సుప్రీంకోర్టు
న్యూదిల్లీ : ఎన్నికల బాండ్లపై కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య క్విడ్ ప్రో కో జరిగిందంటూ వచ్చిన ఆరోపణపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన అనేక పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ… దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితమే అవుతుందని పేర్కొంది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను రికవరీ చేయడంతోపాటు… వాటి ఆదాయపన్ను మదింపులను తిరిగి తెరవాలని పిటిషనర్లు కోరడాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆదాయపు పన్ను చట్టం కింద ఇవి సంబంధిత శాఖ అధికారులకు సంబంధించిన చర్యలని పేర్కొంది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగి ఉండవచ్చనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం… సిట్ ఏర్పాటుకు నిరాకరించింది.