ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విమర్మలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రధాని ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, వాజ్‌పేయా ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్ చేశారని అన్నారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదని, నాడు కాంగ్రెస్ హయాంలో సభలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రేకొట్టారు. ఎలాంటి చర్చ జరగకుండానే ఏపీని విభజించారని అన్నారు. విభజన తీరుతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయని అన్నారు. సరిగా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావని అన్నారు.