సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర – విజయవాడ: కర్నూలు జిల్లా రాజోలిబండ కుడికాలువ పథకానికి, (ఆర్‌డీఎస్), గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం మరమ్మతు లకు రాష్ట్ర బడ్జెట్‌లో తగు నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాల యం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలు కరువు, కాటకా లతో అత్యంత వెనుకబడిన ప్రాం తాలుగా ఉన్నాయని తెలిపారు. వర్షాలు లేకపోవడంతో అక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలకు వలసలు పోయి బతుకు వెళ్లబుచ్చుతున్నారని పేర్కొన్నారు. తాగునీటికి సైతం తుంగభద్ర దిగువ కాలువపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలంటే 4 టీఎంసీలతో రాజోలిబండ కుడికాలువ (ఆర్‌డీఎస్) నిర్మాణమే ఏకైక శరణ్యమని స్పష్టం చేశారు. 2014లో ఆనాటి తమ ప్రభుత్వ హయాంలో రూ.1985.42 కోట్ల అంచనా వ్యయంతో పాలనామోదం తెలిపారని గుర్తు చేశారు. సుమారు రూ.13 కోట్ల విలువైన పనులు చేశారని తెలిపారు. 2019లో ఏర్పడిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోగా, జరిగిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయ న్నారు. రాజోలిబండ నీటిమళ్లింపు పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో తగు నిధులు కేటాయించి, మంత్రాలయం, ఎమ్మిగనూరు కోడుమూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరారు. తుంగభద్ర నది నుంచి 3.786 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 45,790 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా దాదాపు రూ.616 కోట్ల ప్రజాధనం వెచ్చించి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని చెప్పారు. వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానెల్ బోర్డులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారన్నారు. రూ.5.60 కోట్లకు పైగా విలువ చేసే కాపర్‌వైర్, కాయిన్స్, పవర్ ఆయిల్ దోచుకువెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు కూడా నమోదు చేసినప్పటికీ సమగ్ర దర్యాప్తు జరగలేదన్నారు. తక్షణ మరమ్మతుల కోసం నిధులు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మరమ్మతులు జరగలేదన్నారు. ఈ నెల 10న రాత్రి తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్‌ను ఖాళీ చేసేందుకు రోజుకు 8 టీఎంసీల నీటిని విడుదల చేశారని చెప్పారు. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పరికరాలు చోరీ కాకుంటే ఆ పది రోజులు దాదాపు రూ.100 కోట్లతో సమానమైన కనీసం ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదన్నారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి, పథకాల మరమ్మతుల పనులు చేయించాలని, కోట్లాది విలువైన సామాగ్రిని దొంగిలించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు.