కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద ఎన్నికల బాండ్లను అడ్డుపెట్టుకుని బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇది నేరపూరిత కుట్ర అని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్.ఐ.ఆర్.) దాఖలు చేశారు. ఈ ఎఫ్.ఐ.ఆర్. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలు కావడం మరింత విశేషమైన అంశం. ఈ ఎఫ్.ఐ.ఆర్.లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇ.డి.) అధికారుల, కొందరు బీజేపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. బెంగళూరులోని జనాధికార సంఘర్ష పరిషత్‌కు చెందిన ఆదిత్య అయ్యర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మలా సీతారామన్, తదితరుల మీద ఎఫ్.ఐ.ఆర్.నమోదైంది. ఇ.డి.అధికారుల ఒత్తిడి కారణంగానే చాలా మంది ఎన్నికలబాండ్లు కొని వివిధ రాజకీయ పార్టీలకు ముట్ట చెప్పారు. ఇందులో బీజేపీకే ప్రధాన భాగం దక్కింది. అంటే బెదిరించి ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బు వసూలు చేశారు. ఈ ఎఫ్.ఐ.ఆర్.లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కొందరు ఇ.డి. అధికారుల, నళిన్ కుమార్ కతీల్ లాంటి బీజేపీ నాయకుల పేర్లు నమోదయ్యాయి. వ్యాపార సంస్థలను బెదిరించి కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్ల పేర బలవంతంగా వసూలు చేశారన్నది ఈ ఎఫ్.ఐ.ఆర్.లో ప్రధాన ఆరోపణ. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత, ముఖ్యంగా ఎన్నికల బాండ్లు అమలులోకి వచ్చిన తరవాత ఇ.డి. వ్యవహారాన్ని గమనిస్తే వారు తప్పుచేసి ఉండరన్న చిన్న అనుమానానికి కూడా తావులేదు. గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధమైనవి అని తీర్పు చెప్పింది. కానీ ఎన్నికల బాండ్ల రూపంలో సమకూరిన డబ్బును రాబట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించనూ లేదు. ఏ అధికార వ్యవస్థ ఇప్పటి దాకా ఆ పని చేసిందీ లేదు. అదే జరిగితే ఎన్నికల బాండ్ల ద్వారా అన్నింటికన్నా ఎక్కువ డబ్బులు సమకూర్చుకున్న బీజేపీనే అన్ని పార్టీలకన్నా ఎక్కువ డబ్బు కక్కాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో ఉన్నత న్యాయస్థానం ఇది చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తుందే తప్ప దానికీ నిష్కృతి ఏమిటో చెప్పదు. కాబట్టీ మొత్తం వ్యవహారం తీర్పుల గుట్టల్లోకి చేరిపోతుంది. కంచికి వెళ్లకుండానే కథ ముగుస్తుంది. నిర్మలా సీతారామన్ మీద ఎఫ్.ఐ.ఆర్. దాఖలై ఉండొచ్చు. కానీ ఆమె తనంత తాను ఇలా వసూళ్లకు పాల్పడే స్వతంత్రత, ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉన్న వారు కాదు. ఎన్నికల బాండ్ల వ్యవహారాన్నంతటినీ ఎవరు నడిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరవాత ప్రధానమంత్రి మోదీ కానీ ఎప్పుడూ ప్రధానిని వెనకేసుకొచ్చే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ ఈ బాండ్లు విడుదల చేయడం తప్పేనని ఒప్పుకున్న పాపానపోలేదు. ఎన్నికలబాండ్లు పూర్తి లోపరహితమైనవి కాకపోవచ్చునని, అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చునని ప్రధానమంత్రి మోదీ సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప అవి జారీ చేయడమే తప్పు అని ఎన్నడూ అంగీకరించలేదు. మోదీ లాంటి వారు చేసిన తప్పు ఒప్పుకుంటారని ఆశించడమే పొరపాటు. ఎన్నికల బాండ్లు వ్యాపారస్థులకు అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రదండమైంది. బాండ్లు అమలులో ఉన్న అయిదున్నరేళ్ల కాలంలో బీజేపీకి కనీసం ఆరువేల కోట్ల రూపాయలు దక్కాయి.
సాక్షాత్తు కేంద్ర ఆర్థికమంత్రి మీద ఇది వరకటి ఐ.పి.సి. (పేరు మారిన తరవాత భారతీయ న్యాయ సంహిత) 384 సెక్షన్ (బలవంతపు వసూళ్లు), సెక్షన్ 34 (ఉమ్మడి లక్ష్యం), సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని 42వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనితర సాధ్యమైన సాహసం ప్రదర్శించారు. ఎన్నికల బాండ్ల ఆసరాగా తమ ఖజానా నింపుకోవడానికి బీజేపీ నాలుగు మార్గాలు అనుసరించింది. ఒకటి: డబ్బివ్వండి, వ్యాపారానికి అనుమతులు పొందండి. దీన్ని ముందే డబ్బిచ్చి అనుమతి పొందడం లేదా ప్రీ పెయిడ్ అనొచ్చు. రెండు: కాంట్రాక్టు తీసుకోండి, విరాళం ఇవ్వండి. దీన్ని పని జరిగిన తరవాత డబ్బు ముట్ట చెప్పడం లేదా ప్రీ పెయిడ్ అనొచ్చు. మూడు: ఎన్నికల బాండ్ల పేర బలవంతంగా విరాళాలు వసూలు చేయడం. దీన్ని దాడుల తరవాత వసూళ్లు అనొచ్చు. నాలుగు: డొల్ల కంపెనీల దగ్గర నుంచి డబ్బు లాగడం. ఈ డొల్ల కంపెనీలు ఎక్కువగా అదానీవేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇ.డి. ఎంత మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసిందో బహిరంగ రహస్యమే. మరెంత మంది ప్రతిపక్ష నాయకులను అక్రమంగా జైళ్లల్లో పెట్టిందో కూడా అందరికీ తెలుసు. ఇటీవలే హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర పన్వర్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ ఇ.డి. నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇ.డి.అవకతవకలను న్యాయస్థానాలు చీల్చి చెండాడినప్పుడు కూడా ఆ శాఖ అధికారుల మీద నిర్మలా సీతారామన్ ఉదాహరణ ప్రాయంగానైనా ఒక్కరంటే ఒక్కరి మీదనైనా చర్య తీసుకోలేదు. న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేంద్ర ఆర్థిక మంత్రికి చీమకుట్టినట్టైనా లేకపోవడం చూస్తే ఆమెపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించడం ఆశ్చర్యకరం అనిపించదు. ఎవరి మీదైనా దాడి చేయాల్సి వచ్చినప్పుడు ఇ.డి. అధికారులు అవినీతికి పాల్పడిన ఉదంతాలు కొల్లలుగా ఉన్నాయి. సందీప్ సింగ్ యాదవ్ అనే ఇ.డి. అధికారిని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణ కింద అరెస్టు చేశారు. గాజియాబాద్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఇ.డి.అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఇ.డి. అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి ఎవరినో తప్పించాడానికి రూ.5 కోట్ల లంచం అడిగినందుకు అరెస్టయ్యారు. బూటకపు దాడులు చేసి బెంగళూరులోని ఒక వ్యాపారి దగ్గర కోటిన్నర రూపాయల లంచం పట్టినందుకు నలుగురు అధికారులను అరెస్టు చేశారు. ఆ అధికారి దగ్గర 69 లక్షల నగదు, 306 గ్రాముల బంగారం దొరికింది. ఇ.డి. ఆర్థిక మంత్రిత్వశాఖలో భాగం. అలాంటప్పుడు ఇవన్నీ నిర్మలా సీతారామన్ కు తెలియదనుకోవడం కుదరదు. ఇప్పటికైనా ఆమె పెదవి విప్పలేదు. గతంలో ఒక శ్రీనివాసన్ అనే కోయంబత్తూరు వ్యాపారి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) వల్ల ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టినందుకు నిర్మాలా సీతారామన్ ఆయనను పిలిపించి మందలించినట్టున్నారు. అందుకే ఆయన వెళ్లి నిర్మలా సీతారామన్ ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పిన దృశ్యం బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడూ నిర్మలా సీతారామన్ కంటి తుడుపుగానైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తన మీద ఎఫ్.ఐ.ఆర్.దాఖలైన తరవాత కూడా ఆమె మౌన ముద్రలోనే ఉన్నారు. ఈ వ్యవహారాలన్నింటిలో తనకు నైతిక బాధ్యత ఉంది అనుకుంటే ఆమె ఎప్పుడో కేంద్ర మాజీ మంత్రి అయిపోయే వారు. ఆ స్వేచ్ఛ కూడా ఆమెకు ఉన్నట్టు లేదు.