. తక్షణ సాయంగా రూ.20 వేలు
. వాణిజ్య పంటలకు రూ. లక్ష ఇవ్వాలి
. వరద ప్రాంతాల సందర్శనలో రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర – పెనుగంచిప్రోలు/ నందిగామ: వరద విపత్తును జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలనీ, వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి భాగస్వామ్యం చేయాలనీ, వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.20 వేలు అందించాలనీ సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో వరదకు దెబ్బ తిన్న అరటి తోటను, కొట్టుకుపోయిన పంట పొలాలను రామకృష్ణ, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు బుధవారం పరిశీలించి బాధితులను పరామర్శించారు, ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అధికారులు సమన్వయ లోపంతో వరద ఉధృతిని అంచనా వేయలేకపోవడంతో ప్రజాజీవనం స్తంభించిందని అన్నారు, పెనుగ్రంచిపోలు, ముచ్చింతల వద్ద మునేరు గండిని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలసి పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు, వరద వల్ల నష్టపోయిన వాణిజ్య పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున, ఇతర పంటలకు తక్షణసాయంగా 30 వేల రూపాయలు అందజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద సంభవించిందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై దృష్టి సారించాలన్నారు. వరద సహాయక చర్యల్లో సీపీఐ శ్రేణులు పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పుడు పరిశీలించిన అరటి తోట పూరిగ్తా దెబ్బతిన్నదని. ఈ రైతు10 ఎకరాలు వేస్తే వరదకు కొట్టుకు పోయిందనీ, రూ. 34 లక్షలు నష్టం వాటిల్లివుంటుందన్నారు. అలాంటి వారికి ఎకరానికి లక్ష రూపాయాలు చొప్పున పరిహారం ఇవ్వడంతోపాటు బీమా ద్వారా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని వరద బాధితులను ఆదుకోవాలని రామకృష్ణ సూచించారు. నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ మాట్లాడుతూ పెనుగంచిప్రోలు నుంచి ముచ్చింతాల వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయిందన్నారు. వరదకు కొట్టుకు పోయిన పొలాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ బెజవాడ దుఃఖ దాయినిగా బుడమేరు, ఖమ్మం దుఃఖ దాయినిగా మున్నేరు ఉందన్నారు. వరద ముంపునకు గురైన ప్రజలను ఆదుకోవాలనీ, వరి రైతుకు 30 వేలు. మిర్చి, పత్తి రైతుకు 50 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లంకొండ బ్రహ్మం, టీడీపీ మండల అధ్యక్షులు చింతల. సీతారామయ్య, తిరువూరు నియోజకవర్గం పరిశీలకులు గింజుపల్లి. రమేశ్, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు. కర్ల నాగేశ్వర రావు. సీపీఐ నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, మాజీ ఎంపీపీ పొన్నం నరసింహారావు, పద్మాల. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.