దేశాభివృద్ధికి వైపరీత్యాలు పెద్ద ఆటంకంగా ఉన్నాయి. అదే సమయంలో మనిషి కలిగించే విపత్తులు కూడా వృద్ధిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలు అభివృధ్ధికి ఎంతో కీలకమైనవి. అలాగే నిరుద్యోగం, పేదరికం, ఆరోగ్యం, విద్య రంగాలు ప్రైవేటురంగం చేతుల్లోకి వెళ్లిసామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రకృతి పూర్తిగా కలుషితమై కలిగించే కోవిడ్`19 లాంటి మహమ్మారులు లక్షలాదిమంది మృత్యువాత పడటమేగాక, కోట్లాది మంది జీవనం తల్లకిందులవుతుంది. వీటిపట్ల ప్రభుత్వాలు శ్రద్ధ వహించకుండా, కార్పొరేట్ల అనుకూల విధనాలు అమలు చేసినట్లయితే వృద్ధి గురించి అంకెల్లో చూపించి సంబరపడటమే అవుతుంది గానీ, ప్రజల బతుకులలో వృద్ధి కనిపించదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలాదిమంది మరణించడమేగాక, లక్షలాది మంది జీవితాలు తల్లకిందులైపోతాయి. ప్రకృతి వైపరీత్యాలలో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ఒక్కసారిగా బురదతో కూడిన వరవదలవల్ల గ్రామాలకు గ్రామాలే మునిగిపోయి అంతుచిక్కని నష్టం కలుగుతుంది. తాజా విపత్తుకు కేరళలోని వయనాడ్‌లో జరిగిన విపత్తు ఉదాహరణ. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంకంటే రాజకీయ వైషమ్యాలు ప్రజలను మరిన్ని కష్టాలపాలు చేస్తున్నాయి. పంటలు దెబ్బతింటాయి. విద్య, వైద్యరంగాల సేవలు అందడం కష్టమవుతుంది. ఈ విపత్తులు ఎక్కడ సంభవించినా ప్రజలకు అపారనష్టం జరుగుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టులకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విపత్తుల పట్లపజల్లో చైతన్యం కల్పించడం ఎంతో అవసరం. అలాగే ప్రభుత్వాలు ఏర్పాటుచేసే ప్రకృతి వైపరీత్యాలవల్ల కలిగే రిస్క్‌ను తగ్గించడానికి ఏర్పాటుచేసిన యంత్రాంగం సకాలంలో రంగప్రవేశంచేసి సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. మానవ వనరులతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం మూలంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. వయనాడ్‌లో బాధితులను, మృతులను వేగంగా గుర్తించడానికి డ్రోన్లను ఉపయోగించారు. లోయల్లో, పర్వతప్రాంతాల్లో విపత్తులు జరిగినప్పుడు డ్రోన్లు బాగా ఉపయోగపడతాయి. భూకంపాలు, ఉప్పెన్లు, తీవ్ర తుపాన్లు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిపుణులైన యంత్రాంగాన్ని, అవసరమైన పరికరాలను, యంత్ర సామగ్రిని సిద్ధం చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. అలాగాకుండా ప్రతిపక్ష రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపినట్లయితే, పౌరులందరినీ సమంగా చూడాలన్న రాజ్యాంగంలో పొందు పరచిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇవేవీ అనుసరించకుండా, ఆచరించకుండా అత్యంత వేగంగా దేశాన్ని ప్రపంచంలో ఆర్ధికంగా 5వ స్థానంలో నిలుపుతామని, ఇది మాతోనే సాధ్యమవుతుందని గొప్పలు చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. ఒకవైపు బ్యాంకులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నాయని రిజర్వు బ్యాంకు వెల్లడిరచిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సామాన్యప్రజల జీవన ప్రమాణాలుపెరగకుండా గణాంకాలు చూపితే ప్రయోజనం ఉండదు.
1977 నవంబరులో ఆంధ్రప్రదేశ్ దివిసీమలో ఉప్పెన సంభవించి 30వేల మంది చనిపోవడమే గాక అనేక పదులు గ్రామాలు అంతులేకుండా పోయాయి. పొలాలు ఇసుకమయమై నేటికీ పంటలు పండకుండా తయారయ్యాయి. ఆనాడు వేలాదిమంది మరణించడమేకాక లక్షలాది మంది బతుకులు ఛిద్రమయ్యాయి. 1999లో ఒడిశాలో సూపర్ తుపాను సంభవించి 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలు, లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి.ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. 2001 కచ్ ప్రాంతంలో భూకంపం సంభవించి ఊహించలేనంత నష్టం కలిగించింది. అలాగే 2004లో హిందు మహాసముద్రంలో సునామీ సంభవించింది. ఉత్తరాఖండ్, అరుణాచల ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో ప్రతి ఏటా ప్రకృతి బీభత్సాలు జరిగి ఊహించలేనంతగా నష్టం కలిగిస్తుంది. ఈ నేపధ్యంలో 2005లో జాతీయవిపత్తుల నిర్వహణ చట్టం రూపొందించారు. దీని కింద జాతీయ విధ్వంస నిర్వహణ సంస్థ పనిచేస్తుంది. ఇది విపత్తు నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ముందుగా నిర్ధారించే సమయంలో అన్ని యంత్ర పరికరాలతో సిద్ధంగా ఉండాలి. ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో పనిచేసే యంత్రాంగం అప్రమత్తం కావడమేగాక, ప్రజలను చైతన్యపరిచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితర సహాయ కార్యక్రమాలకు సిద్ధపడాలి. అయితే ఈ విషయంలో పాలకులు ముందుగానే సిద్ధపడే సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. ప్రజలు నిత్య జీవితంలో తలమునకలై ఉండి తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడం ఉంటుంది. ప్రజలను చైతన్యపరిచేందుకు జాతీయ స్కూలు రక్షణ కార్యక్రమం కింద 22 రాష్ట్రాలలో 43 జిల్లాల పరిథిలో 8600 స్కూళ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఎంత సమర్థంగా పని చేస్తున్నాయని చెప్పడం కష్టం. వాతావరణంలో అపారమైన మార్పులు వచ్చాయి. జీవావరణం అంతా కలుషితమైంది. నీరు, గాలి, భూమి తదితర సర్వ వ్యవస్థలూ కలుషితం కావడం, రోజు రోజుకీ భూతాపం పెరిగిపోతున్నందున ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. వీటి పట్ల ఇప్పటికైనా జీవన విధానంలో సమూల మార్పులు జరగకపోతే మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ వేగంగా, క్రియాశీలంగా పనిచేయాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేస్తోంది. విధ్వంసక అభివృద్ధి జరిగినా అది అంతగా ప్రయోజనం కలిగించదు.