భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
. ఏజెన్సీ మండలాల్లో ప్రమాద ఘంటికలు
. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
. సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు
విశాలాంధ్ర-కుక్కునూరు: మళ్లీ గోదావరికి వరద పోటెత్తింది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మంగళవారం రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో దిగువునున్న ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువున ఉన్న ఉప నదుల వరద గోదావరికి చేరడంతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతుంది. డొంకరాయి, సీలేరు నుంచి శబరికి వరద భారీగా చేరుకోవడంతో గోదావరి పోటేసింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో పనులు లేక… చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలు బతుకు బండి నెట్టుకొస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, చాలా ప్రాజెక్టుల నుంచి వరద విడుదల కానున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు సూచనలు చేస్తున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలతో అధికారులు అనుక్షణం మాట్లాడుతూ వరదలపై అలెర్ట్ చేస్తున్నారు. కుక్కునూరు ఎమ్మార్వో చలపతిరావు, ఎస్.ఐ. రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.