భారతీయ జనతా పార్టీ విభిన్నమైంది అనే సాహసం ఇప్పుడు చేయలేం. హర్యానా శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో కొంత మంది మత్రులతో సహా అనేక మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు నిరాకరించడంలో బీజేెపీ తీరే వేరు. అందువల్ల విశిష్టమైన పార్టీ అనొచ్చు. ఆ విశిష్టత చాలా మందిని మాజీ మంత్రులను, మాజీ శాసనసభ్యులను చేయడంలో ఉంది. అనేక సంవత్సరాలుగా బీజేపీని నమ్ముకుని ఉన్న వారికి టికెట్లు లేకుండా చేసిన బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం ఉదారంగా టికెట్లు ఇచ్చేస్తోంది. 90 స్థానాలున్న హర్యానా శాసనసభకు పోటీ చేసే 67 మంది జాబితా బీజేపీ ప్రకటించేసింది. హర్యానా బీజేపీ నాయకుల పని ఇప్పుడు తల గొరిగించుకుంటే వడగండ్ల వాన అన్న చందంగా తయారైంది. ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే చాలా సందర్భాలలో రాజకీయ పార్టీలలో పొగలు, సెగలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు టికెట్లు ఆశించిన, దీర్ఘకాలికంగా బీజేపీనే నమ్ముకున్న వారిని బీజేపీ అధిష్ఠానవర్గం ఉపేక్షించింది. వారు నొచ్చుకుంటున్నారు. మొహం మాడ్చుకుంటున్నారు. టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవగలమన్న ధీమా, ఆత్మ విశ్వాసం, నమ్మకం ఉన్న వారు తిరుగుబాటు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధ పడుతున్నారు. వీరందరూ జనబలం ఉన్న వారని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అయితే గెలిచే అవకాశం ఉన్న బీజేపీ నేతలకు, టికెట్ ఆశించిన వారికి నిరాశే మిగులుతోంది. నాలుగు రోజుల ముందు, రెండు రోజుల ముందు ఇతర పార్టీలలో ఉన్న వారు బీజేపీలోకి ఫిరాయిస్తే బీజేపీ నాయకత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించి టికెట్లు కేటాయిస్తోంది. అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ అధినాయకత్వం కొన్ని వారాల నుంచే కసరత్తు చేస్తోంది. 67 మందితో మొదటి జాబితా రాగానే కనీసం డజను స్థానాల్లో తిరుగుబాట్లు మొదలైంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ముగ్గురికి టికెట్లు దక్కనే లేదు. తాజాగా బీజేపీలో చేరిన ఫిరాయింపుదార్ల మెడలో టికెట్ల హారం వేస్తోంది. రణ్‌జిత్‌సింగ్ చౌతాలాకు టికెట్ దక్కనందువల్ల ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నిజానికి గతంలో ఆయనా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేర్చుకున్న అరగంటలోనే ఇదివరకు టికెట్ ఇచ్చారు. ఇటీవల ఆయనను లోక్‌సభకు పోటీ చేయిస్తే ఓడిపోయారు. అందుకే ఆయనకు ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. ఇప్పటికే 67 మంది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు కనక మిగిలిన 23 మందిలో ఎంత మంది ఫిరాయింపుదార్లకు అవకాశం ఇస్తారో చూడాలి. ఇంతకు ముందు నవీన్ జిందాల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరితే ఆయనకు ఏకంగా మంత్రిపదవి దక్కింది. ఆయన తల్లి ఒకప్పుడు కాంగ్రెస్ శాసన సభ్యురాలు. గంపెడాశ పెట్టుకున్న ఆమె బీజేపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు. విచిత్రం ఏమిటంటే అత్యాచారం, హత్యకు పాల్పడినందుకు జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా బాబా రాం రహీం సింగ్‌కు ఆరుసార్లు పెరోల్ మంజూరు చేసిన జైలర్ సునిల్ సంగ్వాన్‌కు మాత్రం టికెట్ ఇచ్చారు. ఆయన ఇటీవలే జైలర్ ఉద్యోగం మానేసి బీజేపీలో చేరారు. ఏ ఎన్నికలు జరిగినా రాం రహీంకు ఉదారంగా పెరోల్ మంజూరు చేసినందుకు బీజేపీ నాయకత్వం ఆయన మెడలో వరమాల వేసినట్టుంది. కవితా జైన్ అనే నాయకురాలు హర్యానా శాసనసభలో బీజేపీకి నాలుగు స్థానాలే ఉన్నప్పుడూ బీజేపీ జెండా మోశారు. ఈ సారి ఆమెకూ టికెట్ దక్కలేదు. నిజానికి టికెట్ల పంపిణీ కోసం మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమెకు టికెట్ ఖరారైంది. అంతిమ జాబితాలో మాత్రం ఆమె పేరు లేదు. రైతుల ఉద్యమానికి హర్యానా పెట్టింది పేరు. కానీ కిసాన్ మోర్చా అధ్యక్షుడికీ బీజేపీ శూన్య హస్తం చూపడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తమది కార్యకర్తల పునాదిపై లేచిన పార్టీ సౌధం అని బీజేపీ పదే పదే చెప్పుకుంటుంది. పోలింగ్ కేంద్ర స్థాయిలోనే కాదు, ఓటర్ల జాబితాలో ఒక పేజీకి బాధ్యులైన కార్యకర్తలు ఉన్నారని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది, కానీ వారికి దక్కుతున్నది ఏమీ లేదు. ప్రస్తుతం హర్యానాలో జన నాయక్ జనతా పార్టీ (జె.జె.పి.) తో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా దాన్ని దివాలా తీయించడం బీజేపీ ప్రత్యేకత. ఆ ఒరవడిలోనే జె.జె.పి. లోని ఏడుగురిని తమ పార్టీలో చేర్చుకుంది. వీరు టికెట్లు ప్రకటించడానికి రెండు రోజుల ముందే పార్టీలో చేరారు. జె.జె.పి. ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడవలసి వస్తోంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఇదివరకు కర్నాల్ నుంచి గెలిచారు. ఈ సారీ ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తానని ఢంకా మీద దెబ్బవేసి మరీ చెప్పారు. కానీ అధినాయకత్వం ఆయనను లాడ్వా నుంచి అభ్యర్థిగా ఖరారు చేసింది. లాడ్వా నియోజక వర్గంలో బీజేపీ కిందటి ఎన్నికలలో ఓడిపోయింది. సైనీ ఓ.బి.సి. వర్గానికి చెందిన వారు. కానీ జాట్లు ఎక్కువగా ఉండే లాడ్వా నుంచి ఆయనను పోటీ చేయించడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సైనీ ఆరు నెలల ముందే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు అవకాశం ఉన్న చోటి నుంచి పోటీ చేయడానికి బీజేపీ అధినాయకత్వం మోకాలు అడ్డింది. కరణ్ దేవ్ కాంబోజ్ ఒ.బి.సి. నాయకుడు. బీజేపీ ఒ.బి.సి. విభాగం అధ్యక్షుడు. అయినా ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయనా బీజేపీకి రాజీనామా చేశారు. సాధారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రంలో మోదీ ఆసుపోసినట్టు పర్యటిస్తుంటారు. మొన్న లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరవాత మోదీ హర్యానాలో కాలేమోపలేదు. హర్యానాలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రభుత్వ నిర్వహణ మాత్రం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచే సాగుతుంది. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహకవర్గంపై బీజేపీకి పట్టు ఉన్నందువల్ల మొన్నటిదాకా కోల్‌కతా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలోచేరి మొన్నటి ఎన్నికలలో ఎంపీ అయిపోయారు. ఇదంతా చూస్తూ ఉంటే బీజేపీ దిగుమతి చేసుకున్న నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. లోక్‌సభలో బీజేపీ సభ్యులలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. తాము వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమని బీజేపీ టముకు వేసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంపిక చేసిన 67 మందిలో ఆరుగురు ఆనువంశిక రాజకీయాల కారణంగానే టికెట్ సంపాదించారు. ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని బీజేపీ ఎంత గట్టిగా అరిచి చెప్పుకున్నా వారికే ఉదారంగా టికెట్లు కేటాయిస్తోంది. దేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో నాలుగో స్థానంలో ఉన్న సావిత్రి జిందాల్‌కూ నిరాశే మిగిలింది. బీజేపీ వల్లించే నీతులు ప్రచారానికే పరిమితం.