విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: అమరావతి రాజధానిలో ఆర్
5 జోన్ నుంచి ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు చుక్కెదురైంది. వారికి సొంత ప్రాంతాల్లోనే ఇళ్లు ఇవ్వడం లేదా టిడ్కో ఇళ్లల్లో అవకాశం కల్పిం చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆర్5 జోన్‌లోని లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల కోసం భూమి సమీకరించాలని... లేదంటే భూ సేకరణ చేస్తామని, వాటికి అవకాశం కల్పించకుంటే టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ఆర్
5 జోన్‌లో దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జగనన్న కాలనీల్లో భాగంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, మంగళగిరి తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించగా… దానిపై రాజధాని ప్రాంత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఇళ్ల స్థలాల నిర్మాణం ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా సీఎం చంద్రబాబు వారందరికీ సొంత ప్రాంతం లేదా సమీపంలో వేరే స్థలాలు చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.