. తమిళనాడు గవర్నరుపై ముప్పేటదాడి
. రవి వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు
. సెక్యులరిజం అంటే ఆయనకు తెలియదు: డి.రాజా
న్యూదిల్లీ/చెన్నై: భారత్‌లో లౌకికవాదాని (సెక్యులరిజం)కి స్థానం లేదంటూ తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగం కూడా విదేశీ భావన అని ఆయన భవిష్యత్తులో చెప్పవచ్చని విమర్శించాయి. ఇలాంటి వ్యక్తిని రాజ్యాంగ బద్ధ పదవిలో ఎలా నియమించారని కేంద్రంలోని మోదీ సర్కారును ప్రశ్నించాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కూడా ‘‘ధర్మ పరిపాలన భావనను’’ తిరస్కరించారని అన్నారు. ‘అతనికి సెక్యులరిజం గురించి, భారతదేశం గురించి ఏం తెలుసు? ఒక గవర్నర్‌గా అతను రాజ్యాంగా నికి కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్వచించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మతతత్వ భావనను గట్టిగా తిరస్కరించారు. లౌకికవాదం అంటే మతాన్ని నిలబెట్టుకోవడం. రాజకీయాలు వేరు. ఎన్నికల ప్రయోజనాల కోసం దేవుళ్లను తీసుకురావద్దు’’ అని రాజా గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తిని గవర్నర్‌గా ఎలా నియమించారని మండిపడ్డారు. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ… ‘ఈ గవర్నర్ రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు…రేపు భారత రాజ్యాంగమే విదేశీ భావన అని చెబుతారు… ఇదే ఆర్‌ఎస్‌ఎస్ అవగాహన. తమిళనాడు వంటి కీలక రాష్ట్రానికి అలాంటి వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం సిగ్గుచేటు’ అన్నారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్యం అనేవి కూడా యూరప్ నుంచే ఉద్భవించాయనే లాజిక్‌ని గవర్నర్ మరిచారా? అని కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. ‘తిరువల్లువర్‌కు కాషాయ వస్త్రాన్ని కప్పిన తమిళనాడు గవర్నర్… ఇప్పుడు లౌకికవాదం యూరోపియన్ భావన అని, భారతదేశంలో దానికి స్థానం లేదని కనుగొన్నారు. అతను సరైనవాడు కాదు. ఆయన సరైనవాడే అయితే… ఫెడరలిజం కూడా యూరోపియన్ భావన. భారతదేశంలో ఫెడరలిజానికి స్థానం లేదని ప్రకటిస్తారా?’ అని ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆయన అన్నారు. సెక్యులరిజం అనేది భారతదేశానికి అత్యంత అవసరమైన భావన అని… ఐరోపాది కాదని చెబతూ… స్పృహతో కూడిన మతస్వేచ్ఛ కలిగి ఉండాలని ఆర్టికల్ 25 చెబుతోంది. అది ఆయనకు తెలియదు. రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ గవర్నర్ రవికి సూచించారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్ రవికి మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. తాజాగా ఆయన చేసిన ‘లౌకికవాదం’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది. ‘‘సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ దేశ ప్రజలపై చాలా మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన. ఇది భారతీయ భావన కాదు’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రవి అన్నారు. ‘చర్చి, రాజు మధ్య పోరాటం ఫలితంగా లౌకికవాదం వచ్చింది. భారతదేశం ధర్మానికి ఎలా దూరంగా ఉంటుంది? సెక్యులరిజం అనే యూరోపియన్ భావనని అక్కడే ఉండనివ్వండి. భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదు’ అని తమిళనాడు గవర్నర్ అన్నారు. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చారు.