. ఒకేరోజు రూ.4,500 కోట్ల పనులకు ఆమోదం
. 87 రకాల పనులకు అవకాశం
. గ్రామాల రూపురేఖలు మారుస్తాం: సీఎం చంద్రబాబు
. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం: పవన్ కల్యాణ్
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పల్లెల్లో శుక్రవారం పండుగ వాతావరణం కనిపించింది. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ సభలు ఘనంగా జరిగాయి. 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలలో కోటి మందికిపైగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు ఈ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని ఆమోదించుకున్నారు. రూ.4500 కోట్లు విలువైన పనులకు గ్రామ సభల ఆమోదంతో 87 రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. తొమ్మిది కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి లభించనుంది. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొనేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వెచ్చించుకొనేలా గ్రామ సభలను నిర్వహించారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమన్నారు. వైసీపీ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. ‘2014-19 మధ్య 27,444 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశాం. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తాం. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తాం. గ్రామాల్లోని పేదలకు ఇళ్లు కట్టించి… విద్యుత్, రక్షిత తాగునీరు సరఫరా చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ పాలనకు, మా పాలనకు బేరీజు వేయండి. మా హయాంలో వేసిన వీధి దీపాలను వైసీపీ నేతలు దొంగలించారు. కేంద్రం సాయంతో వచ్చే ఐదేళ్లలో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు అన్నారు. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట నిర్వహించిన గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలే గ్రామసభల అజెండా అని తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, పంచాయతీ నిధులను దారిమళ్లించిందని విమర్శించారు. 13,326 పంచాయతీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీరుతాయన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకోం, నిరంతరం కష్టపడతామని హామీనిచ్చారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది చంద్రబాబేనని, ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని పవన్ కల్యాణ్ అన్నారు. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకున్నట్లు చెప్పారు. పదవి అంటే అలంకారం కాదు.. బాధ్యతన్నారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. ‘ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. అవసరమైతే గూండా చట్టం తెస్తాం’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేవని, దాతలు ముందుకొస్తే తానూ నిధులు తెచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. వలసలను అరికట్టేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ తెస్తామని పవన్ ప్రకటించారు. మైసూరువారిపల్లె పంచాయతీకి 10 సెంట్ల స్థలం అందించిన రైతు కారుమంచి నారాయణను ఆయన అభినందించారు. ఇక నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మాకవారిపాలెం గ్రామసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఉపాధి హామీ ద్వారా 87 రకాల పనులు చేపట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్‌లకు సూచించారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని దూళిపూడి గ్రామ సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లి గ్రామసభలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్ళపాలెం గ్రామ సభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి చొప్పున హాజరు కాగా శాసనసభ్యులు తమ సొంత నియోజకవర్గాల్లోని గ్రామసభల్లో పాల్గొన్నారు.