ఉక్కును ప్రైవేటీకరించే హక్కు బీజేపీకి లేదు
250వ రోజు దీక్షలో వక్తల స్పష్టీకరణ
విశాలాంధ్ర`కూర్మన్నపాలెం (విశాఖ) : స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదని వక్తలు స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని చెప్పారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం ఆర్చివద్ద కొనసాగుతున్న దీక్షలు మంగళవారానికి 250వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు, పోరాట సమితి నాయకులు 25 గంటల దీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఉక్కు ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు ఒక చరిత్ర ఉందని, 1970లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోవియట్ రష్యా సహకారంతో నిర్మాణం చేపట్టిందని, స్టీల్‌ప్లాంట్‌ను విశాఖపట్నంలో నిర్మించాలని అప్పట్లో ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చివరకు 32 మంది వీరులు రక్తం చిందించి బలిదానం చేస్తే వచ్చిన స్టీలు ప్లాంట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చౌకగా ప్రయివేటు వారికి అమ్ముతామంటే ఇక్కడి ప్రజలు అమాయకులు కాదన్నారు. అవసరమైతే బలిదానాలు చేసైనా విశాఖ ఉక్కును రక్షించుకుంటామని స్పష్టం చేశారు. సముద్ర తీరాన ఉన్న విశాఖ ఉక్కుపై అదానీ, అంబానీ కన్ను పడిరదని, ఇప్పటికే దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్న కేంద్రానికి విశాఖ ఉక్కు ఉద్యమ చరిత్ర తెలిసినట్టు లేదన్నారు. 35 సంవత్సరాలుగా సొంత గనులు లేకపోయినా, 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ఉక్కు ఫ్యాక్టరీ, 4 లక్షల కోట్ల రూపాయలకు ఉక్కు కార్మికులు అభివృద్ధి చేసి, 7.3 మిలియన్ టన్నుల ఉత్త్పత్తి సాగిస్తున్న ప్లాంట్‌ను విస్తరణ దిశకు తీసుకెళ్లి 11.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుంటే అభినందించడం మాని అమ్మేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోన సమయంలో కూడా లాభాల బాటలో పరుగులు తీస్తున్న ఉక్కు కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు. 250 కాదు వెయ్యి రోజులు అయిన ఉద్యమం ఆగదన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ జీఎస్‌ఎన్ రాజు, మాజీ డైరెక్టర్ ఆపరేషన్ కేకే రావు, స్థానిక ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీను, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ ఇన్‌చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు బి.గంగారావు, దల్లి గోవిందరెడ్డి, బొండా జగన్, రౌతు శ్రీనివాస్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్, మెల్లి ముత్యాలనాయుడు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారంపై తీసుకొన్న నిర్ణయాన్ని పునరాలోచించాలన్నారు. ఈ పరిశ్రమ ద్వారా అనేక వేల మందికి ఉపాధి లభిస్తోందని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. వేలమంది నిర్వాసితుల త్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి చేస్తే తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ దీక్ష శిబిరంలో సీపీఐ, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ, కేఎస్‌ఎన్ రావు, బోసుబాబు, యేల్లేటి శ్రీనివాసరావు, జె.రామకృష్ణ, మసేను రావు, జ్యోతి ప్రసాద్, కసిరెడ్డి సత్యనారాయణ, కోటేశ్వరరావు, కనకరాజు, బొబ్బరి సూర్య, జి.ఆనంద్ తదితరులు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ ప్రతినిధులు, 250 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి సంఫీుభావంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు ఇక్కడకు వచ్చి తమ సంతకంతో మద్దతు తెలియజేస్తున్నారు.