రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్‌ను లాభసాటి అంశంగా భావించిన అంబానీ, అదాని లాంటి సంపన్నులు విద్యుత్ రంగంలోకి వస్తున్నారు. నిన్న మొన్నటి దాకా విద్యుత్ రంగంలో కేవలం ఉత్పత్తికే పరిమితమైన కార్పొరేట్ సంస్థలు నేడు పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. బొగ్గు గనులు, దిగుమతులు, ఓడరేవులు, రవాణా వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న అదాని కంపెనీ ఇప్పుడు విద్యుత్ పంపిణీ రంగాన్నీ విడిచిపెట్టడంలేదు. రానున్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థలు అయిన ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ కనుమరుగై అదాని పవర్, అంబాని పవర్ అని ప్రజల ముందుకు వస్తాయా అనిపించే విధంగా పాలకుల విధానాలు ఉన్నాయి. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వాలు సంస్కరణలను తీసుకువస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. రాజకీయ పార్టీలు కూడా అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం అందిపుచ్చుకున్న తరువాత మరో మాట మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూర్చేలా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని పాలక పార్టీల నేతలైన చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సంస్కరణలపై అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో వున్నప్పుడు మరోమాట మాట్లాడటం అలవాటుగా మారింది. చంద్రబాబు అయినా, జగన్ మోహన్‌రెడ్డి అయినా ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా బీజేపీ చెప్పిందల్లా చేస్తూ జనంపై భారం మోపుతున్నారు. రాష్ట్రంలో జూన్‌లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌రంగాన్ని బలోపేతంచేసి ఆర్థిక, సాంకేతిక, సుస్థిరమైన, శక్తిమంతమైన, సమర్థమంతమైన వ్యవస్థను రూపొందించాలి అన్న మాటలకు విరుద్ధంగా పనిచేస్తున్నది. ప్రజలపై భారం పడేలా విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను నాడు వైసీపీప్రభుత్వం తీసుకువస్తే తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైఖరి మార్చుకున్నది. ఇప్పుడు విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల అమలుకు పూనుకున్నది. నాడు వ్యతిరేకించి నేడు అమలు చేయడమేమిటన్న ప్రశ్నకు ప్రభుత్వాధినేతల నుంచి సమాధానంలేదు. ప్రజలను వివిధ రూపాల్లో దోపీడీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగిస్తే బద్దలు కొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ రైతులను రెచ్చగొట్టింది, అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్లు కూడా వేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి గతంలో వ్యతిరేకించిన స్మార్ట్ మీటర్లను ఇప్పుడు కొనసాగించి వాగ్దాన భంగానికి పాల్పడుతోంది. విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను పెట్టేందుకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఇప్పుడు రాష్ట్రంలోని గోదాములకు స్మార్ట్ మీటర్లను అదాని కంపెనీ పంపుతోంది. అందులో భాగంగా నాలుగు కంటైనర్లలో ఈ స్మార్టు మీటర్లు ఇటీవల విజయవాడలోని సీపీడీసీఎల్ కార్యాలయానికి చేరుకోవడంతో విద్యుత్ స్మార్టు మీటర్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో 1.5 కోట్ల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను పెట్టేందుకు జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మేరకు 27.68లక్షల స్మార్ట్ మీటర్లను అదాని రాష్ట్రానికి పంపితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వీకరించి విద్యుత్ కార్యాలయంలో అదానీ సంస్థకు స్థలం కేటాయింపు జరిపి అక్కడ భద్రపరిచింది. ఈ మీటర్లను వెనక్కి పంపి, విద్యుత్ కార్యాలయంలో అదానీ సంస్థకు స్థల కేటాయింపు నిలిపివేయాలన్న వామపక్షాల డిమాండ్‌ను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఒత్తిడితో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తే నాడు వ్యతిరేకించిన టీడీపీ అధినేత నేడు అదే విధానాలను కొనసాగించడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి అద్దంపడుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగమై నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి మధ్యప్రదేశ్ సంస్కరణలకు మునుం పట్టింది. తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలుచేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాష్ట్రంలోని నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటి పంపిణీ కాంట్రాక్టులను అదానీ, షిరిడి సాయి తదితర కంపెనీలకు కట్టబెట్టింది. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు మంజూరులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రక్రియ అంతా అవినీతి మయమైందని ప్రజాసంఘాలు, రైతు సంఘాలు ఘోషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం విజయవాడతో సహా అనేక ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నది. వ్యవసాయ పంపు సెట్లకు, ప్రభుత్వ కార్యాలయాలలోను ఈ మీటర్లు బిగిస్తున్నారు. ఆ తర్వాత నివాస గృహాలకు బిగిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. మొదటి దశలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల పేరుతో క్రమంగా ఉచిత విద్యుత్‌కు ఎసరుపెట్టే ప్రమాదం వుంది. నివాస గృహాలకు మీటర్లతో ప్రీపెయిడ్లో విద్యుత్ వాడే సమయాన్నిబట్టి అదనపు చార్జీలు, మీటర్ల ఖర్చును వినియోగదారులపై వివిధ రూపాల్లో భారం వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. మీటర్ల పేరుతో వేలాదికోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతోనే కేంద్రం ఈ స్మార్ట్ మీటర్లను రుద్దుతోంది. కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు అందుతుండడంతో ఈ సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి.
విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు వీలుగా ఆంధ్రాతోపాటు పది రాష్ట్రాలకు అదనంగా అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రుణాల కోసం ఈ నిబంధనలు తప్పనిసరిగా మారాయి. ఇన్నాళ్లు రైతులకు ఉచిత విద్యుత్ అందగా కేంద్ర సంస్కరణలతో మోటార్లకు మీటర్లు బిగించనున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్‌కు ఇక నుంచి లెక్క పక్కా కానుంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ లెక్కను తేల్చేపనిలో నిమగ్నమయ్యాయి. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ అందించే ట్రాన్స్‌ఫాÛర్మర్లకు మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు మీటర్లను బిగిస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందుతుందా? లేదా? మీటర్లు బిగిస్తే బిల్లులు చెల్లించాల్సిందేనా అనే అనుమానాలు రైతుల బుర్ర తొలిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆదానీ, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసే ప్రక్రియ నిలిపివేయాలి. ఇప్పటికే బిగించిన మీటర్లను తొలగించాలి. లేకుంటే విద్యుత్ సంస్కరణలు, చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా 2000సంవత్సరంలో జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిం చాల్సిన అవసరం ఉంటుంది. 24 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అనేక ఉద్యమాలకు ఆ విద్యుత్ ఉద్యమమే ప్రేరణగా వుంది.