. మానవత్వంతో పనిచేయాలి
. నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తప్పవు: చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నామని, అందరూ మానవత్వంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వరద ముంపు బాధితులకు సాయం అందించేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్‌జిల్లా కలెక్టరేట్‌లో చంద్రబాబు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరద ముంపు బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇంకా చాలామంది అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి పరువు పోగొట్టుకోవద్దని, సమాజ హితం కోసం అందరూ పని చేయాలని కోరారు. వీఆర్‌లో పెడితే పనిచేయరా?, జీతం తీసుకోవడం లేదా? ప్రజలు ఉంటేనే మనం ఉంటామని సీఎం స్పష్టంచేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కొందరు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయం అందించాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు పనిచేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. హుదూద్ సమయంలో తాను చేసిన సేవలను నాడు ప్రధాని అభినందించారని గుర్తుచేశారు. ఈ వరదలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడే ఉండి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. మూడు రోజులు బిడ్డకు పాలు అందకపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడతారని, అందుకే మానవతా దృక్పథంతో పని చేయాలని ఆదేశించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే…తన విశ్వరూపాన్ని చూస్తారని సీఎం హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గరకు బోట్లు కొట్టుకువచ్చిన ఘటనపై విచారణకు ఆదేశిస్తామన్నారు. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆ ఇబ్బందుల నుంచి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని అన్నారు. ఆరు హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నామని వివరించారు. 179 సచివాలయాల పరిధిలో…ఒక్కో సచివాలయానికి ఒక సీనియర్ అధికారిని నియమించామని, బాధితుల కోసం ట్రాక్టర్లు, వ్యాన్లు, పొక్లెయిన్లు, బోట్లు ఏర్పాటు చేశామన్నారు. 32 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారని, 10 జిల్లాల నుంచి బాధితుల కోసం ఆహారం తెప్పిస్తున్నామని చెప్పారు. చివరి బాధితుడి వరకూ సాయం అందిస్తామన్నారు. గడచిన రెండు రోజులపాటు బాధితులు ఇబ్బందులకు గురయ్యారని, ఇక ఇబ్బంది పడటానికి అవకాశం ఉండకూడదన్నారు. ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని, వాటిని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనన్నారు. ప్రతి ఇంట్లోకి నీళ్లతో పాటు పాములు వచ్చి చేరుతున్నాయని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సీఎం చెప్పారు. ప్రతి కుటుంబం బాధలో ఉందని, మానవతా దృక్పథంతో పనిచేద్దామని, విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. చెత్త రాజకీయాలు చేయకుండా ప్రజాహితం కోసం పనిచేయాలన్నారు. ఆపద సమయంలో సహాయక చర్యలకు భంగం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్రలు జరుగుతున్నాయని, వాటి ద్వారా సాధించేదేమీ లేదన్నారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు పంపించామని, జక్కంపూడిలో ఓ అధికారిపై చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడిరచారు. వర్షం పడి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు కాలేజీలో సమస్య అంటూ మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. సిగ్గుంటే ఇలా మాట్లాడతారా.? రాజకీయ ముసుగులో నేరస్తులుగా ఉండేవారు తమ దృష్టి మళ్లించేందుకు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాలకు వచ్చిన జగన్ ఐదు నిమిషాల్లో తిరిగి వెళ్లిపోయాడని విమర్శించారు. కనీసం ఒక్కరికైనా ఒక పొట్లం ఆహారమైనా అందించారా… ఒక్కరినైనా రక్షించారా… కనీసం పలకరించారా అని ప్రశ్నించారు.