విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు, ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ సభ్యులుగా ఉంటారు. కన్వీనర్‌గా పురపాలక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష, కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచించనుంది. అభ్యర్థనల పరిశీలన, వివిధ రంగాలలోని ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది. వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది.
ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం
విశాఖ ఎర్ర మట్టి దిబ్బలను ఆనుకొని ఉన్న నేరెళ్ల వలస గ్రామంలోని భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూములు రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. భీమిలి మండలంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సర్వేనెంబర్ 118/ 5ఏ లో 250 ఎకరాలకుపైగా భూములను ఈ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. ఇవన్నీ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలోనే ఉన్నాయని మూర్తి యాదవ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వారసత్వ సంపదగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ చేయాలని మూర్తి యాదవ్ కోరారు. దీనిపై కలెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.