నిత్య అబద్ధాలకోరుకు స్థల కాలాదులతో నిమిత్తం ఉండదు. అబద్ధం చెప్పడం అలాంటి వారిలో నరనరాన జీర్ణించుకు పోతుంది. ప్రధానమంత్రి మోదీ సరిగ్గా ఇలాంటి వారే. పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ దాదాపు 70సార్లు విదేశాలకు వెళ్లి వచ్చినప్పటికీ విదేశాంగ నీతి మీద కనీస అవగాహన లేక పోవడం విచిత్రమే కాదు వాస్తవం. విదేశీ గడ్డ మీద ఆయన సొంత డబ్బా వాయించుకోవడమే కాక ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించగలరు. ఆంతరంగిక సమస్యలను రచ్చకీడ్చగలరు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు గతంలో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ దేశ ఆంతరంగిక సమస్యలను ప్రస్తావించినందుకు, మోదీ నిరంకుశ విధానాలను దుయ్యబట్టినందుకు బీజేపీ గోల గోల చేసింది. దీనిమీద 2023లో రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్ కర్ అధ్యక్షతన పంచాయతీ కూడా పెట్టారు. ఆ సందర్భంగానే మోదీ విదేశీ గడ్డ మీద కనీసం ఆరుసార్లు ఆంతరంగిక సమస్యలను ప్రస్తావించారని రాహుల్ గాంధీ మేడిపండు లాంటి మోదీ పొట్ట విప్పి చూపించారు. మోదీ విదేశీ యాత్రలో ఉన్నప్పుడు 2014కు ముందు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానాన్ని గుండు గుత్తగా తప్పుపట్టడమే కాకుండా ఒక సారి కొరియా వెళ్లినప్పుడు తాను భారత్‌లో పుట్టడం తన దురదృష్టం అన్నారు. ఇది ఆయనలో ఉన్న దేశభక్తి ఎంత నీచ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక పండిత్ నెహ్రూ, ఇందిరా గాంధీ సుదీర్ఘ కాలం ప్రధానులుగా ఉండి ఉండొచ్చు. కానీ మోదీ పార్టీకే చెందిన అటల్ బిహారీ వాజపేయి ఆరేళ్ల కాలంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ విదేశీ యాత్రల్లో దేశాన్ని తూలనాడే నీచ స్థాయికి దిగజారలేదు. పైగా స్వాతంత్య్రానంతరం నెహ్రూ హయాంలో రూపొందించిన విదేశాంగ విధానాన్ని కొనసాగించడమే కాక కొనియాడారు. వాజపేయి జనతా పార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. జనతా పార్టీ పూర్తిగా కాంగ్రెస్ మీద, ఇందిరా గాంధీ మీద జనాగ్రహం కారణంగా అధికారంలోకి వచ్చింది. అయినా వాజపేయి సంయమం కోల్పోలేదు. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చలేదు. పోలెండ్‌లో యాత్ర ముగించుకున్న ప్రధానమంత్రి ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్నారు. ఉక్రెయిన్ అధినేత జెలిన్స్కీని మనసారా ఆలింగనం చేసుకున్న ఫొటోలు మన పత్రికల నిండా పరుచుకున్నాయి. ఆరు వారాలకు ముందు ఇదే మోదీ రష్యా అధినాయకుడు పుతిన్‌ను అంతకన్నా గట్టిగా ఆలింగనం చేసుకున్న ఫొటోలూ చూశాం. రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య 2022 ఫిబ్రవరి నుంచి యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కొనసాగిస్తున్న రెండు దేశాల అధినేతల పరిష్వంగంలో తరించిపోయిన మోదీ యుద్ధం నిలిపివేయించడానికి చేసిందేమీ లేదు. కానీ తాజాగా పోలెండ్ పర్యటనలో తన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఏకరువు పెట్టారు. అక్కడితో ఆగలేదు. స్వాతంత్య్రానంతరం నుంచి తాను అధికారం చేపట్టే దాకా భారత్ కొనసాగించిన విదేశాంగ విధానాన్ని తూర్పారపట్టారు. తాను అధికారంలోకి వచ్చే దాకా మన దేశం ప్రపంచంలోని అన్ని దేశాలకూ దూరంగా ఉండేదనీ తాను ప్రధాని అయిన తరవాతే అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించగలుగుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మన దేశం అన్ని దేశాలకు దూరంగా ఎప్పుడూ లేదు. మోదీ ప్రస్తావిస్తున్నది బహుశా అలీన విధానం అయి ఉంటుంది. అలీన విధానం గురించి మోదీకి కనీస పరిజ్ఞానం కూడా ఉన్నట్టు లేదు. ఉంటేనే ఆశ్చర్య పోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తరవాతే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తరవాత ఒక వేపున అమెరికా మరో వేపున సోవియట్ యూనియన్ నాయకత్వంలో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది. ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉండేది. ఈ స్థితిలో కొత్తగా స్వాతంత్య్రం సంపాదించిన దేశాలు ఈ రెండు శిబిరాల్లో దేనిలోనూ చేరకూడదని నిర్ణయించాయి.
ఆ పర్యవసానంగానే బాండుగ్ సమావేశం తరవాత అగ్రరాజ్యాలకు సమాన దూరం పాటించాలనుకున్న కొత్తగా స్వతంత్రమైన దేశాలు అలీనోద్యమానికి అంకురార్పణ చేశాయి. ఇందులో అప్పటి భారత ప్రధాని పండిత్ నెహ్రూ, ఈజిప్ట్ అధినేత అబ్దుల్ నాసర్, యుగొస్లావియా నాయకుడు మార్షల్ టిటో కీలక పాత్ర పోషించారు. వర్ధమాన దేశాలన్నీ అలీనోద్యమంలో భాగస్వాములయ్యాయి. ఈ చరిత్ర జ్ఞాన శూన్యుడైన మోదీ మనం అన్ని దేశాలకు దూరంగా ఉన్నామని అసత్య ప్రచారం చేస్తున్నారు. కొత్తగా స్వాతంత్య్రం సంపాదించిన భారత ప్రధాని పండిత్ నెహ్రూను ప్రపంచమంతా గౌరవించేది. అప్పట్లో అనేక రకాలుగా మన దేశ స్థాయికి సంబంధం లేకుండా గౌరవ మర్యాదలు ఉండేవి. నెహ్రూ అంతర్జాతీయ నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఎదిగి పోయారు. నెహ్రు మీద మోదీకి ఉన్న వ్యతిరేకతే నెహ్రు పునాది వేసిన అలీనోద్యమాన్ని ఖాతరు చేయకపోవడానికి ప్రధాన కారణం. అలీనోద్యమానికి నాయకత్వ స్థానంలో ఉన్న మన దేశం అప్పుడు కూడా రెండు అగ్రరాజ్యాల నాయకత్వంలోని శిబిరాల్లో చేరని మాట నిజమే కాని ఆ అగ్రరాజ్యాలతో స్నేహంగానే ఉంది. ఆ దశలో మనం ఏ దేశంతోనైనా దూరంగా ఉన్నామంటే అది జాతివివక్ష కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికాతో మాత్రమే. అప్పుడు ఆ దేశం తెల్ల వారి గుప్పెట్లో ఉండేది. ఆ దశలో కూడా మనం జైలులో మగ్గి పోతున్న నెల్సన్ మండేలాకు అండగా నిలబడ్డాం. అక్కడ జాతి వివక్ష అంతం అయి పోయిన తరవాత ఆ దేశాన్ని ఆలింగనం చేసుకున్నాం. మన క్రికెట్ బృందాన్ని సైతం దక్షిణాఫ్రికాకు పంపించాం. అవసరమైనప్పుడు అమెరికా సామ్రాజ్య వాదాన్ని నిటారుగా నిలబడి వ్యతిరేకించాం. నెహ్రూ నుంచి మోదీ గద్దెనెక్కే దాకా వాజపేయితో సహా ప్రధానమంత్రులందరూ కాలపరీక్షకు నిలిచిన ఈ విదేశాంగ విధానాన్నే అనుసరించారు. బంగ్లా దేశ్ అవతరణ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ సప్తమ నౌకా దళాన్ని పంపుతామని బెదిరిస్తే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బెదరలేదు. చెదరలేదు. మోదీ హయాంలో సాధించిందల్లా ఏమిటంటే విదేశీ పర్యటన సందర్భంగా అక్కడి భారతీయులను ఉద్దేశించి మహోపన్యాసం చేసి చప్పట్లు కొట్టించుకోవడమే. ఆయన సభలకు హాజరయ్యే భారతీయుల్లో 90 శాతం గుజరాతీలే ఉంటారు. మోదీ, మోదీ అని శివాలెత్తినట్టు కేకలు పెడ్తుంటారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఆ దేశాధినేతలు వచ్చి వారికి స్వాగతం చెప్పే వారు. ఆ దేశాల ప్రజలు తమ దేశం జెండాతో పాటు త్రివర్ణ పతాకం కూడా పట్టుకుని రోడ్ల మీద బారులు తీరి స్వాగతం చెప్పే వారు. మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఈ దృశ్యాలే అరుదు. అమెరికా గడ్డ మీంచి ట్రంప్ విజయం సాధించాలని ప్రచారం చేసిన అనుచిత ప్రవర్తన మోదీకి మాత్రమే సాధ్యం. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మన పొరుగున ఉన్న ఒక్క దేశంతో కూడా సఖ్యత లేకుండా పోయింది. విదేశాల్ల్లో గుజరాతీల ముందు తన వీపు తానే చరుచుకోవడం మోదీకే చెల్లింది. అక్కడ మరెవరూ మోదీకి హారతులు పట్టడం లేదు. పోలెండ్ పర్యటన ద్వారా మోదీ సాధించుకొచ్చేదీ లేదు. మహా అయితే అదానీ వ్యాపార ప్రయోజనాలు పెరగొచ్చు.