asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

రైతుల గోడు వినని మోదీ ప్రభుత్వం

గత పదేళ్ల పాలనలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల దుస్థితిని పట్టించుకోలేదు. పైగా మూడు వ్యవసాయ దుష్టచట్టాలు తీసుకువచ్చి రైతులను మరింతగా కష్టాల్లోకి నెట్టాలని చూసింది. ఫలితంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో రైతులు బీజేపీకి ఓట్లు వేయకుండా ఓడిరచారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అయితే రైతులు తగిన సమయంలో మోదీ కుయుక్తులను గ్రహించి హర్యానా, పంజాబ్‌ రైతులతో సహా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ కలిసి దిల్లీ సరిహద్దుల్లో మహత్తర పోరాటం చేశారు. అంతిమంగా సమస్యను పరిష్కరించలేని మోదీ దుష్టచట్టాలను ఉపసంహరించుకొని తాత్కాలికంగా రైతులకు ఊరట కలిగించారు. చట్టబద్దమైన పంటలకు కనీసమద్దతు ధరను ప్రకటిస్తామని హామీ ఇచ్చి రెండేళ్లకుపైగా గడిపినప్పటికీ మోదీ మౌనమే సమాధానమైంది. వ్యవసాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బలే తగిలాయి. మోదీ పదేళ్ల పాలనలో పూర్తిగా సంపన్నులు, కార్పొరేట్లకు అనుకూల విధానాలు అనుసరించి రైతుల, కార్మికుల, సామాన్యప్రజల బాగోగులను పట్టించుకున్న సందర్భమేలేదు. చివరకి కోవిడ్‌19 మహమ్మారి దేశ ప్రజలను వణికిస్తున్న సమయంలో సైతం బడాపారిశ్రామిక వేత్తలకు1.45లక్షల కోట్ల రాయితీలను మోదీ ప్రకటించి ప్రజాపాలనను విస్మరించారు. మోదీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌లలోనూ రైతులకు అన్యాయమే జరిగింది. మోదీ ప్రభుత్వపాలన రాకముందు ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌లలోనూ గణనీయమైన సానుకూల కేటాయింపులు జరిగాయి. అంతక్రితం వామపక్షాల తోడ్పాటుతో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వ కాలంలో రైతుల బకాయిలలో 60వేల కోట్లను రద్దు చేశారు. ఇది జరగకపోయి ఉంటే రైతులలో అసంతృప్తి వ్యవసాయ సంక్షోభం సద్దుమణిగేది కాదు. రైతులు ఏడాదికి ఆరువేల రూపాయల సహాయం అందించి అది గొప్ప మేలుచేసినట్లు మోదీ ప్రచారం చేసుకున్నారు. 20152022 మధ్యకాలంలో లక్షా నాలుగువందల డెబ్బయ్‌ నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర నమోదు బ్యూరో ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించే గణాంకాలకు వాస్తవంగా జరిగిన ఆత్మహత్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రైవేటు సర్వే సంస్థలు ప్రకటించాయి. దేశంలో వ్యవసాయరంగం సంక్షోభం, రైతుల దుస్థితి ఎలా ఉందన్నది స్పష్టమైంది. ఆయా రాష్ట్రాలలో కౌలుకు పొలాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోలేక వారు కూడా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరి గోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. స్వామినాథన్‌ కమిషన్‌ అధ్యయనంచేసి కనీస మద్దతుధర సి2G50శాతం ఇవ్వాలని చేసిన సిఫారసును మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఇది అమలు జరగకపోతే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమయ్యే అవకాశమే ఉండదు. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతుధర ఇస్తే రైతు కొంతైనా సంక్షోభం నుంచి బైటపడలేడు. ఈ ధరను అమలు చేయడానికి త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తగినన్ని కేటాయింపులు జరిగితీరాలి. ఇది రైతుల ముఖ్యమైన మొదటి డిమాండ్‌.
రైతులకు మేలు జరిగి, సంతోషంగా వ్యవసాయం చేయడానికి వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఉపకరణాల ధరలు తగ్గించాలి. వీటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. అందుకు ప్రభుత్వం వీటి ధరలు తగ్గించాలి. పురుగుల మందులు, క్రిమికీటకాల నిర్మూలనకు అవసరమైన రసాయనాల ధరలు తగ్గించాలి. వీటి ధరలు తగ్గించడానికి బడ్జెట్‌లో అనుకూల చర్యలు ప్రకటించాలి. వీటి ధరలన్నీ మరింతగా పెరుగుతుంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుచేసిన కనీస మద్దతుధరను ప్రకటించి, దాన్ని చట్టబద్దంచేసి అమలు జరిపినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యవసాయ ఉపకరణాలను కార్పొరేట్లు ఉత్పత్తి చేస్తున్నందున ధరల తగ్గింపును బడ్జెట్‌లోనే ప్రకటించాలి. రైతులు ఆశిస్తున్న మరో ముఖ్యమైన డిమాండ్‌ అప్పులు రద్దు చేయాలన్నది. ఇది జరిగితే రైతులు ఆత్మహత్యలను నిలువరించడం సాధ్యమవుతుంది. అప్పులు రద్దు చేస్తే 70శాతం వ్యవసాయ సంక్షోభం తగ్గుతుంది.
రుణాలను ఒకేసారి రద్దుచేసి వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి. వాతావరణ మార్పులు, దుస్థితిని గూర్చి ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. వర్షాభావంతో కరవు కాటకాలు, సీజన్‌కాని కాలంలో వర్షాలు, వడగండ్లతో కూడిన వర్షాలు దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో పంటల బీమాను ప్రకటించాలి. ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకుపైన ప్రకటించిన బీమా పూర్తిగా భిన్నమైంది. కొన్ని రాష్ట్రాలు తమ సొంత బీమా పథకాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రయోజనం కల్పిస్తున్నది. అందువల్ల రైతులకు ప్రయోజనం కల్పించే సమగ్ర పథకాన్ని ప్రవేశపెట్టాలి. మరో ముఖ్యమైన అంశం సాగుకు అవసరమైన నీరు, విద్యుత్‌ సరఫరా బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తే భారీగా రౖెెతులు సాగు చేయడానికి ముందుకు వస్తారు. ఉత్పత్తులు పెరుగుతాయి. అలాగే స్మార్ట్‌ మీటర్లతో వినియోగదారులు కల్లోలానికి గురవుతారు. విద్యుత్‌ ఉత్పత్తి కార్పొరేట్ల చేతుల్లో ఉన్నందున స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవి రైతులకు భారం కలిగిస్తాయి. కేంద్రప్రభుత్వం సంపద పన్ను, వారసత్వ పన్ను విధించి నట్లయితే సామాన్య ప్రజలకు మేలు కలిగించే పథకాలు చేపట్టవచ్చు. కేంద్ర బడ్జెట్‌లో రైతులకు కేటాయించే నిధులు భవిష్యత్‌లో ప్రభుత్వ మంచి చెడులను నిర్థారిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img