన కిందగానీ సావధాన తీర్మానం రూపంలోగానీ చర్చించాలని ప్రతిపక్ష నాయకులు పట్టుబట్టినప్పుడు రాజ్యసభ అధ్యక్షులు ధన్‌కర్ ఈ అంశాన్ని తన చాంబర్‌లో చర్చించుకుందాం రండి అని ఆహ్వానం పడేసి కూర్చున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుండడం కొత్త కాదు. విద్య వ్యాపారంగా మారిపోవడమూ రహస్యమేమీ కాదు. నగర పాలక సంస్థలు వర్షా కాలానికి ముందే మురికి కాలవలను శుభ్రం చేయవలసిన బాధ్యత విస్మరించడమూ తొలిసారి జరిగిందేమీ కాదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా రాజకీయరంగు పులిమేసి ఎదుటి పక్షం వారిని దుయ్యబట్టడం అలవాటై పోయింది. విద్య వ్యాపారం కాకుండా నివారించడంలో విఫలమయ్యాం. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించడంలో ఆరితేరిపోయాం. ఈ అక్రమాలకు కారకులైన వారికి ఇతరులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా కఠినమైన శిక్షలు విధించడంలో నిశ్చేష్టంగా మిగిలిపోయాం. కోచింగ్ కేంద్రం నిర్వాహకుల అక్రమాలు ఒక్క రోజులో వచ్చినవి కావుగా! మురికి కాలవలు తెగిపోయి వరదెత్తడం రాత్రికి రాత్రి ఎదురైన సమస్య కాదుగా! సమస్యలూ కొత్తవి కానప్పుడు, జాగరూకంగా ఉండవలసిన వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు విఫలమైనప్పుడు చలించకపోతే ఇంత మంది ప్రాణాలు పోయినా చీమ కుట్టినట్లయినా ఉండదు. వివిధ రకాల వ్యాపారాలు మాత్రం బలాదూరుగా సాగుతూనే ఉంటాయి. ఇది బహుళ వైఫల్యాల ఫలితం.