మోదీని 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మోదీ అనునిత్యం ఎక్కడో ఓ చోట కనిపించేవారు. లేదా వినిపించేవారు. ప్రధానమంత్రి అయిన తరవాత జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే నల్లధనం ఆనుపానులు తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి గురించి అనుక్షణం ఆరోపణలు గుప్పిస్తూ ఉండేవారు. ప్రధానమంత్రి అయిన తరవాత ఏ టీవీ వార్తాచానల్లో చూసినా మోదీ ముఖమే కనిపించేది. తీసుకున్న నిర్ణయాల ప్రవాహంలా పొంగి పొర్లేది. 2019లో రెండోసారి విజయం తరవాత కూడా ఇదే తంతు కొనసాగింది. మోదీ రాజధాని దిల్లీలో లేరు అంటే మరో దేశంలోనో కాకపోతే ఏదో ఒకచోట ఎన్నికల ప్రచారంలోనో నిమగ్నమై ఉన్నారని లెక్క. అప్పుడూ టీవీ తెరలనిండా ఆయనే కనిపించేవారు. రోడ్డు మీదకెళ్లినా, పెట్రోల్ బంకుకు వెళ్లినా మోదీ ముఖమే దర్శనం ఇచ్చేది. 2014 ఎన్నికల తరవాత ప్రసార మాధ్యమాలలోనూ ప్రధానమంత్రి ముఖారవిందం కనిపించడం బాగా తగ్గిపోయింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అతి తక్కువగా హాజరయ్యే పద్ధతి మోదీ బాగా అలవర్చుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా పార్లమెంటులో ఆయన అరుదుగానే కనిపిస్తున్నారు. కనిపించినప్పుడల్లా ప్రతిపక్షాలమీద దుమ్మెత్తిపోసి నిష్క్రమిస్తారు. మామూలుగా అయితే ప్రధానమంత్రి సభలో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అడ్డు తగలకపోవడం ఒక సంప్రదాయం. అదేరీతిలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రధానో, ఇతర మంత్రులో మధ్యలో కల్పించకపోవడమూ సంప్రదాయంగానే కొనసాగుతోంది. కానీ ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా మధ్యలో లేచి మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తప్పుపట్టారు. ఇది సంప్రదాయ విరుద్ధం. మొన్న జరిగిన రైలు ప్రమాదంపై విమర్శలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రతిపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. నీటు పరీక్షలో, విద్యా వ్యవస్థలో నెలకొన్న గందరగోళంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ది అదే పరిస్థితి. బడ్జెట్‌మీద విమర్శలన్నింటినీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుర్కోవలసి వచ్చింది. గతంలో మాటేమో కానీ ఈసారి లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. అందరి తరఫున పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానాలు చెప్పడం మరో వైపరీత్యం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికలలో పోటీ చేయలేదు. అశ్వినీ వైష్ణవ్ చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గట్టెక్కారు. ఈసారి స్పీకర్ కావడానికి ఓం బిర్లా ఇష్టపడకపోయినా ఆయనకే ఆ స్థానం అప్పగించారు. మంత్రులెవరికీ స్వయం నిర్ణయాధికారం లేకపోవడం మోదీ పరిపాలన ప్రత్యేక శైలి. పార్లమెంటులో కనిపించేది వీళ్లే కాబట్టి ప్రతిపక్షాలువేసే బాణాలన్నీ వారికే తగులుతున్నాయి. ఎప్పుడో బ్రిటన్ విదేశాంగ మంత్రితో సంభాషిస్తున్న ఫొటోను మోదీ తన ట్విట్టర్‌లో ఉంచారు. అది తాజాదేమీ కాదు. బీజేపీ కూడా ఈ చిత్రాన్నే ‘‘ఎక్స్’’ పై ఉంచింది. ఆ మరుసటిరోజు మోదీ ముఖచిత్రం ఎక్కడా కనిపించలేదు. బడ్జెట్ కన్నా ముందు మోదీ ప్రపంచ వారసత్వ సమావేశంలో కనిపించారు.
టీవీ చానళ్ల తెరల మీద కొద్ది రోజులుగా మోదీ ముఖం కనిపించడమే అరుదైపోయింది. తరచుగా జనం దృష్టిలో పడకూడదని మోదీకి ఎవరైనా సలహా ఇచ్చారేమోనన్న అనుమానం కలుగుతోంది. మారిన పరిస్థితుల్లో అనుక్షణం మాధ్యమాలలో దర్శనమిస్తే ప్రతికూలత పెరుగుతుందని ఎవరైనా చెప్పారేమోనన్న అనుమానం కలుగుతోంది. డిజిటల్ కెమెరా మన దేశంలోకి రాకముందే తన దగ్గర డిజిటల్ కెమెరా ఉందని ప్రచారం చేసుకున్న మోదీకి మీరు ప్రచారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మరెవరైనా సలహా ఇచ్చి ఉంటారేమో. మీరు తరచుగా జనం దృష్టిలో పడితే లాభం కన్న నష్టమే ఎక్కువ అని ఆయన శ్రేయోభిలాషులు మంత్రోపదేశం చేశారేమో. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగాల్సిఉంది. ఎన్నికలలో మోదీ గెలిపించగలరన్న ఆశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో వమ్ము అయింది. అందుకే ప్రధానమంత్రి తెరమీదకు రావడంలేదన్న అనుమానమూ కలుగుతోంది. గత పదేళ్ల కాలంలో మోదీ చెప్పే మాట అందరూ వినాల్సిందే తప్ప మత్రివర్గ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితే కొనసాగింది. గెలిచి ఓడిన బీజేపీ మోదీవల్ల ఇక ప్రయోజనం లేదన్న అభిప్రాయం సంఫ్‌ు పరివార్‌కే కలిగినట్టుంది. అనేక సమస్యలతో జనం సతమతమవుతున్నారు. కూరగాయల ధరలు 15 నుంచి 18 శాతం దాకా పెరిగాయి. ధాన్యంతో సహా ఇతర ఆహారపదార్థాల ధరలూ పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల పంటలకు నష్టం కలిగినందువల్ల ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం సాకులు చూపుతోంది. కూరగాయల ధరలు పెరగడానికి చీడపీడల కారణంగా సరఫరా తగ్గిందంటోంది. రబీలో పంటలు విత్తడం తగ్గిందని, దక్షిణాది రాష్ట్రాల మీద శీతోష్ణస్థితిలో మార్పు ప్రభావం వల్ల ధరలు పెరిగాయి అని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఇది ఆర్థిక పండితులు కూర్చుని సిద్ధం చేసిన నివేదిక. కానీ రైతులు చూపే కారణం ఇదికాదు. వర్షాలవల్ల ఉల్లిపంట తగ్గిందట. కొంతకాలం వర్షాభావం ఉందంటున్నారు. ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. 2022లో ద్రవ్యోల్బణం 3.8 శాతం ఉంటే 2023లో 6.6 శాతం అయింది. ఇప్పుడు 7.5 శాతానికి చేరింది. ఇవేవీ ప్రధానమంత్రికి పట్టడంలేదు. ప్రజా సమస్యలను ఎదుర్కుని వాటికి సమాధానంచెప్పే స్థితిలో ఆయన ఉన్నట్టులేరు. అందుకే ప్రశ్నలకు అవకాశంలేని వారసత్వ అంశంపై సదస్సుల లాంటి చోట్ల ప్రత్యక్షమవుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను మోదీమీద దూషణల కింద చెలామణి చేస్తోంది. బడ్జెట్ లో పన్నులు అన్న మాటతప్ప మరో మాటేలేదు. మూలధన లాభాలమీద పన్ను 28 శాతం, జి.ఎస్.టి.18 శాతం, ఆరోగ్య-విద్యా రంగాలకోం ప్రత్యేక వడ్డన (సెస్) 4 శాతం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద రాబడిపై 30శాతం పన్ను జనం నడ్డివిర్చేస్తోంది. బతుకీడ్వలేకపోతున్న జనం ఆగ్రహం బీజేపీకి అర్థం కావడం లేదనుకోలేం. ఆ పార్టీ కార్యకర్తలకు జనాక్రోశం ఎంత తీవ్రంగా ఉందో క్షుణ్ణంగా తెలుసు. ప్రధానమంత్రికీ తెలియకుండా ఉండదు. ఈ ప్రభుత్వానికి ప్రజలతో సంబంధమే లేదు. ఈ జనాగ్రహమే పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శల రూపంలో ప్రతిఫలిస్తోంది. జనానికి సమాధానం చెప్పలేకే మోదీ మొహం చాటేస్తున్నట్టుంది. అందుకే పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల ఆగ్రహానికి బలికావలసి వస్తోంది. ఈసారి మంత్రులకు మోదీ ఇచ్చిన స్వేచ్ఛల్లా ప్రతిపక్షాల విమర్శలను కాచుకోవడమే.