. ఎస్‌ఐఎంసీ వెబ్‌సైట్‌లో ఖాళీలు
. జిల్లాల వారీగా నియామకాలు
. డీఎస్సీ అర్హతలతోనే దరఖాస్తులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేని పాఠశాలల్లో భర్తీకి ద్వారాలు తెరిచింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరో శుభవార్త అందినట్లయింది. ఇప్పటికే 16 వేల పోస్టులతో డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. గతంలో ఎయిడెడ్ పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా… ఎయిడెడ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులులేని, అన్ని అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి అవకాశమిచ్చింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎస్‌ఐఎంసీ) వెబ్‌సైట్‌లో ఎయిడెడ్ పోస్టుల ఖాళీలను వెల్లడిరచారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అర్బన్, రాజమహేంద్రవరం రూరల్‌లోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులు ఆయా పోస్టులకు తప్పనిసరిగా ఉపాధ్యాయ వృత్తి కోర్సులు పూర్తి చేయడంతో పాటు ఏపీ టెట్/సీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. రిజర్వేషన్ల కేటగిరీ ఆధారంగా పోస్టులను అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఎక్కడికక్కడే పాఠశాలల ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే అనేక అనుమానాలున్నాయి.
ఆన్ లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ మేరకు విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రాంతీయ సంచాలకులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆన్ లైన్ నియామక ప్రక్రియకు చెందిన ఎస్‌ఐఎంసీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడలోని నవభారత్ హైస్కూల్‌లో పీఈటీ పోస్టులు 1, ఎస్‌ఏ/పీజీటీ పోస్టులు 5, ఎస్‌జీటీ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన పాఠశాలల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… ఆయా పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, భాషా పండితులు, పీజీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు ఏపీ టెట్ లేదా సీటెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్ తదితర ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అన్ని జిల్లాల నుంచి ఖాళీలను సేకరించి, వరుస వారీగా ఎస్‌ఐఎంసీ వెబ్‌సైట్‌లో వివరాలను వెల్లడిస్తారు.
భర్తీ ప్రక్రియపైనే అనుమానాలు!
ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటేనే అనేక అనుమానాలు ఉదయిస్తున్నాయి. గతంలో ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు వెలకట్టి… భర్తీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ దఫా అలాంటి ఆరోపణలకు చెక్‌పెట్టి… ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఆరేళ్ల నుంచి డీఎస్సీ లేకపోవడంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు దిక్కుతోచడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించినప్పటికీ… ఇంతవరకూ నోటిఫికేషన్ రాలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఈ ఏడాది చివరిలోగాని, లేదా జనవరిలోగాని వస్తుందని సమాచారం. ఈలోగా ఎయిడెడ్ పోస్టుల ప్రకటన రావడంతో అర్హులైన కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కుతుతాయి. దానివల్ల రాబోయే డీఎస్సీలోనూ కొంత పోటీ తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎయిడెడ్ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి?, ఆయా పోస్టుల వివరాలను విద్యాశాఖ ప్రకటించాలి. డీఎస్సీ నియామకాల తరహాగానే ఎయిడ్‌డ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీకి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేకుంటే పోస్టుల నియామకంలో అనేక అక్రమాలు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు.