. నాలుగు రోజులుగా ముంపులోనే
. బంధువుల ఇళ్లకు పయనం
. బుడమేరు గండ్ల కలకలం
. ఈలప్రోలు, రైల్వే బ్రిడ్జి దగ్గర గండ్లు
. పూడ్చివేతకు చర్యలు
. ఐదు గ్రామాలకు రాకపోకల బంద్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదతో నాలుగు రోజులుగా అవస్థలు పడిన విజయవాడ ప్రజల కన్నీటి వ్యథ అంతా ఇంతా కాదు. కనీసం బయటికి రావడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో బాధితులు ఇళ్లకే పరిమితమయ్యారు. తినడానికి తిండి లేక… తాగడానికి నీళ్లు లేక… పసిబిడ్డలకు కనీసం పాలు అందక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం వరద నుంచి కొంత ఉపశమనం లభించినా వరదలకు సమస్తం కోల్పోయి అల్లాడుతున్నారు. కాగా, బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో 16 డివిజన్లలో నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో ఉండిపోయిన ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్లు వదిలి బయటకొచ్చేందుకు సాహసిస్తున్నారు. నడుములోతు నీళ్లల్లోంచి ప్రధాన రహదారులపైకొచ్చి తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వరద ముంపునకు గురైన తమ వాహనాలు, ఆటోల కోసం వెతుకులాడుతున్నారు. ఇళ్లల్లో విలువైన వస్తువులు, దుస్తులు, విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు వరదనీటి పాలవవ్వడంతో వారికి దిక్కుతోచడంలేదు. అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఇంకా ముంపులోనే జీవనం సాగిస్తున్నారు. వరద ముంపులో గల్లంతైన వారి మృత దేహాల కోసం బాధితులు గాలిస్తున్నారు. ఒక వైపు బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా… మరోవైపు అల్పపీడన ప్రభావంతో బుధవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం పడటం, కొన్ని చోట్ల బుడమేరు కట్టలకు గండిపడటం ప్రజానీకాన్ని కలవరపెడుతున్నాయి. ముంపు బారిన పడతామన్న ఆందోళనతో వారంతా ఇళ్లను వదిలి బయటకు వస్తున్నారు. కాగా ప్రభుత్వం అందజేస్తున్న సాయం క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. విజయవాడ సింగ్‌నగర్ పరిసర ప్రాంతాలు, జక్కంపూడి కాలనీల ప్రజలు ముంపులోనే కొనసాగుతున్నారు. ఆహారం, పాలు, మంచినీరు అందక సమీప ప్రాంతానికి వచ్చి వాటిని తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. బుడమేరుకు మొత్తంగా మూడు గండ్లు పడగా, అందులో మైలవరం నియోజవర్గంలోని శాంతినగర్ దగ్గర పడిన గండిని పూడ్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అక్కడి నుంచే జక్కంపూడి, సింగ్‌నగర్‌కు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ముంపు ప్రాంతాల బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు సమీక్షలు, పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పర్యటించారు. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు మాజీ సీఎం జగన్ వెళ్లి బాధితులతో పరిస్థితిని ఆరా తీశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
కవులూరులో బడమేరుకు గండి..పంట పొలాల నీట మునక
ఇబ్రహీంపట్నం మండలంలోని కవులూరు వద్ద బుడమేరుకు గండిపడటంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈలప్రోలు సమీపాన భారీగా బుడమేరు వరద ప్రవహిస్తోంది. దీంతో ఈలప్రోలు నుంచి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. నాలుగు రోజుల నుంచి జలదిగ్బంధంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు..బుడమేరు వాగు ఉప్పొండడంతో ఆర కిలోమీటరుమేర రోడ్డు కొట్టుకుపోయింది. పైడూరిపాడు, రాయనపాడు, కవులూరు, జక్కంపూడి, ఆలప్రోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీని ప్రభావంతో వరి, మిర్చి, పత్తి చేలకు, చేపల చెరువులకు అపార నష్టం వాటిల్లింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల నిమ్మల రామానాయుడు, నారా లోకేశ్ పర్యవేక్షణలో బుడమేరు గండ్లకు అధికారులు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
రైల్వేబ్రిడ్జికి గండి..సమీప ప్రాంత ప్రజల అప్రమత్తం
విజయవాడ మధురానగర్ సమీపంలోని రైల్వేబ్రిడ్జి దగ్గర బుడమేరు కాల్వకు గండి పడిరది. ఈ నీరంత సమీపంలోని ఏలూరు కాల్వలోకి వచ్చి ఎగిసిపడుతోంది. దీంతో పరిసర ప్రాంతంలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారంతా ఖాళీచేసి..సమీపంలోని శారద కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి తరలివెళ్లాలని మైక్‌ద్వారా ప్రచారం వేయించారు.
అట్టపెట్టెలో శిశువు…
విజయవాడ సింగ్‌నగర్ ముంపు ప్రాంతంలో ఓ శిశువును రక్షించుకోవాలన్న తపనతో అట్టపెట్టెలో పెట్టి వరద నీటిలోకి వదిలిన దృశ్యం దయనీయంగా మారింది. ఓ ఇంటి చుట్టూ భారీ వర్షాలు, వరదలతో వరద నీరు చేరింది. అందులో ఉంటున్న దంపతులకు వెంట నెలలు నిండిన శిశువు ఉంది. చుట్టూ వరద నిండటంతో విషకీటకాలు, పాములు వచ్చే అవకాశం ఉండటం, అపరిశుభ్ర వాతావరణంలో శిశువుకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో శిశువును సురక్షిత ప్రాంతానికి తరలించాలని కుటుంబీకులు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు పసుపు రంగు ప్లాస్టిక్ డబ్బాలో శిశువును పడుకోబెట్టి, పీకల్లోతు నీటిలో నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ… సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎట్టకేలకు ఆ చిన్నారిని సాహసోపేతంగా సురక్షిత ప్రాంతానికి తరలించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎగువ నుంచి వస్తున్న రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వరద కొల్లేరును ముంచెత్తింది. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు ప్రవేశించింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎగువ ప్రాంతాలక చేరుస్తున్నారు. బుడమేరు నీరు చేరి…ఏలూరుజిల్లాలోని కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తోంది.