మోదీ హయాంలో అమలవుతున్న ప్రజాస్వామ్యానికి విదేశీ దౌత్యవేత్తల నుంచి మెచ్చుకోలు అవసరం కావడం మన ప్రజాస్వామ్య దుస్థితికే చిహ్నం. జమ్మూ-కశ్మీర్ లో పదేళ్ల తరవాత జరుగుతున్న శాసనసభ ఎన్నికలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న అనుమానం మోదీ ప్రభుత్వానికే కలిగినట్టుంది. అందుకే కొన్ని దేశాల దౌత్య వేత్తలను పిలిపించి జమ్మూ-కశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ను చూసే అవకాశం కల్పించారు. ఇలాంటి సందర్భాలలో వచ్చిన అతిథులు వారికి చూపించినవి మాత్రమే చూడగలుగుతారు. తమ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లి వాస్తవ పరిస్థితిని గమనించే వీలు వారికి చిక్కదు. తాము జమ్మూ-కశ్మీర్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో చూడడానికి వచ్చామని, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియ పోకడలను గమనించామని ఆ దౌత్యవేత్తలు నోరారా పొగిడారు. ఇంకేముంది జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసి, ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసి, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దు చేసిన అయిదేళ్ల కాలంలో అక్కడ అంతా సవ్యంగానే ఉందన్న సర్టిఫికేట్ మోదీ ప్రభుత్వం సంపాదించగలిగింది. ఎన్నికలు సవ్యంగా నిర్వహిస్తున్నట్టు, జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చాటి చెప్పుకోవడానికి మోదీ ప్రభుత్వం విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానించడానికి సిద్ధ పడిరది కానీ విదేశీ పత్రికా రచయితలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వార్తలు సేకరించడానికి మాత్రం తలుపులు మూసేసింది. దీనితోనే మోదీ ప్రభుత్వం ఏదో దాస్తోందని అర్థం అవుతోంది. అమెరికా, మెక్సికో, గయానా, దక్షిణ కొరియా, సోమాలియా, పనామా, సింగపూర్, నైజీరియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండా, అల్జీరియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 15 మంది దౌత్య వేత్తలు పోలింగ్ జరిగిన 26 నియోజక వర్గాలలో ప్రభుత్వం తీసుకెళ్లిన చోటికల్లా వెళ్లి మన ప్రజాస్వామ్య ప్రక్రియను పరిశీలించారట. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా మన ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానించడం బహుశ: ఇదే మొదటి సారి. ఈ నెలాఖరులోగా జమ్మూ-కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించి ఉండకపోతే శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించేది కాదేమో! సింగపూర్‌కు చెందిన దౌత్యవేత్త అలైస్ చైన్ ఇంతకు ముందు కూడా తాను కశ్మీర్ సందర్శించానని, కానీ ఇప్పుడు పోలింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం వచ్చిందని అన్నారు. ఎన్నికలు పండగలా జరుగుతున్నాయని, సింగపూర్ లో కూడా ఇలాంటి దృశ్యాలు చూడలేదని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విదేశీ దౌత్యవేత్తలకు అవకాశం ఇవ్వడం ఇది మొదటిసారి కావొచ్చు. కానీ 2019 ఆగస్టు 5న 370వ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత 2020 జనవరి 9న కూడా 15 మంది విదేశీ రాజకీయ నాయకులు కశ్మీర్ లో పర్యటించారు. జి-20 సమావేశాలు జరిగినప్పుడు కూడా విదేశీ ప్రతినిధి వర్గం శ్రీనగర్ లో పర్యటించింది.
తాము ఆహ్వానించిన విదేశీ దౌత్యవేత్తలు ఎన్నికల ప్రక్రియకు ‘‘సాక్షులే’’ తప్ప ‘‘పరిశీలకులు’’ కారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చుకుంది. అయితే ఈ దౌత్యవేత్తల అభిప్రాయం ఏమిటో మాత్రం ఇదమిత్థంగా తెలియదు. భద్రతా కారణాలవల్ల ఆ వివరాలు బయటపెట్టడంలేదట. అక్టోబర్ ఒకటవ తేదీన జరిగే తుది దశ పోలింగ్‌ను గమనించడానికి కూడా మరోసారి విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానిస్తారట. జమ్మూ-కశ్మీర్ ఎన్నికల ప్రక్రియను చూసే అవకాశం దౌత్యవేత్తలకు ఇచ్చినప్పుడు ఇతర దేశాల పత్రికా రచయితలకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని ప్రతిపక్షాలు ప్రశ్నించడంలో అనౌచిత్యం లేదు. కశ్మీర్ పరిస్థితి మీదే కాకుండా మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో లోపాలను విదేశీ వ్యవస్థలో, పత్రికల్లో ఎత్తి చూపినప్పుడు అది మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వం నానా యాగీ చేస్తుంది. ప్రభుత్వమే విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానించి ఎన్నికల ప్రక్రియను గమనించే అవకాశం ఇవ్వడం వారు మన అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు కాదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారు మోదీ ప్రభుత్వంలో ఎవరూ ఉండరు. మన వ్యవహారాల్లో ఇతర దేశాలవారు జోక్యం చేసుకోకూడదనుకున్నప్పుడు దౌత్యవేత్తలను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు. చూశారా కశ్మీర్ ఎన్నికల నిర్వహణా తీరును విదేశీ దౌత్య ప్రతినిధులు కూడా మెచ్చుకున్నారు అని మోదీ ప్రభుత్వం తన వీపు తాను చరుచుకోవడాన్ని మించిన ప్రయోజనం ఏమీ ఉండదు. జమ్మూ-కశ్మీర్ లో గత అయిదేళ్ల కాలంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తిగా స్తంభింప చేశారు. అక్కడి ప్రజలను నోరెత్తనీయలేదు. ప్రధాన ప్రతిపక్షాలు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే అవకాశమూ లేకుండా చేశారు. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికలలోనూ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న మాట నిజమే. లోకసభ ఎన్నికలనుగానీ, ఇప్పుడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలనుగానీ బహిష్కరించాలని కశ్మీర్‌లోని ఏ రాజకీయ పక్షం లేదా తీవ్రవాద సంస్థ పిలుపు ఇవ్వలేదు. అందుకే ఓటర్లలో ఉత్సాహం కనిపించింది. రాష్ట్ర ప్రతిపత్తి కోల్పోయి, 370వ అధికరణం రద్దు చేసిన తరవాత జరిగిన ఎన్నికలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడానికి కారణం అక్కడ సంపూర్ణ ప్రశాంతత నెలకొన్నదని కాదు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రజలు ఎన్నికలను ఒక అవకాశంగా భావించారు. అంతే. ఇందులో మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. తమను నోరు విప్పనివ్వడం లేదని ప్రజలు ఇప్పటికీ హీనస్వరంలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. గత అయిదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రజల నోళ్లకు తాళం వేసేసింది. విధిలేక సుప్రీంకోర్టు ఒత్తిడివల్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని ఇంతకు ముందు మోదీ సర్కారు ఇచ్చిన హామీ ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణనే ప్రధానాంశం చేశాయి. పరిపాలనా సౌలభ్యం కోసం పెద్ద రాష్ట్రాలను చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదని ప్రజలు ఉద్యమించినప్పుడు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఉదంతాలున్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన చోద్యం మోదీ హయాంలోనే కనిపించింది. అయిదేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఆమోద ముద్ర వేస్తారో లేదో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత కూడా కొంత మేరకే తెలుస్తుంది. ఇటీవలి లోకసభ ఎన్నికలను, ఇప్పుడు శాసనసభ ఎన్నికలను జమ్మూ-కశ్మీర్ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి వచ్చిన అవకాశంగా భావిస్తున్నట్టున్నారు. ఇందులో ప్రభుత్వం స్వోత్కర్షలకు పోవాల్సిన అగత్యమే లేదు. విదేశీ దౌత్యవేత్తలచేత ఆమోద ముద్ర వేయించుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహించిందే తప్ప అద్భుతం ఏమీ చేయలేదు.