తూర్పు గోదావరి జిల్లాలో మినీ లారీ బోల్తా
విశాలాంధ్రదేవరపల్లి/కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయగూడెం శివారు చిలకా వారి పాకల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మినీ లారీ బోల్తా పడటంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఏలూరు జిల్లా
తూర్పు గోదావరి జిల్లా మధ్య చిన్నాయగూడెం రెవెన్యూ పరిధిలో చిలకా వారి పాకల వద్ద అదుపుతప్పి బోల్తా పడిరది. వాహనం డ్రైవర్ బొర్రంపాలెం నుంచి తాడిమళ్ల వెళ్లేందుకు అడ్డ దారి ఎంచుకున్నాడు. ఈ మార్గంలో వెళితే చెక్ పోస్టులు ఉండవనే ఉద్దేశంతో ఈ మార్గంలో వస్తుండగా సరిగ్గా ఆరిపాటి దిబ్బలు, చిన్నాయగూడెం రహదారిలోని చిలకావారి పాకలు సమీపంలో వాహనం అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకువెళ్లి తిరగబడిరది. దీంతో వాహనంపై ఉన్న ఏడుగురు కూలీలు జీడిపిక్కల బస్తాల కింద పడి ఊపిరి ఆడక అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడినట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. సంఘటనా స్థలాన్ని కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరిరావు, దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, కొవ్వూరు రూరల్ సీఐ శేఖర్ బాబు పరిశీలించారు. ప్రమాదంలో నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), దేశభక్తుల బూరయ్య (40), పెనుగుర్తి చిన్న ముసలయ్య (35), కత్వా కృష్ణ (45), కత్వా సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా ప్రసాద్ మృతి చెందారు. ఆయా గ్రామాలలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జేసీ చిన్నరాయుడు, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తదితరులు ఆస్పత్రికి చేరుకొని మృతుల బంధువులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. ఫ్యాక్టరీ యజమాని… బాధిత కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మృతుల కుటుంబాలకు రూ.20 వేలు చొప్పున మట్టి ఖర్చులకు అందజేశారు. మృతుల పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉచితంగా విద్యనభ్యసించడానికి కావలసిన ఏర్పాటు చేస్తామని తెలిపారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, లారీ బోల్తా కొట్టిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జీడిపిక్కల లోడుతో లారీ వెళుతుండగా అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.