బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరు ప్రక్షాళన అవశ్యం
. ముంపు ప్రాంతాల రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
. కొల్లేరు టు బుడమేరు పర్యటనలో నారాయణ, రామకృష్ణ
విశాలాంధ్ర కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు, మండవల్లి మండలాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు పూర్తిగా ఫిష్ మాఫియా ఆక్రమణల్లో చిక్కుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కొల్లేరు అభయారణ్యం ఆక్రమణకు గురికావడంతో ఎగువ ప్రాంతాల్లోని పట్టణాలు ముంపు బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరుల్లో గల ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టంచేశారు. కొల్లేరు టు బుడమేరు పర్యటనలో భాగంగా పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి నుంచి బుడమేరు వరకు సీపీఐ, రైతుసంఘం ప్రతినిధి బృందం మంగళవారం పర్యటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లను పరిశీలించింది. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ ఆక్రమణలతోనే కొల్లేరు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. 1999లో కొల్లేరు సరస్సుగా 5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కొల్లేరు ఆపరేషన్ పేరుతో 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లేరు అభయారణ్యంలో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టిన 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేసిందని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీపీఐ మద్దతు తెలిపిందన్నారు. వరదల సమయంలో బుడమేరు, రామిలేరు తమ్మిలేరు, చంద్రయ్య డ్రెయిన్, ఎర్రకాల్వ వంటి 67 డ్రెయిన్లు, కాల్వల ద్వారా కొల్లేరుకు లక్ష క్యూసెక్కుల నీరు చేరుతుందని, ఈ నీరంతా మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుండి కొల్లేరులోకి ప్రవహించి… ఉప్పుటేరు మీదుగా సముద్ర గర్భంలో కలుస్తుందని నారాయణ వివరించారు. ఆక్రమణ వల్ల ఎగువున ఉన్న పట్టణాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, దీనిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.
కె.రామకృష్ణ మాట్లాడుతూ కొల్లేరును ప్రక్షాళన చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అందుకోసం పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ప్రకృతి విపత్తుల వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాజాగా సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు పూర్తిస్థాయిలో అతలాకుతలమయ్యాయని రామకృష్ణ చెప్పారు. బుడమేరు ఆక్రమణల వల్ల విజయవాడ బాగా నష్టపోయిందని, కొల్లేరు ఆక్రమణల వల్ల వేలాది ఎకరాల్లో పంట, ఆక్వా ఉత్పత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. అందువల్ల కొల్లేరు, బుడమేరును కాపాడాలని, జీఓ నెం.120లో పేర్కొన్న విధంగా 77,136 ఎకరాలతో కూడిన కొల్లేరు అభయారణ్యాన్ని కాపాడాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ దిల్లీ వెళ్లి కేంద్రానికి వివరిస్తామని, ఆక్రమణలపై ఐక్యరాజ్యసమితికి కూడా ఫిర్యాదు చేస్తామని రామకృష్ణ తెలిపారు. చేపల రైతులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై కొల్లేరును దోచుకుంటున్నారని విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొల్లేరు ప్రపంచ గుర్తింపు పొందిన అద్భుతమైన మంచినీటి సరస్సు అని, అది వందలాది పక్షులకు నిలయమని, అయితే, ఆక్రమణల కారణంగా కొల్లేరు సరస్సు కుంచించుకుపోతోందని విమర్శించారు. కొల్లేరును 5వ కాంటూరు వరకు కాపాడాలని, అలా చేయడం వల్ల పక్షుల ఆవాసాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు కొల్లేరు మీదుగా ఉప్పుటేరు ముఖద్వారం నుంచి దిగువున ఉన్న బంగళాఖాతంలో కలుస్తుందని, అయితే, ఆక్రమణల వల్ల కొల్లేరు లంక గ్రామాలు, పంటలు, చెరువులు ముంపుబారిన పడుతున్నాయని వివరించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేపల మాఫియా ప్రభావానికి గురవుతున్నాయని ఆరోపించారు. కొల్లేరును పరిరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఉపద్రవాల నుంచి కొల్లేరును కాపాడాలని డిమాండ్ చేశారు. పంట, ఆస్తినష్టం లేకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబా, కారం దారయ్య, మైసాక్షి వెంకటాచారి, జేవీ రమణరాజు, కంచర్ల గురవయ్య, ఉప్పులూరి హేమశంకర్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పుట్టి రాయప్ప, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరకా శ్యామల, మన్నవ యామిని తదితరులు పాల్గొన్నారు.