. హైడ్రా తరహా చర్యల కోసం డిమాండ్లు
. దృష్టిపెట్టిన ప్రభుత్వం
. కబ్జాదారుల్లో కలవరం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న హైడ్రా తరహా చర్యలతో బుడమేరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలు తొలగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. హైదరాబాద్‌లో అమలు చేస్తున్న హైడ్రా విధానాన్ని రాష్ట్ర ప్రజలు, రాజకీయ నేతలూ స్వాగతిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలోనూ బుడమేరు ప్రక్షాళనపై స్పష్టత ఇచ్చారు. ఒక వైపు బుడమేరులోని ఆక్రమణలు తొలగించడంతోపాటు కొల్లేరులోకి సహజ సిద్ధంగా నీటి ప్రవాహం వెళ్లేలా చూస్తామనీ, అక్రమార్కులు ఎవరైనా వదిలిపెట్టేది లేదంటూ వెల్లడిరచారు. మరోవైపు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చినట్లు పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ తాజాగా వెల్లడిరచారు. ఆపరేషన్ బుడమేరుపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం అనివార్యంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా బుడమేరు ప్రవాహం తన్నుకొచ్చి..దాని పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ఒకప్పుడు సహజ సిద్ధంగా ఉన్న కొల్లేరు ఆక్రమణకు గురై పెద్దఎత్తున చేపల చెరువుల గట్లు వెలవడంతో, ఆ సమయంలో వరదలొచ్చి కొల్లేరు పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. అప్పట్లో మొత్తం ఆక్రమణలను తొలగించారు. బాంబులతో చేపల చెరువు గట్లను ధ్వంసం చేశారు. ఇప్పుడు హైడ్రా తరహాగా ఆక్రమణలను తొలగించి… బుడమేరు విస్తరణ చేపడితేనే భవిష్యత్‌లో ముంపు ప్రమాదం నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. బుడమేరులోకి అక్రమంగా నిర్మించిన భవనాలు, నిర్మాణాలను కూల్చివేస్తేనే భవిష్యత్‌లో ముంపు సమస్య తొలగిపోనుంది. ఎట్టకేలకు దీనిని గుర్తించిన ప్రభుత్వం కొల్లేరు ప్రక్షాళనే లక్ష్యంగా మందుకుపోతోంది. వరదలతో బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టాలకు గురయ్యారు. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 45మందికిపైగా చనిపోతే…అందులో ఒక్క విజయవాడలోనే 25 మంది ఉండటం గమనార్హం. విజయవాడ సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో 2.70లక్షల మంది ప్రజలు బుడమేరు ప్రభావంతో నిరాశ్రయిలయ్యారు. పది రోజులపాటు జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన బుడమేరుకు వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. బుడమేరు పరివాహక ప్రాంతం 162 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది. ఇటీవల పడిన భారీ వర్షాలు, వరదలకు బుడమేరులో 40వేల క్యూసెక్కలకు పైగా నీరు వచ్చినట్లు సమాచారం. దీంతోనే బుడమేరు గట్లు తెగిపోయి…విజయవాడ నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. జక్కంపూడి కాలనీ నుంచి అంబాపురం, సింగ్‌నగర్, కృష్ణాహోటల్ సెంటర్, వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, ప్రశాంతినగర్, సుందరయ్యనగర్, కండ్రిక, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ పది రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ఈ వరద నీటిని తరలించే అవకాశం లేకపోవడంతో అధికార యంత్రాంగం అష్టకష్టాలుపడాల్సి వచ్చింది. చివరకు బుడమేరు ప్రక్షాళనే సరైనదన్న నిర్ణయానికి ప్రభుత్వమూ వచ్చింది. దీంతో ఆక్రమణ దారుల్లో ఆందోళన మొదలైంది. చాలా మంది బుడమేరు పరివాహకంలో భారీ భవంతులు కట్టుకుని ఏళ్లతరబడి జీవిస్తున్నారు. బుడమేరు ప్రక్షాళన మొదలైతే…ఆక్రమణలో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేయక తప్పని పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి నష్టపరిహారం కల్పించిగానీ, లేక ప్రత్యామ్నాయ చర్యలు చూపి…బుడమేరు ప్రక్షాళనకు ముందుకెళ్లాల్సిన అవసరముంది. కృష్ణలంక దగ్గర కృష్ణానది చుట్టూ రిటైనింగ్‌వాల్‌ను నిర్మించిన సమయంలో అడ్డంకిగా ఉన్న ఆక్రమిత ఇళ్లను తొలగించడం జరిగింది. ఇదే తరహాగా బుడమేరు ప్రక్షాళనపై ముందుకెళ్లాల్సిన అవసరముంది.
రాజకీయ నేతల అండదండలతోనే…
సహజ సిద్ధంగా ప్రవహించే బుడమేరు చుట్టూ కొందరు రాజకీయ నేతల అండదండలతోనే ఆక్రమణలు వెలిశాయి. ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు..స్థానిక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెంచి ఆక్రమణలకు తెరదీశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, బుడమేరు ముంపునకు గురైనప్పుడే సమీక్షలతో హడావుడి చేసి… ఆ తర్వాత మౌనంగా ఉండటం పరిపాటైంది. విజయవాడకు మరో సారి వరద కష్టం రాకుండా బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం సన్నద్ధమవ్వాల్సి ఉంది. పార్టీల జోక్యం లేకుండా ఎక్కడికక్కడే ఆక్రమణలు తొలగించి సహజ సిద్ధంగా కొల్లేరులోకి బుడమేరు నీరెళ్లేలా చూడాలి.
లేకుంటే ఆక్రమణలు వల్ల బుడమేరు నీరు వెనక్కి తన్నే ప్రమాదముంది. బుడమేరు ప్రవాహం ప్రారంభమైన వెలగలేరు నుంచి విజయవాడ నగరం, గన్నవరం చివరి వరకూ ఎత్తయిన రిటైనింగ్‌వాల్‌ను పటిష్టంగా నిర్మించాలి. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. బుడమేరు ముంపుతో దెబ్బతిన్న రహదారులు, డ్రెయిన్లు, కాల్వ గట్ల మరమత్తులు చేయాలి. ఒక్క బుడమేరు ప్రక్షాళనే కాకుండా విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణకు దిగాల్సిన సమయం ఆసన్నమైంది.