కోల్‌కతాలోని ఆర్.జి. కర్ వైద్య కళాశాలకు అనుబం ధంగా ఉన్న ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు 42 రోజులుగా కొనసాగిస్తున్న నిరసనను విరమించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విరమణ తమ ఆందోళనకు ముగింపు కాదని జూనియర్ డాక్టర్లు తెలియజేశారు. అంటే వారి సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదనే అర్థం. తమ నిరసన విరమించి శనివారం నుంచి విధులు నిర్వహిస్తామని ఇంతకాలం ఆందోళన చేసిన జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఆర్.జి.కర్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి సెమినార్ హాలులో దాదాపు ఆరు వారాల కింద ఒక జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆమె (అభయ) మీద అత్యాచారం, ఆ తరవాత హత్య జరగడం రెండు ఆందోళనకర అంశాలకు అద్దం పడుతోంది. ఒకటి ఆసుపత్రులలో పని చేసే వైద్యులకే కాదు ఇతర వైద్య సిబ్బందికి కూడా తగిన భద్రత లేకపోవడం. రెండవది కొందరు మనుషుల్లో యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం లేకుండా అత్యాచారం చేసే తత్వం. అత్యాచారం చేసిన తరవాత తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని భయపడి అత్యాచారానికి గురైన మహిళలను అంతమొందించే కిరాతక స్వభావం. ఇందులో ఏది దేనికన్నా హేయ మైంది అన్న విచికిత్స అనవసరం. రెండూ ఘోరమైనవే. ఇలాంటి సందర్భాలలో జనాగ్రహం పెల్లుబుకడం సహజం. కోల్‌కతాలో సుదీర్ఘ కాలం జరిగింది అదే. జూనియర్ డాక్టర్లు తమకు భద్రత కల్పించాలని కోరుతూ సుదీర్ఘ కాలం నిరసనకు దిగారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల కింద స్వయంగా జోక్యం చేసుకున్నా సమస్య కొలిక్కి రాలేదు. చివరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చిన తరవాత నిరసనకు తెర పడిరది. జూనియర్ డాక్టర్ల నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ అత్యాచారం, హత్య జరిగిన వెంటనే కళాశాల ప్రిన్సిపల్ సందీప్ కుమార్ ఘోష్‌ను మొదట మరో చోటికి బదిలీ చేయడంతో జూనియర్ డాక్టర్ల ఆగ్రహం తీవ్ర స్థాయిలో భగ్గుమంది. చివరకు ఆయన వైద్యం చేయడానికి ఇచ్చే లైసెన్సును కూడా రద్దు చేశారు. ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం, హత్యకు ఆ ప్రిన్సిపల్ ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోవచ్చు. కానీ ఆసుపత్రిలో పని చేసే వారి మీద ఇలాంటి హేయమైన దాడులకు పాల్పడకుండా తగిన ఏర్పాట్లు చేయకపోవడం కచ్చితంగా ఆయన నిష్క్రియా పరత్వమే. నిజానికి ఆయన ఈ సంఘటనకు నైతిక బాధ్యత తీసుకుని ఉంటే ఈ హేయమైన చర్య వివాదంగా మారేది కాదు. కానీ ఆయన ఆ పని చేయకపోవడానికి ఆయనలో నైతికత లోపించడమే కాక ఇతరేతర కారణాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. తమ వారికి వైద్యులు సరైన చికిత్స చేయలేదని భావించిన రోగి తాలూకు వారు డాక్టర్ల మీద, ఆసుపత్రుల మీద దాడులు చేసిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే ఆసుపత్రుల్లో చికిత్సలో లోపాలతో పాటు చికిత్స చేసే వారికి భద్రత కల్పించడంలోనూ విపరీతమైన లోపాలు ఉన్నట్టే. ఈ సమస్య ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎందుకు ఎక్కువగా తలెత్తుతోందో తెలియదు. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణలో ఉన్నదే. ఆ ఆసుపత్రిలో పని చేసే వైద్యురాలి మీద అత్యాచారం ఆ తరవాత హత్య జరిగిందని తెలిసిన తరవాత బెంగాల్‌లో, ముఖ్యంగా కోల్‌కతాలో ప్రభుత్వ ఆసుపత్రుల న్నింటిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.
సుదీర్ఘమైన ఆందోళన తరవాత బెంగాలు ప్రభుత్వం ఆసుపత్రుల సిబ్బందికి తగిన భద్రత కల్పించడానికి సత్వర చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా పోలీసు లను, ఇతర భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్ల మీద తనిఖీకి ఏర్పాట్లు చేయిస్తామని అత్యవసర సమయంలో అధికారులకు తెలియజేయడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని అత్యవసర సమయంలో ఆపద నుంచి తప్పించుకోవడానికి గంట మోగించే ఏర్పాటూ చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యుల, నర్సుల, ఇతర వైద్య సిబ్బందిని త్వరలో భర్తీ చేస్తామని విధి నిర్వహణ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని మరుగుదొడ్లు, మంచినీళ్ల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ తీసుకోవలసిన చర్యలే. కానీ మరుగుదొడ్లు, మంచినీళ్ల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు ఎంత హేయంగా ఉన్నాయో అర్థం అవుతోంది. ఇటీవలి వర్షాలు, వరదలవల్ల చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. వారికి తక్షణ వైద్య సహాయం అందించవలసిందే. ఈ బాధ్యతను గుర్తించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను విరమించు కున్నారు. కానీ శుక్రవారం బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాల యం ‘‘శ్వాస్థ్య భవన్’’ నుంచి సీబీఐ ఆఫీసు దాకా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తమ నిరసన మెరుగైన భద్రతా ఏర్పాట్ల కోసమే తప్ప సంఘాలు పెట్టుకునే ఆలోచన తమకు లేదని జూనియర్ డాక్టర్లు ప్రకటించడం ఒకింత ఆశ్చర్యకరమైందే. కార్మిక సంఘాల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం ఏ లెక్కన చూసినా సంఘ వ్యతిరేక కార్యకలా పాల కిందకు రావు. పైగా ఉమ్మడిగా పోరాడడానికి సంఘాలు ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చునన్న వాస్తవాన్ని జూనియర్ డాక్టర్లు గుర్తించక పోవడం ఆశ్చర్యమే. కార్మిక సంఘాల లాంటివి ఏర్పాటు చేసుకోవడం తమ స్థాయికి తగదని వారి భావనే అయితే అది కచ్చితంగా అహేతుకమైందే. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం కూడా తడబడతాయి. ఆర్.జి.కర్ ఆసుపత్రి ఉదంతం తరవాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించడానికి వీలుగా కేంద్రం తగిన చట్టాలు తీసుకురావాలని కోరడం విచిత్రం. మరణ శిక్షలు ఎక్కడా ఏ హేయమైన నేరాన్ని అయినా నిరోధించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కాని పని చేసే వారికి కనీస సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద, యాజమాన్యాల మీద ఉంది. ఈ కనీస బాధ్యతను నెరవేర్చకుండా మరణ శిక్ష విధించాలని కోరడం కఠినమైన శిక్షలతో నేరాలను అదుపు చేయవచ్చునన్న అమాయకత్వమే అవుతుంది. ఏమైనా జూనియర్ డాక్టర్లు తాత్కాలి కంగా విరమించిన నిరసనను సంపూర్ణంగా ఉపసంహరించేట్టు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. తమ హక్కులకోసం, భద్రత కోసం పోరాడుతూనే అత్యవసర వైద్య సేవలు అందించడం తమ బాధ్యతగా ఏ స్థాయిలోని డాక్టర్లైనా గుర్తించాల్సిందే.