న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకూడదు. కానీ న్యాయస్థానాల తీర్పులను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒక్కోసారి న్యాయస్థానాల తీర్పులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ చాలా కాలంగా బుల్డోజర్ రాజకీయాలు నడుపుతున్నారు. అపరాధం చేశారని తమకు ఎవరి మీదైనా ఒక అభిప్రాయం ఏర్పడితే వారి ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చి వేయిస్తున్నారు. ఇలా బుల్డోజర్ల ప్రతాపానికి గురవుతున్న ఇళ్లు ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు ముస్లింలవే. ఈ కూల్చివేతలో మరో వైపరీత్యమూ ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చి వేసిన సందర్భాలూ ఉన్నాయి. అంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఒక ఆదేశం జారీ చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ దాకా అంటే దాదాపు పది పన్నెండు రోజులపాటు ఏ రాష్ట్రంలోనైనా బుల్డోజర్లు ఉపయోగించి ఇళ్లు కూల్చి వేయకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును అక్టోబర్ ఒకటిన విచారిస్తుందట. ఆ లోగా ఇళ్లు కూల్చేయకపోతే మిన్ను విరిగి మీద పడేదేమీ లేదు కాబట్టి బుల్డోజర్లకు విరామం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అనధీకృతంగా కూల్చేసే ఇళ్లకే వర్తిస్తుంది. వీధుల్లో, కాలిబాటల్లో, రైలు మార్గాల పక్కన అనుమతి లేకుండా, ఆక్రమించిన స్థ్థలాల మీద నిర్మించిన ఇళ్ల కూల్చివేతకు బుల్డోజర్లకు విరామం ఇవ్వాలన్న ఆదేశం వర్తించదు. దేశంలో ఎక్కడైనా అక్టోబర్ ఒకటి దాకా ప్రైవేటు ఆస్తులను బుల్డోజర్లతో కూల్చి వేయకూడదని సుప్రీంకోర్టు ఆంక్ష విధించింది. ఇలాంటి ఆదేశాలతో ప్రభుత్వం చేతులు కట్టిపడేస్తే ఎలా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. రెండు వారాలు కూల్చివేయకపోతే మిన్ను విరిగి మీద పడేదేంలేదు అని న్యాయమూర్తులు బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అనధికారిక నిర్మాణాలను కూల్చి వేతకు అడ్డంకి ఉండకూడదని న్యాయమూర్తులు చెప్పారు. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఈ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేస్తున్నామని న్యాయమూర్తులు చెప్పారు. నేరం చేసిన, లేదా చేశారన్న ఆరోపణ ఉన్న వారి ఇళ్లను కూల్చేయకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుతో తాత్కాలిక ఉపశమనం కలిగింది. ‘‘బుల్డోజర్ న్యాయం’’ మీద ఈ నెలలోనే సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడాన్ని ఏదో ఘనకార్యంగా భావించనక్కర్లేదని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అక్రమంగా ఒక్క ఇంటిని కూల్చేసినా అది రాజ్యాంగ భావనకు విరుద్ధమే అని న్యాయమూర్తులు అన్నారు. న్యాయం ఏదో అన్యాయమేదో నిర్ణయించే అధికారం కార్య నిర్వాహకవర్గానికి (ప్రభుత్వానికి) లేదని న్యాయమూర్తులు సూటిగా చెప్పారు. అక్రమ నిర్మాణాల విషయంలో తాము మార్గదర్శకాలు రూపొందిస్తామని కూడా న్యాయమూర్తులు అన్నారు. ఏదో నేరం చేశారన్న ఆరోపణ ఉన్నంత మాత్రాన ఇళ్లు ఎలా కూల్చేస్తారని సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరానికి శిక్ష ఇంటిని కూల్చేయడం ఏ లెక్కనా న్యాయం కాదు. అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేయడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఏదో నేరంచేస్తే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడం యోగీ ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన అన్యాయమైన న్యాయసూత్రం. ప్రతి నేరానికీ నిర్ణీతమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుంది. కానీ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అక్రమ నిర్మాణాలను కూల్చేయడం కాదు. తమ దృష్టిలో దుష్టులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనుకునే వారి ఇళ్లను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చేస్తోంది. ఒకవేళ ఎవరైనా ఒక నేరం చేశారని కోర్టులు నిర్ధారిస్తే భారత శిక్షాస్మృతి ప్రకారం నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. అక్రమ నిర్మాణాలకు మినహా ఒక నేరానికి శిక్షగా ఇళ్లు కూల్చేసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ నేరాల అదుపు పేర యోగీ ఆదిత్యనాథ్ బుల్డోజర్‌నే ప్రధాన ఆయుధంగా వినియోగిస్తున్నారు.
వైపరీత్యం ఏమిటంటే ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు కూల్చేస్తున్న ఇల్లు ఆ వ్యక్తిదో కాదో కూడా యోగీ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కుటుంబంలో ఎవరు నేరం చేశారనుకున్నా కూల్చేస్తున్న ఇల్లు ఆ వ్యక్తిదో కాదా కూడా ఆలోచించడం లేదు. అంటే ఒక వ్యక్తి నేరం చేశాడనుకున్నప్పుడు కుటుంబానికి నీడనిచ్చే ఇంటిని కూల్చేసే అమానుషం బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న యోగీ హయాంలో నిరాఘాటంగా కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగీ ఆదిత్యనాథ్‌ను ఆదర్శంగా తీసుకుని బుల్డోజర్లతో విచ్చలవిడిగా ఇళ్లు కూల్చేశారు. మధ్యప్రదేశ్‌లో 70 దుకాణాలు కూల్చేస్తే అందులో 50 హిందువులవేనని సోలిసిటర్ జనరల్ వాదించారు. నిజమే కావచ్చు. అయినా అక్రమ నిర్మాణాలను మినహా ఏదో నేరానికి ఇళ్లు కూల్చేయడం ఏ రకంగానూ న్యాయం అనిపించుకోదు. ఇది న్యాయస్థానాల ప్రమేయం లేకుండా న్యాయం చేస్తున్నట్టు నటించడమే. ఒక వ్యక్తి నేరం చేశాడనుకున్నా, లేక అలాంటి ఆరోపణ ఉన్నా ఒక వ్యక్తికి చెందిన ఇంటిని కూల్చేయడం అంటే చట్టం మీద బుల్డోజర్ నడపడమే అని గత వారమే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కూల్చివేతలకు మార్గదర్శకాలు రూపొందిస్తామని సుప్రీంకోర్టు గత రెండవ తేదీనే స్పష్టం చేసింది. జైపూర్‌లో ఒక ఇంటి యజమాని కొడుకు తనతో కలిసి చదువుకునే మరో వ్యక్తిని కత్తితో పొడిచాడని ఆ కుర్రోడి ఇంటిని కూల్చేశారు. ఆ ఇల్లు పొడిచిన కుర్రాడిది కాదు అన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అయితే బుల్డోజర్ ఉపయోగించి ఇల్లు కూల్చేయడానికి ‘‘గుండె ధైర్యం’’ ఉండాలన్నారు. ఆయన దృష్టిలో గుండె ధైర్యం అంటే కర్కశత్వం, చట్టాన్ని ఖాతరు చేయకపోవడం కావొచ్చు. జనాన్ని భయపెట్టడానికి, ప్రతిపక్షం గొంతు నొక్కడానికి బుల్డోజర్ ఆయుధం అయిపోయింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరవాత చెరువులను, కుంటలను ఆక్రమించుని కట్టిన ఇళ్లను కూల్చేస్తున్నారు. ఇందులో రేవంత్ ప్రభుత్వం లక్ష్యం ఏమైనా కావొచ్చు. అంతకు ముందు కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఉన్నప్పుడూ చెరువులను ఆక్రమించినచోట ఇళ్లను కూల్చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఎందుకో ఆ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. చెరువులను ఆక్రమించుకుని కట్టిన ఇళ్లను కూల్చేయడానికి రేవంత్ ప్రభుత్వం ‘‘హైడ్రా’’ అనే ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది. ప్రసిద్ధుల ఇళ్లనూ కూల్చేశారు. తేడా ఏమిటంటే తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్‌లో చెరువులకు పూర్వరూపం తీసుకు రావడానికే అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు తప్ప నేరాలకు శిక్షగా బుల్డోజర్లు వినియోగించడం లేదు.