ట్విట్టర్ వేదికగా అబద్ధాలు
రాజీవ్ ఖేల్‌రత్న పేరు మార్పులో…
అంతా మోదీ ఇష్టమే
ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంలో బట్టబయలు
న్యూదిల్లీ : ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాని మోదీ నియంతృత్వ విధానం బట్టబయలైంది. అవార్డు పేరును మార్చాలని దేశ ప్రజలెవ్వరూ కోరలేదని సాక్షాత్తు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ సమాచార చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వెల్లడిరచింది. పేరు మార్పు విషయంలో ప్రధాని మోదీ చేసిన ట్వీట్ తర్వాతనే సదరు మంత్రిత్వ శాఖ ఆ మేరకు ఒక సర్క్యులర్‌ను హడావిడిగా జారీ చేసినట్లు ఆధారాలు బయటపడినట్టు ది వైర్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రీడాకారులకు అందించే రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు పేరును హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ పేరుపైకి మార్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీని అవమానించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక వర్గం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, క్రీడాకారుడిని గుర్తించేందుకో ఈ నిర్ణయం అంటూ ప్రభుత్వ అనుకూల శక్తులు ప్రచారం చేశాయి. ఖేల్‌రత్న అవార్డు పేరును మారుస్తున్నట్టు ప్రప్రథమంగా ప్రధాని నరేంద్ర మోదీనే ట్వీట్ చేశారు. క్రీడాకారులకు ఇచ్చే ఖేల్‌రత్న అవార్డును దిగ్గజ ఆటగాడి పేరుపైకి మార్చాలని దేశ వ్యాప్తంగా అనేక మంది పౌరుల నుంచి తమ ప్రభుత్వానికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయని ఆగస్టు 6న చేసిన ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారికంగా సాగాల్సిన పేరు మార్పు విధానానికి ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారని, పేరు మార్చాలని వచ్చిన అభ్యర్థనల కాపీలను తమకు ఇవ్వాలని సమాచార చట్టం కింద ది వైర్ మీడియా దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో అసలు విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి ప్రధానికి వచ్చే అభ్యర్థనుల అన్నీంటినీ ఎప్పటికప్పుడు పీఎంవో ఆయా విభాగాలకు పంపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శాంత శర్మ…అవార్డు పేరును మార్చాలని తమకు వచ్చిన అభ్యర్థనలు ఏవీ లేవని సమాచారం ఇచ్చారు. ప్రధాని ట్విట్టర్‌లోనే అబద్ధాలు పోస్టు చేసిన విషయం బయటపడిరది. ఈ క్రమలో ఈ వ్యవహారంపై మరింత లోతుగా పరిశీలన జరిపిన ది వైర్ మీడియా ప్రధాని మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని పేరు మార్పును ప్రకటిస్తూ చేసిన ట్వీట్ అనంతరమే ఆ మంత్రిత్వ శాఖ హడావుడిగా ఆమేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్టు గుర్తించింది. ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌నే ప్రభుత్వ నిర్ణయంగా మార్చడం కోసం మంత్రిత్వ శాఖ అనేక తప్పులు చేసినట్టు గుర్తించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆమోద ముద్రతో వెలువడిన ఆ సర్క్యులర్‌లో అనేక అచ్చు తప్పులున్న విషయాన్ని బయటపెట్టింది. మోదీ చేసిన ట్వీట్‌ను ఆదేశంగా భావించిన యంత్రాంగం కనీసం ఒక నోట్‌ఫైల్‌ను కూడా సిద్ధం చేయకుండా ఏకంగా నిర్ణయం అమలుకు ఒక సర్య్కూలర్‌ను జారీ చేయడం అందులోని తప్పులను కూడా గుర్తించకుండా విడుదల చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక ఈ మొత్తం వ్యవహారం ప్రారంభదశలో అధికారులు మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ఇప్పటికే ఒక అవార్డు కూడా ఉందని గుర్తించి గందరగోళాన్ని ఎదుర్కొన్నారని, అ క్రమంలో ప్రధాని మోదీని సంతృప్తి పరిచేలా ఆ అవార్డు పేరును కూడా త్వరలోనే మార్చాలని నిర్ణయించినట్టు ది వైర్ గుర్తించింది. క్రీడాకారుల జీవిత సాఫల్యం నేపథ్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ పేరుతో ఒక అవార్డు 2002లో స్థాపించిన విషయాన్ని అధికారులు ఆ ఫైల్‌లోనే పొందుపర్చారని, ఆ క్రమంలోనే ఆ పేరును కూడా మార్చాలని సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర ప్రతిపాదనను సిద్దం చేసినట్టు వెల్లడిరచింది.
ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తదితర సంస్థలతోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టమైంది. ఆ నిర్ణయం తీసుకున్న ఒక నెల తర్వాత అవార్డు పేరు మార్పునకు సంబంధించిన విషయం సదరు సంస్థలకు తెలిపినట్టు గుర్తించింది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్‌లోని క్రికెట్ స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చడం వంటి అత్యుత్సాహ నిర్ణయంతో మోదీ ప్రభుత్వ వ్యవహార శైలి తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే.