. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక
. భూమి… భుక్తి కోసం ఎర్రజెండాల పోరాటమే పరిష్కారం
. పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
విశాలాంధ్ర- కడప బ్యూరో : పేద ప్రజల భూములు ఆక్రమించుకున్న నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తామని, ఖబడ్డార్ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలవుతున్నా భూమి కోసం, భుక్తి కోసం పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలు నిరంతర పోరాటాలు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ సమస్యల పరిష్కారానికి ఎర్రజెండాలే నాంది పలుకుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన సూచించారు. మంగళవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అధ్యక్షతన బద్వేలులో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరసిస్తూ, భూ బాధితులకు అండగా నిలుస్తూ భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. ముందుగా సిద్ధవటం రోడ్డు నుంచి బద్వేలు నాలుగురోడ్ల కూడలి వరకు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాధితులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా పేదలకు సెంటు స్థలం మిగలకుండా భూ కబ్జాలకు యదేచ్ఛగా పాల్పడ్డారని, అయితే ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాటికి విముక్తి కలిగిస్తుందని ప్రజలు ఆశించినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భూ బాధితులతో సీపీఐ భారీ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లెలో వేల ఎకరాలను కబ్జా చేశారని తెలిపారు. బడి, గుడి, స్మశానం అనే తారతమ్యం లేకుండా యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని, ఆ విషయాలు బయటపడతాయని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్నే తగులబెట్టడం దురహంకారమన్నారు. భూముల ఆన్ లైన్ వచ్చిన తరువాత గెస్ట్ హౌస్‌ల్లో కూర్చొని రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారులు పేదలకు తెలియకుండానే వారి భూములను పెత్తందారులకు దోచిపెట్టారని విమర్శించారు. బద్వేలు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయని, టీడీపీ, వైసీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి కబ్జా చేస్తున్నా అడిగే నాయకుడు, ప్రశ్నించే అధికారి లేడని అన్నారు. ఈ కబ్జా కోరల్లో పేద, దళిత కుటుంబాలు ఎన్నో నలిగిపోయాయని, ఆ వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, వీటిని పాలకులు పరిష్కరించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అంటూ అధికారంలోకి వచ్చారని, కానీ ప్రజల సమస్యలను పక్కనపెట్టి అనవసర విషయాలను తెర పైకి తెచ్చి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చినమాట ప్రకారం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడం కోసం 3 సెట్లు, నగర ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలన్న మాటకు కట్టుబడి ఉండాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల పరిస్థితిపై రెవెన్యూ మంత్రి, గృహ నిర్మాణ మంత్రిని కలిసి వివరించామని, 8 లక్షల ఇళ్లను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలో కార్యరూపం దాలుస్తుందని హామీ ఇచ్చినట్లు వెల్లడిరచారు. భూమి, భుక్తి కోసం పోరాటాలు చేసింది ఒక్క ఎర్రజెండాలేనని, తెలంగాణా ఉద్యమ సమయంలో 10 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన ఘనత ఎర్రజెండాలదేనన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలోని ఆలూరులో పోరాటాలు చేసి పేదలకు ఇళ్లకు, వ్యవసాయానికి కావాల్సిన భూములను సమకూర్చింది ఎర్రజెండాలేనని ఆయన చెప్పారు. కడప జిల్లా బద్వేలులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రామకృష్ణ స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఎక్కువగా అటవీ, బంజరు, పోడు భూములు ఉన్నాయని, ఇక్కడ పేదలకు నివాసాలకు, వ్యవసాయానికి పంపిణీ చేసినట్లయితే వలసలు తగ్గి పేదలు సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. కానీ పేదలకు అందాల్సిన భూములను పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని, వీటిని అరికట్టడానికి ఎర్రజెండాలు ఉద్యమరూపంలో ముందుకు కదులుతాయని హెచ్చరించారు. కలసపాడు, కాశినాయన, గోపవరం, బద్వేలు టౌన్, మండలాల్లో స్థలాలకు గిరాకీ పెరడంతో పార్టీల నాయకులు సిండికేట్‌గా ఏర్పడి యదేచ్ఛగా భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేను రాముడి బిడ్డనంటూ రాజకీయాలు చేస్తున్నాడని, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ పాలన గాలికి వదిలి వ్యవహరిస్తున్నారని, వీటిని చంద్రబాబు ప్రోత్సహించడం మరింత విడ్డూరంగా ఉందని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ పెత్తందారీ విధానాలను విడిచినప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. బద్వేలు నియోజకవర్గంలో గోవిందరెడ్డి, విజయమ్మ, వైసీపీ నాయకులు ఐక్యంగా ఉంటూ కబ్జాలకు తెరలేపారన్నారు. సికొత్తపల్లెలో 300 ఎకరాలు కబ్జా ఎవరు చేశారన్న విషయం అందరికీ తెలిసినా నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారని మండిపడ్డారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వేల ఎకరాలు కబ్జా చేశాడని విమర్శించిన నాయకులే తమ పార్టీలోకి ఆహ్వానించి కండువాలు వేసి వారి నేరచరిత్రను కప్పిపుచ్చడానికి పునాదులు వేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలన్నారు. లేనిపక్షంలో ఎర్రజెండాలకు ఉన్న కర్రలతోనే పోరాటానికి నాంది పలకాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సీపీఐ నిర్వహించిన భారీ ప్రదర్శన, సభలో పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య, వెంకటశివ, సుబ్రమణ్యం, సుబ్బరాయుడు, ఎం.వి.సుబ్బారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివశంకర్, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మునెయ్య, మహిళా సమాఖ్య నాయకురాలు భాగ్యమ్మ, జమ్మలమడుగు ప్రసాద్, మైదుకూరు షావలి, భాస్కర్, శివరాం, బద్వేలు ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సీపీఐ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి బాలు, ఏరియా కార్యవర్గ సభ్యులు రమణ, రవికుమార్, ఇమ్మానుయేలు, పడిగ వెంకటరమణ, పెంచలయ్య, కేశవ, విజయమ్మ, సునీల్, ప్రసాద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.