. ‘విద్యాంజలి’ పక్కదోవ
. 8 నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు
. రూ.లక్షల్లో కాజేసిన స్వచ్ఛంద సంస్థలు
. సంబంధం లేదంటున్న విద్యాశాఖ
విశాలాంధ్ర-లింగపాలెం:
విద్యావ్యవస్థలో ప్రజలను భాగస్వాములు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన విద్యాంజలి పథకం అమలుపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ పథకంలో ఏం జరుగుతోంది… ఇప్పటివరకు ఏం జరిగింది అనే విషయంలో అయోమయం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరాన్ని బట్టి ఉద్యోగులను నియమించుకునేందుకు, సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇస్తూ పాఠశాలల అభివృద్ధి కోసం కేంద్రం ఈపథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ఉన్నట్లు చాలామందికి తెలియదు. తెలిసినవాళ్లు ఈ పథకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసే అధికారాన్ని కేంద్రం విద్యాంజలి పథకం ద్వారా సమాజసేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి అనుమతులు ఇచ్చింది. ఆయా పాఠశాలల్లో నియామకాలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలే … ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. కొన్ని సంఘటనలు పరిశీలిస్తే … ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోగా… ఉద్యోగాలు పేరిట పోస్టును బట్టి లక్షల కాజేసిన సంఘటనలు లింగపాలెం మండలంలో వెలుగు చూశాయి. విద్యాంజలి ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారికి ఎనిమిది నెలలుగా వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల సంగతి దేవుడెరుగా… తాము ముందుగా చెల్లించిన లక్షల రూపాయలను తిరిగి ఇవ్వటం లేదని వాపోతున్నారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేస్తే… ఉద్యోగాలను వదులుకుంటామని మొరపెడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల వివరాలు ఉద్యోగులకు ఏమాత్రం తెలియదు. దళారీల ద్వారా డబ్బి చ్చి ఉద్యోగాలలో చేరారు. వేతనం ఇవ్వాలని బాధితులు విద్యాశాఖ అధికారులను కోరుతుంటే… ఇటువంటి ఉద్యోగాల నియామకాల తో తమకు సంబంధం లేదని, ఏ సంస్థద్వారా ఉద్యోగాల్లో చేరారో వారి ద్వారా వేతనాలు పొందాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మంచి లక్ష్యంతో ఈ పథకం ప్రవేశ పెడితే ఇది పక్కదోవ పట్టటం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. వీటికి సంబంధించిన వివరాలు విద్యాశాఖ వద్ద కూడా లేవనేది వారి వివరణ. ఉద్యోగ నియామ కాలు, వేతనాలు చెల్లింపు అంతా ఆయా సంస్థలే చూసుకోవాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. అయితే అనేక స్వచ్ఛంధ సంస్థలవారు ఇన్ కమ్ టాక్స్ చెల్లిస్తుంటారు. విద్యాంజలి ద్వారా పాఠశాలల్లో ఉద్యోగాలలో నియమించి వారికి వేతనాలు ఇస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఇలా చేయడం ద్వారా ఆయా సంస్థలు ప్రతి ఏటా కట్టే టాక్స్ చెల్లింపులో రాయితీ ఉంటుంది. కానీ కొందరు ఫేక్ సంస్థలను సృష్టించి నిరుద్యోగుల వద్ద డబ్బు గుంజి వేతనాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టారనే ఆరోపణలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది యథార్థం. పాఠశాలల వారీగా డేటాను సేకరిస్తే వివరాలు తెలుసు కోవడం కష్టం కాదు. దీనివల్ల ఎంతమంది ఇటువంటి ఉద్యోగాల్లో చేరారో, వేతనాలు లేక ఎంతమంది అవస్థలు పడుతున్నారో, డబ్బు చెల్లించి నష్టపోయిన వారి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వివరాలు సేకరించి మోసాలకు పాల్పడిన వారిని గుర్తించవచ్చు. వారిపై చర్యలు తీసుకొని డబ్బు పోగొట్టుకున్న వారికి ఇప్పించే అవకాశం ఉంటుంది. అధికారుల అజమాయిషి ఉండటం వల్ల పథకం సక్రమంగా అమలవుతుంది.