వైవిధ్యభరితమైన దేశంలో సమస్యలు, రాజకీయాలు కూడా విధిగా భిన్న రీతిలో ఉంటాయి. ఏడేళ్ల మోదీ పాలన అనేక ప్రతిపక్ష పార్టీలను పునరాలోచన చేయక తప్పని స్థితికి నెట్టింది. 1975 జూన్ నుంచి 1977 దాకా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ సర్వ శక్తిమంతురాలు అనుకున్న ఇందిరా గాంధీని సవాలు చేసే ధైర్యాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చింది. బోఫోర్స్ కుంభకోణం తరవాతి పరిస్థితులు కూడా ప్రతిపక్షాలను ఏకం చేశాయి. ఎక్కడైనా బీజేపీకి విజయం సాధించిపెట్టగల సామర్థ్యం మోదీ-అమిత్ షా ద్వయానికి ఉంది అన్న మాట ఇటీవలి బెంగాల్ ఎన్నికల్లో చెల్లలేదు. ఆయన నాయకత్వం మసకబారుతోంది. ప్రజలకు మొహం మొత్తుతోంది. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రతిపక్షాల ఐక్యత మళ్లీ చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. ఏడాది చివరలో గుజరాత్‌లో ఎన్నికలు జరగాలి. వీటిలో ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు. ఇటీవలి ఉత్తరాఖండ్ పరిణామాలను పరిశీలిస్తే, వెంటవెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చ వలసిన అగత్యం బీజేపీకి వచ్చిందంటే ఆ పార్టీలోనూ అంతా సవ్యంగా లేదని రుజువు అవుతోంది. బెంగాల్‌లో బీజేపీ ఆశలు వమ్ము కావడం పార్టీ ఫిరాయించిన నేతలకు కనువిప్పు కలిగించింది. మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. ఆధికార కాంక్ష బలీయమైనప్పుడు ఈ ధోరణి సహజమే. పాలకపక్షం దుష్పరిపాలన రాజకీయ పార్టీలనే కాదు ప్రజలను సైతం ప్రత్యామ్నాయం వేపు అడుగులు వేయిస్తుంది. ఈ క్రమ పరిణామానికి అనేక ఉదంతాలున్నాయి. 1967 దాకా కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది. దీనికి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రే కారణం. రెండు దశాబ్దాల కాంగ్రెస్ పాలన కొన్ని వర్గాలలోనైనా అసంతృప్తి పెంచింది. ఆశించిన ఫలితాలు దక్కకపోయే సరికి ప్రాంతీయ ఆకాంక్షలు బలంగా వ్యక్తమైనాయి. ప్రాంతీయ పార్టీలు పెరిగాయి. శక్తిమంతమైన కాంగ్రెస్‌ను గద్దె దించడానికి అప్పుడూ అనేక ఆలోచనలు సాగాయి. సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ప్రతిపక్షాల ఐక్యత మాత్రమే కాంగ్రెస్‌ను ఓడిరచగలుగుతుందని సూత్రీకరించారు. అదే మార్గంలో సైద్ధాంతికంగా ఏ రకమైన సారూప్యతా లేని అప్పటి భారతీయ జనసంఫ్‌ు, కమ్యూనిస్టులు కూడా తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి తరవాత 1967లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఏకం కాక తప్పలేదు. అయితే ఆ ప్రయోగం దీర్ఘకాలం నిలబడలేదు. కానీ వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలుఏర్పడడానికి, బలంపుంజుకోవడానికి అవకాశంఇచ్చింది. ప్రాంతీయ అభివృద్ధి, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. క్రమంగా కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఉంది. తమిళనాడు దీనికి మంచి ఉదాహరణ. అధికారం కోల్పోయి దాదాపు అయిదు దశాబ్దాలు గడుస్తున్నా అక్కడ కాంగ్రెస్ మళ్లీ అధికారం సంపాదించే అవకాశమే రాలేదు. బెంగాల్ పరిస్థితీ అదే. వామపక్ష ఫ్రంట్ మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉంది. ఆ తరవాత ఆ స్థానాన్ని ఆక్రమించింది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసే తప్ప కాంగ్రెస్ కాదు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయి. 2014 ఎన్నికలలో మోదీ బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ సంపాదించి పెట్టడం, 2019లో ఆ బలాన్ని మరింత పెంచుకోగలిగినందువల్ల ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కొంతైనా తగ్గింది.
కాంగ్రెస్ పాలనమీద విసుగుకలిగినప్పుడు ప్రతిపక్షాలు ఏకంకావడానికి ప్రయత్నించాయి. 1967లో తొమ్మిది రాష్ట్రాలలో సం యుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ఎమర్జెన్సీ అకృత్యాలు మొదటిసారి 1977 ఎన్నికలలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోవడానికి కారణ మయ్యాయి. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి రాగలిగారు. 1984లో ఇందిరా గాంధీ హత్య తరవాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లినప్పుడు అయిదింట నాలుగు వంతుల మెజారిటీ సంపాదించారు. కానీ బోఫోర్స్ కుంభకోణం 89లో కాంగ్రెస్‌ను కుదేలు చేసింది. కానీ రెండేళ్లయిన తిరగక ముందే, ఆ రెండేళ్లలో ఇద్దరు ప్రధాన మంత్రులు మారవలసిన పరిస్థితితో నేషనల్ ఫ్రంట్ ప్రయోగం విఫలమైంది. ప్రతిపక్షాలు ఐక్యమై ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా రెండేళ్ల కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులను చూడవలసి వచ్చింది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, మొదట్లో ఎన్.డి.ఎ. కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడినవే. ఇప్పుడు మళ్లీ మోదీ పాలన కేవలం మాయమాటలకే పరిమితమైందన్న భావన సామాన్య ప్రజల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కరోనాను ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం, హిందుత్వను రుద్దడానికి చేస్తున్న దాష్టీకాలు జనానికి మింగుడు పడడం లేదు. అంతకన్నా మించి పెగాసస్ వ్యవహారం, దాని మీద దర్యాప్తు చేయించడానికి ససేమిరా అనడంతో మోదీ పాలన మీద ఏహ్యభావం పెరుగుతోంది. సరిగ్గా ఈ దశలోనే మోదీని ఓడిరచడానికి ప్రతిపక్షాల ఐక్యత మళ్లీ చర్చనీయాంశమైంది. శరద్ పవార్ ఇటీవలే ఆ దిశగా కొన్ని అడుగులు వేశారు. కానీ బెంగాల్ విజయం మమతా బెనర్జీని కేంద్ర స్థానంలోకి చేర్చింది. ఆమెను ఓడిరచడానికి బీజేపీ చూపిన దూకుడు ప్రజలకు రోత పుట్టించింది. వరసగా మూడు సార్లు గెలిచిన మమత ఇప్పుడు కొత్త శక్తిని సంతరించుకున్నారు. అందుకే ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. జాతీయ స్థాయిలో తన పాత్ర ఉండాలను కుంటున్నారు. రెండేళ్ల తరవాత మొదటిసారి ఆమె దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌తో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులతో సమావేశం అయ్యారు. ఫలితంగా ప్రతిపక్ష ఫ్రంట్ అన్న మాట మరోసారి తెరపైకి వచ్చింది. శరద్ పవార్ కూడా ప్రతిపక్ష ఐక్యత వేపు దృష్టి సారించారు. అయితే మోదీని ఢీకొనగలిగే సామర్థ్యం ఉన్న ప్రతిపక్ష నాయకులెవరూ లేరుగా, 2024 ఎన్నికలలో ప్రతిపక్షాలు గెలిస్తే ప్రధానమంత్రి ఎవరు అన్న చొప్పదంటు ప్రశ్నలు సహజంగానే వ్యక్తం అవుతున్నాయి. ఇంకోవేపు యు.పి.ఎ. నాయకత్వాన్ని శరద్ పవార్‌కు అప్పగించాలన్న సూచనలనుంచి మమతకు అప్పగించాలన్న ప్రతిపాదనలూ పెల్లుబుకుతున్నాయి. మోదీని ఓడిరచడం చారిత్రక కర్తవ్యం అన్నది జనం మనసుల్లోని మాట. దీటైన నాయకుడి కొరత ప్రజల అభీష్టాన్ని అడ్డుకోలేదు. వి.పి.సింగ్, దేవగౌడ ప్రధానులైనప్పుడు వారి అభ్యర్థిత్వం మచ్చుకైనా చర్చకు రాలేదు. అంతెందుకు జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొరార్జీ ప్రధాని అవుతారన్న ఆలోచనైనా లేదు. పరిస్థితులు నాయకుడిని తయారు చేస్తాయి. ఇప్పుడూ అదే జరగాలి. ప్రతిపక్షాల మధ్య ఏక శ్రుతి లేదు అన్న మాట నిజమే. కానీ ప్రధాన లక్ష్య సాధనకు సర్దుబాట్లు అవసరం. మోదీ ఓటమి ప్రజల ఆకాంక్ష. అదొక్కటే ప్రతిపక్షాలను ముందుకు నడిపించాలి.