ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా పదకొండోసారి స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ షరా మామూలుగా బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. భావజాలాన్ని మరోసారి గట్టిగా ప్రతిపాదించారు. అందులో ప్రధానమంత్రి ఉమ్మడి వివాహ చట్టం ఉండాలన్నది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే ఈ అంశంపై వాడిగా చర్చ జరిగింది. కానీ అనేక అవాంతరాలు ఉన్నందువల్ల దీన్ని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో చేర్చారు. బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు కూడా నిరంతరం ఉమ్మడి వివాహచట్టం గురించి ప్రస్తావించేది. అలాంటి వివాహ చట్టం దేశంలో అమలు చేయాలన్నది బీజేపీ మాతృ సంస్థ ఆర్.ఎస్.ఎస్. ప్రధాన లక్ష్యం. ఉమ్మడి వివాహ చట్టం అమలు చేయాలన్న లక్ష్యంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండనవసరం లేదు. కానీ అందులో ఇమిడిఉన్న సమస్యలే ఇప్పటిదాకా అది అమలు చేయడానికి ఆటంకాలుగా ఉన్నాయి. మోదీ, బీజేపీ, ఆర్.ఎస్.ఎస్. కోరుతున్న ఉమ్మడి వివాహ చట్టం అసలు లక్ష్యం అందరికీ వర్తించే వివాహ చట్టం అమలు చేయడంకాదు. వివిధ మైనారిటీ మతాలు, ముఖ్యంగా ముస్లిం మతస్థుల సంప్రదాయాలకు భంగం కలిగించ డమే. గత 75 ఏళ్లుగా అమలులో ఉన్న వివాహ చట్టం మతత త్వంతో కూడుకున్నదనీ దానిబదులు సెక్యులర్ వివాహ చట్టం కావాలని మోదీ అంటున్నారు. ఇది ఆయన చేసే అసత్య ప్రచారంలో భాగమే. సుప్రీంకోర్టులో ఉమ్మడి వివాహ చట్టం అనేకసార్లు చర్చకు వచ్చిందనీ, ఇప్పుడున్నది మతతత్వ వివాహ చట్టం అని చెప్పిన వాక్యంలో మొదటి భాగం సత్యమైతే రెండో భాగం పూర్తిగా అసత్యం. ప్రస్తుత వివాహచట్టం వివక్ష చూపుతోందని ఆయన అంటున్నారు. ఆధునిక సమాజంలో మతంమీద ఆధారపడ్డ వివాహ చట్టాలు ఉండ కూడదని తాను గొప్ప ఆధునిక భావాలు కలవాడినని నిరూపించుకోవ డానికి వ్యర్థ ప్రయత్నం చేశారు. ప్రస్తుత వివాహ చట్టం వివక్షా పూరితమైందని ప్రజలు భావిస్తున్నారని సంఫ్‌ు పరివార్ వాదనను ప్రజల మీదకు తోసేశారు. 21వ లా కమిషన్ సంప్రదింపుల పత్రంలో వివక్షా పూరితమైన చట్టాల గురించి లోతుగా చర్చించింది. అయితే ఈ దశలో ఉమ్మడి వివాహ చట్టం తీసుకురావడం అనవసరం అని కూడా గట్టిగా అభిప్రాయపడిరది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లో ఉమ్మడి వివాహ చట్టం తెచ్చినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైన వాస్తవాన్ని మోదీ వాటంగా విస్మరించారు. ప్రస్తుతం ఉన్న వివాహ చట్టం మతతత్వంతో కూడినది అన్న మోదీ మాటలు నిజానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డా. బి.ఆర్.అంబేద్కర్ ను అవమానించడమే. ప్రధానమంత్రి మోదీ ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ అన్న నినాదాన్ని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భుజాన వేసుకున్నారు. దీని మీదా బోలెడు చర్చ జరిగింది. దేశమంతటా ఒకసారి ఎన్నికలు జరగాలి అంటే లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలూ జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తరవాత సుమారు రెండు దశాబ్దాల పాటు ఇదే పద్ధతి కొనసాగింది. ఒక్కసారి కేరళలో మినహా అప్పుడు దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1956లో కేరళలో నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరవాత అక్కడ ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. 1967లో ఉత్తరాదిలోని తొమ్మిది రాష్ట్రాలలో ప్రతిపక్షాలు విజయం సాధించడంతో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ తొమ్మిది రాష్ట్రాలలో ప్రతిపక్షాల ఐక్య కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. వాటిని సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు అనేవారు. కానీ ఆ ప్రయోగం రెండు, రెండున్నరేళ్ల కన్నా కొనసాగలేదు. ఆ రాష్ట్రాలలో మళ్లీ ఎన్నికలు నిర్వహించవలసి వచ్చింది. అలాగే దాదాపు అదే సమయంలో తమిళనాడులో డి.ఎం.కె. అధికారంలోకి వచ్చింది. ఈ విషయాలన్నీ మోదీకి తెలియక పోయినా ఆయనకు ఉపన్యాసాలు రాసిచ్చే వారికి, సలహాలుఇచ్చే రవి శంకర్ ప్రసాద్ లాంటి వారికి ఈ చరిత్ర కచ్చితంగా తెలుసు. ఆ తరవాత వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలూ ఏర్పడడమే కాక ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భాలున్నట్టే అవి పడిపోయిన ఉదంతాలూ ఉన్నాయి. ఉమ్మడి ఎన్నికలు అసాధ్యం కావడానికి ఇంత చరిత్ర ఉండగా మోదీ మొండిగా ఉమ్మడి ఎన్నికల అంశాన్ని మళ్లీ ఎజెండాలో చేర్చడానికి కుటిల యత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఒక ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి అవకుండా పడిపోయినప్పుడు, రాష్ట్రాలలో ప్రభుత్వాలు పతనమైనప్పుడు మళ్లీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా అన్న సమస్యకు సమాధానం చెప్పకుండా ఉమ్మడి ఎన్నికల రాగం ఎత్తుకోవడంలో దేశమంతా తమ ఏలుబడే ఉండాలన్న స్వార్థ పూరిత రాజకీయ దృక్కోణాన్ని గమనించకుండా ఉండడం అసాధ్యం.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని కూడా సంకుచిత మతతత్వ దృష్టితోనే చూస్తున్నారు. అక్కడ హిందువుల మైనారిటీ పక్షానికి చెందినవారు కనక హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్న మాట వాస్తవమే. ఆ దాడులు మొన్నటి దాకా అధికారంలో ఉన్న షేక్‌హసీనా నాయకత్వంలోని అవామీలీగ్ కు చెందిన వారిమీదే జరుగుతున్నాయి. దాడులకు గురవుతున్న వారిలో కొంతమంది హిందువులూ ఉండొచ్చు. కానీ వారు హిందువులు అన్న కారణంగా దాడులు జరగడం లేదు. అవి రాజకీయ కక్షల వల్ల జరుగుతున్నవి మాత్రమే. 140 కోట్ల మంది భారతీయులు బంగ్లాదేశ్‌లోని మైనారిటీల సంక్షేమం కోసం ఆందోళన చెందుతున్నారట. ఆ సంక్షోభానికి రాజకీయ కారణాలే ఉన్నాయి కానీ మతతత్వ కోణం లేనేలేదు. మన దేశంలో ముస్లింల మీద జరుగుతున్న దాడులను మోదీ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. మణిపూర్‌లో పదిహేను నెలల నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధంలాంటి పరిస్థితి మోదీకి కలత కలిగించకపో వడం, ఆ విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గం. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన వీపు తాను చరుచుకోవడానికి మోదీ నానా పాట్లూపడ్డారు. తాను అవినీతిమీద యుద్ధం ప్రకటించానని గొప్పలు చెప్పుకున్నారు. బంధుప్రీతికి తాను వ్యతిరేకమట. మరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జే షా భారత క్రికెట్ సంఘం కార్యదర్శి ఎలా అయ్యారో! మోదీ డా.అంబేద్కర్ ను మాత్రమే అవమానించలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని స్వాతంత్య్ర దినోత్సవ నిండు సభలో ఎర్రకోట సాక్షిగా అవమానించారు. ఎర్రకోటలో జరిగిన ఉత్సవానికి హాజరైన రాహుల్ గాంధీ అయిదవ వరసలో కూర్చోవలసి వచ్చింది. మోదీ ప్రసంగంలో స్వోత్కర్షలు తప్ప స్ఫూర్తి కలిగించే అంశం ఒక్కటి కూడా లేదు.