గణపతి పూజ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్ర చూడ్ ఇంటికి వెళ్లారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి చిట్టి వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాదు ప్రధానమంత్రి మోదీ స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా బట్వాడా చేశారు. ఈ ఉదంతాన్ని జనానికి తెలియజేశారు. మోదీ ఇలా చేయడం అసంకల్పితంగా జరిగింది కాదు. ఏ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లిన ఉదంతం ఇప్పటిదాకా ఒక్కటీ లేదు. తన ఇంట్లో గణపతి పూజకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆహ్వానించారా లేక ప్రధానమంత్రి తనంతట తానే వచ్చారా అన్నది ఇప్పటికి తెలియదు. ప్రధానమంత్రి గానీ, ప్రధాన న్యాయమూర్తి గానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కనక మోదీ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లడం వారి వ్యక్తిగతమైన అంశం కాదు. ఇద్దరికీ మత విశ్వాసాలు ఉండవచ్చు. ఉన్నాయి కూడా. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మహారాష్ట్రీయుడు. అక్కడ గణపతి ఉత్సవాలకు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ కాలం నుంచి అత్యంత ప్రాధాన్యం ఉంది. గణపతి పూజ చేయడం ఆయన మత విశ్వాసాలకు సంబంధించింది. దానికీ అభ్యంతరం లేదు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ఉంది. అది ఆయన మత విశ్వాసాలకన్నా ఎన్నో రెట్లు ప్రధానమైంది. అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత విశ్వాసాలు ఉండడం ఎంత మాత్రం అభ్యంతరకరం కాదు. అది వారి వ్యక్తిగత అంశం అయి ఉండొచ్చు. కానీ వారు కేవలం వ్యక్తులు కారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు. వారి వ్యక్తిగత పూజా పురస్కారాలకు అభ్యంతరం లేదు కాని వాటి గురించి టముకు వేసుకోవడం, పనిగట్టుకుని వీడియోలు, ఫొటోలు ప్రచారంలో పెట్టడం మాత్రం కచ్చితంగా అభ్యంతరకరమైందే. ఇది ఒక రకంగా రాజ్యాంగ ఉల్లంఘనే. ఎందుకంటే మన రాజ్యాంగం రాజ్యవ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు, న్యాయవ్యవస్థ పరిధులు ఏమిటో కచ్చితంగా నిర్వచించింది. రాజ్య వ్యవస్థలోని ఈ ప్రధాన అంగాలు మరో విభాగం వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని నిర్దేశించింది. అధికారాల విభజన మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అన్ని వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయాలన్న ఉద్దేశంతోనే. అన్నింటికన్నా మించి మనది సెక్యులర్ రాజ్యవ్యవస్థ. మోదీ, ప్రధాన న్యాయమూర్తి కలుసుకున్న సంఘటన మామూలు దృష్టితో చూస్తే అంత ప్రధానమైంది కాకపోవచ్చు. కాన్నీ మోదీ, ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లడంవల్ల తప్పనిసరిగా తప్పుడు సంకేతాలే ఇస్తాయి. కింద నుంచి సుప్రీంకోర్టు దాకా విచారణకు వచ్చే కేసుల్లో ఎక్కువ భాగం ప్రభుత్వానికి సంబంధించినవే. అందుకని పాలనా విభాగాధిపతి, ప్రధాన న్యాయమూర్తి ప్రైవేటు కార్యకలాపాలు కూడా జనం చర్చించుకునే స్థాయికి దిగజార కూడదు. అలాంటి సమావేశాల మీద అనుమానాలు వ్యక్తం కాకూడదు. ఎవరి మత విశ్వాసాలైనా వారి సొంతం. వాటికి రాజ్యవ్యవస్థలో ఎలాంటి స్థానం ఉండకూడదు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ సంప్రదాయాన్ని పాటించిన సందర్భాలకన్నా ఉల్లంఘిస్తున్న ఉదంతాలే ఎక్కువ. అయోధ్యలో రామమందిరం సంప్రోక్షణ జరిగినప్పుడు మోదీనే పూజారి అవతారమెత్తారు. పూజారి ప్రేక్షకస్థానంలో మిగిలి పోయారు. మోదీ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లి వినాయకుడి పూజలో పాల్గొన్నప్పటి 29 సెకన్ల వీడియోలో మోదీ హారతి ఇస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఏవో మంత్రాలు చదువుతున్నట్టున్నారు. ఆయన సతీమణి గంట వాయిస్తున్నారు. ఇది జనానికి ఎలాంటి సందేశం పంపుతోందని మోదీగానీ, ప్రధాన న్యాయమూర్తిగానీ ఆలోచించినట్టు లేరు. అంతే కాదు మోదీ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి కేవలం పండగ సందర్భంగా వెళ్లారా లేక ఈ వ్యవహారంలో మరో మతలబు ఏమన్నా ఉందా అన్న అనుమానాలు సహజంగానే వస్తాయి.
మోదీ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లడం అంటే అది కేవలం వారి వ్యక్తిగత వ్యవహారం కాదు. అలా అనుకోవడానికి వీలు లేకుండా మోదీయే చేశారు. సామాజిక మాధ్యమాల మీది 29 సెకన్ల వీడియో, పది ఫొటోలు ఆయనే పెట్టారు. చంద్రచూడ్ 2022 నవంబర్ లో ప్రధాన న్యాయమూర్తి అయిన తరవాత ఉదారవాది అయిన వ్యక్తి ఆ స్థానంలోకి వచ్చారని మురిసిపోవడానికి అవకాశం వచ్చింది. ఆయన వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు, కోర్టుకు ఆవల చేసిన ప్రసంగాలలో అన్న మాటలు ఆయన రాజ్యాంగ పరిరక్షణకు బద్ధుడై ఉన్నారన్న నమ్మకం కలిగింది. ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ దశలో మోదీ ఆయన ఇంటికి వెళ్లడం అంటే అనుమానాలు కలగక మానవు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ లాంటి వారైతే రాజ్యాంగ సౌధానికి ఇంటి దీపాలే అగ్గి పెట్టాయి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కపిల్ సిబల్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షులు. కానీ ఆ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో మోదీ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లడాన్ని ఆక్షేపించారు. నవంబర్ లోగా మహా రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అక్కడ ఇంతకు ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రోద్బలం వల్ల శివసేన రెండు ముక్కలైంది. అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీనీ బీజేపీ చీల్చగలిగింది. ఈ వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టు విచారణలో ఉంది. కానీ విచారణ సత్వరం జరగడం లేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు పూర్తి అయిన తరవాత తీర్పు వచ్చినా పరిస్థితి చక్కబడేది ఏమీ ఉండదు. బెంగాల్‌లో ఒక వైద్యురాలి మీద అత్యాచారం జరిగితే సుప్రీంకోర్టు తనంత తాను చొరవ చూపి కేసు విచారణకు స్వీకరించింది. మహా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు అప్పుడు గవర్నరుగా ఉన్న కోషియారీ వ్యవహార సరళినీ తీవ్రంగానే పరిగణించింది. ఇప్పుడు మాత్రం విచారణ వాయిదాలకే పరిమితం అయింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఉదార వాది అన్న భావన ఉండడమే కాక తండ్రి తీర్పును సైతం తిరగదోడిన సాహసి అన్న అభిప్రాయం ఉంది. కానీ మోదీని తన ఇంట్లోకి ఆహ్వానించడం కేవలం మహారాష్ట్ర రాజకీయాల దృష్టినుంచి చూసినా అనుమానాలే మిగుల్తున్నాయి. కార్య నిర్వాహక వర్గానికి న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలన్న విభజన రేఖ వినాయక పూజల సందర్భంగా జరిగిన సంఘటనల ద్వారా నామ రూపాలు లేకుండా చెరిగి పోయింది. సుప్రీంకోర్టులో ఏ న్యాయమూర్తి విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఉంటుంది. ఈ విషయమై నలుగురు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు 2018లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికి కేసుల విచారణా విధులను కేటాయించడంలో వివక్ష ఉందన్న ఆరోపణలు సమసి పోనేలేదు. గణపతి పూజ సందర్భంగా జరిగిన సంఘటన అధికార విభజన సూత్రాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలకు దారి తీస్తోంది.