హిండెన్ బర్గ్ సంస్థ రెండో బాంబు పేల్చింది. దీని మీద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఖండన వచ్చింది. అదానీ ఖండనా వచ్చింది. సెబీ అధ్యక్షురాలు మాధవి బుచ్ ఆమె భర్త ధవళ్ బుచ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను తిరస్కరించడమూ జరిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేశ్ హిండెన్ బర్గ్ తాజాగా వెల్లడిరచిన అంశాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.) తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ వెంటనే కుదరదనేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి సీతారామన్ ఎప్పటిలాగే పెదవి విప్పనే లేదు. కానీ రవి శంకర్ ప్రసాద్ జె.పి.సి దర్యాప్తును నిరాకరిస్తారు. మోదీ ప్రభుత్వం నడుస్తున్న తీరునుబట్టి రవి శంకర్ ప్రసాద్ మాటే అంతిమం అనుకోవాల్సి వస్తుంది. హిండెన్‌బర్గ్ కూడా తన అభిప్రాయం మరోసారి వెల్లడిరచింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాధవి బుచ్, ధవళ్ బుచ్ ఖండనను ఈకకు ఈక తోకకు తోక తీసి అసలు రహస్యం బయట పెట్టడానికి ప్రయత్నం చేశారు. ‘‘మీరు బినామీ నిధుల్లో పెట్టుబడి పెట్టే అనుభవం ఉన్న వారు కదా అదానీ గురించి ఏ తప్పిదమూ కనిపించలేదా’’ అని మహువా మొయిత్రా ఎద్దేవా చేశారు. మొట్టమొదటి హిండెన్ బర్గ్ నివేదిక 2023 జనవరిలో వచ్చింది. రెండో నివేదిక రెండు రోజుల కింద వచ్చింది. మొదటి నివేదిక వచ్చిన నెలా పదిహేను రోజుల తరవాత మాధవీ బుచ్ ఒక విదేశీ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నేను చాలా రోజులు ప్రైవేటు రంగంలో పని చేశాను. ఈ రంగాన్ని నియంత్రించే సెబీలో పని చేయడం ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాను’’ అని చెప్పారు. సెబీ అధిపతిగా ఆమె అదానీ లొసుగులను బయటపెట్టలేదు. కానీ తానే 2015లో విదేశాల్లోని అదానీ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటిలో ఆమె భర్తకు కూడా పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయం సెబీ అధిపతిగా ఆమెను నియమించిన వారికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుంది. నిజానికి అదానీ సిఫార్సు మీదే ఆమెను సెబీ అధిపతిని చేశారు. ఆమె హయాంలో అదానీ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరగడానికి అడుగడుగునా అడ్డుపడ్డారు. హిండెన్ బర్గ్ రెండో నివేదిక ఈ అంశాన్ని బలపరుస్తోంది. హిండెన్ బర్గ్ ఇచ్చిన వివరణ తన నివేదికలోని ఆరోపణలను పునరుద్ఘాటించింది. అదానీ, మోదీకి మధ్య బంధం గురించి చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. రెండో నివేదిక వెలువడ్డ తరవాత మోదీ-అదానీ మధ్య బంధం ఎంత గహనమైందో అర్థమై పోయింది. తాను, తన భర్త సింగపూర్ లో ఉన్నప్పుడు విదేశాల్లోని అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టామని అంగీకరించారు. అదానీ కంపెనీలు ఎంత మహత్తరమైనవో ఆమె అనేక సార్లు కితాబు ఇచ్చారు. ఏ ప్రైవేట్ కంపెనీల నడవడిక మీద నిఘా వేసి ఉంచాలో వాటినే ఆమె నోరారా పొగడుతున్నారు అంటే ఆమె ఆంతర్యం ఏమిటో, తన అధికార పీఠం నుంచి ఆ డొల్ల కంపెనీల మీద ప్రశంసల జల్లు కురిపించి పనిలో పనిగా సొంత లాభం బాగానే చూసుకున్నారు అనడానికి సంశయించవలసిన అగత్యమే లేదు. మాధవీ బుచ్ సెబీ అధిపతిగా ఉన్నప్పుడు అదానీకి చెందిన అనుమానాస్పదమైన కంపెనీలపై దర్యాప్తే జరగలేదు. కాదు ఆమె జరగనివ్వలేదు. సెబీ అపఖ్యాతి పాలు కావడం ఇదే కొత్త కాదు. 15 ఏళ్ల నుంచే సెబీ మీద ఉన్న విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వచ్చింది. మాధవి బుచ్ పుణ్యమా అని సెబీ మీద జనానికి ఉన్న నమ్మకం దూది పింజంలా ఎగిరిపోయింది. ఇది విశ్వాస ఘాతుకం. బుచ్ ఉదంతంవల్ల అదానీ మీదే కాక మోదీ మీద కూడా నీలి నీడలు దట్టంగా కమ్ముకోక తప్పదు. విశ్వాస ఘాతుకానికి పాల్పడిరది కేవలం మాధవి బుచ్ మాత్రమే కాదు. మోదీ పాత్రా అందులో నిరాకరించడానికి వీలు లేదు. హిండెన్ బర్గ్ రెండో సారి వెల్లడిరచిన అంశాలపై తాము జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం బాహాటంగా చెప్తోందంటే మోదీ పీకలోతుల్లో దాకా ఈ కుంభకోణంలో కూరుకు పోయినందువల్లే.
తన భర్త ధవళ్ బుచ్‌కు ఉపాధి కల్పించిన కంపెనీలను ప్రశంసించి ఆ కంపెనీల అక్రమాలు బయట పడకుండా ఉండడమే కాక సొంత లాభాలు నొల్లుకోవడానికి మాధవి చేయగలిగిందల్లా చేశారు. 2023లో మొదటిసారి హిండెన్ బర్గ్ అదానీ గుట్టు విప్పిన తరవాత అనేక తరహాల దర్యాప్తులు జరిగాయి. కానీ నియంత్రాణాధికారం ఉన్న సెబీ చేసింది శూన్యం. చివరకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తులో కూడా వడ్ల గింజలోనిదే బియ్యపు గింజ అని తేల్చారు తప్ప అదానీని బోనెక్కించనే లేదు. మాధవి బుచ్ అధీనంలోని అగోరా కంపెనీ ద్వారా తనకు ఎంత ఆదాయం వస్తోందో కూడా మాధవి వెల్లడిరచలేదని కూడా హిండెన్ బర్గ్ నివేదికలో పేర్కొన్నారు. విదేశాల్లో గౌరవనీయమైన, ప్రధానమైన భారత మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నా మాధవి బుచ్ మాత్రం అనుమానాస్పదమైన తనకు లాభం చేకూరుస్తాయి అనుకున్న కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టారు. మాధవి బుచ్ మీద ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తుంటే అది విదేశీ కంపెనీ అనీ, మన దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికే ఇలాంటి పనులు చేస్తోంది అని ఎదురు దాడి చేస్తోంది బీజేపీ. అది విదేశీ కంపెనీ అయినంత మాత్రాన ఆరోపణలు తీవ్రమైనవి అయినప్పుడు దర్యాప్తునకు ఆదేశించడానికి మోదీ సర్కారు భయపడడమే అదేదో జరగ కూడనిది జరిగిందని అనుకోవాలి. పైగా ప్రతిపక్ష ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని మోదీ నిరాధారమైన ప్రచారం చేస్తూ తన అసత్య ప్రచారాన్ని మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. అదానీ కుంభకోణా ల్లాంటివి ఎదురైనప్పుడు సెబీ నిజం నిగ్గు తేలుస్తుందనుకోవడమే భ్రమ. ఈ దురాగతాలను అరికట్టడానికి భిన్నమైన మార్గాలను అనుసరించ వలసిందే. జె.పి.సి. దర్యాప్తుకు అక్షేపణ అక్కర్లేదు కానీ బాధ్యతా యుతమైన పౌరులు, ఆర్థిక అంశాల మీద పట్టున్న ప్రముఖులు, పత్రికా రచయితలు నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంవల్లే ఎక్కువ ఫలితం ఉండొచ్చు. దానికి తోడు కుంభకోణాలు మన ఆర్థిక వ్యవస్థను ఎలా కుళ్లబొడుస్తున్నాయో, అదానీ లాంటి వారు రోజుకు వందల కోట్ల రూపాయల లాభం ఎలా గడిస్తున్నారో, వ్యాపార సంస్థలను నియంత్రించవలసిన సెబీ లాంటివి ఎంత నిర్వీర్యం అయిపోయాయో జనానికి తెలియ చేయడానికి సదస్సులు, గోష్ఠులు నిర్వహించాలి. జన సంక్షేమాన్ని కాంక్షించే వారు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. క్షేత్ర స్థాయిలో ఇలాంటి ప్రచారం చేస్తే తప్ప మోదీ లాంటి అదానీకి నమ్మిన బంట్ల ఆట కట్టించడం కుదరదు.