. దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల బలం పెరగాలి: రామకృష్ణ
. వామపక్షాల ఐక్యతకు బర్ధన్ విశేష కృషి: శ్రీనివాసరావు
పేదలకు అండగా… సామాజిక న్యాయ సాధనకు ఏబీ బర్ధన్, సీతారాం ఏచూరి వంటి కమ్యూనిస్టు యోధులు నిరంతరం శ్రమించారని, వారి ఆశయ సాధనకు నేటితరం కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని వక్తలు ఉద్ఘాటించారు.
విశాలాంధ్రవిజయవాడ: పేదలకు అండగా... సామాజిక న్యాయ సాధనకు ఏబీ బర్ధన్, సీతారాం ఏచూరి వంటి కమ్యూనిస్టు యోధులు నిరంతరం శ్రమించారని, వారి ఆశయ సాధనకు నేటితరం కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని వక్తలు ఉద్ఘాటించారు. నిస్వార్థ ప్రజాసేవకుడు, పోరాట యోధుడు సీపీఐ పూర్వ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ శత జయంతి సభ శుక్రవారం దాసరి భవన్‌లో జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ బర్ధన్ తొలితరం కమ్యూనిస్టు మేధావి అని, బహుభాషా కోవిదుడని కొనియాడారు. యూపీఏ
1 ప్రభుత్వాన్ని సమన్వయ కమిటీ ద్వారా నడిపించిన మహానేత అన్నారు. నాగపూర్ అంటే సహజంగా ఆర్‌ఎస్‌ఎస్, బీఆర్ అంబేద్కర్ గుర్తుకు వస్తారని, అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీ తరపున బర్ధన్‌ను విస్మరించలేరని చెప్పారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. బర్ధన్ తుదివరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుపడి పనిచేశారని, తన యావదాస్తి పార్టీకి ఇచ్చేశారని గుర్తుచేశారు. దేశ రాజకీయాల్లో కమ్యూస్టుల ప్రాబల్యం తగ్గిపోతే దేశానికి, ప్రజలకు నష్టమని హెచ్చరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడినట్లు అనిపించటం లేదన్నారు. మంత్రివర్గంలో కీలక శాఖలు బీజేపీ వద్దే ఉన్నాయని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలకు తెలియనీయటం లేదన్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ ప్రాంతీయ అవసరాలు చూసుకుంటున్నారేగానీ… కేంద్రంలో భాగస్వాములు అనే విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. ధైర్యంతో కూడిన రాజకీయాలు చేయలేక సమస్యలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇష్టం ఉన్నా… లేకున్నా మతాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్షాల ఐక్యతకు బర్ధన్ విశేష కృషి చేశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకికశక్తుల ఐక్యత కోసం ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. తమ ఉనికికే ప్రమాదం వస్తుందనే భయంతో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. వెంకటేశ్వరస్వామి లౌకికిదేవుడు అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి ప్రజలను మతాలపరంగా విభజించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం తన అధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. లడ్డూ కల్తీ చాటున మతోన్మాదం ఉందని, దీనిని చూస్త్తూ ఊరుకోకూడదన్నారు. మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే బర్ధన్‌కి నిజమైన నివాళి అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ 2004లో దేశంలో వచ్చిన మార్పు వల్ల యూపీఏ`1 కాలంలో ప్రభుత్వాన్ని నడపటంలో ఏబీ బర్ధన్ చాకచక్యంగా వ్యవహరించారని చెప్పారు. గ్రామీణ ప్రజల కోసం ఉపాధి హామీ పథకం, కనీస ఉమ్మడి ప్రణాళిక, సమాచార హక్కు చట్టం రూపొందించటంలో బర్ధన్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌బాబు మాట్లాడుతూ అవినీతి పాలకులు ప్రజల్ని కూడా అవినీతి దారిలోకి తెస్తున్నారని ఆరోపించారు. వర్గ రాజకీయాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. విద్యుత్ ఉద్యమంలో వామపక్షాలు కలిసి ఉద్యమించాయని గుర్తుచేశారు. వామపక్షాల్లో చీలికరావటానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల ఐక్యతకు కృషి చేయటమే బర్ధన్‌కి నివాళి అన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు డి.హరనాథ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం బర్ధన్ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నడిపిన మహారాష్ట్ర కేంద్రంగా కోరేగావ్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి వరవరరావు వంటి వామపక్షవాదుల్ని జైల్లో పెట్టిందని చెప్పారు. కమ్యూనిస్టుల బలం తగ్గుతున్న సమయంలో శ్రీలంకలో వామపక్ష అభ్యర్థి అధికారంలోకి వచ్చారని తెలిపారు. సమస్యల ప్రాతిపదికనైనా వామపక్షాలు కలిసి పనిచేయాలని సూచించారు.
ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు ఎస్‌కే.ఖాదర్‌బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల మత ఘర్షణలు జరగడం లేదన్నారు. ఆర్‌ఎస్‌పీ ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకుడు జానకీరామ్ మాట్లాడుతూ దిల్లీలో జరిగే వామపక్ష ఉద్యమాల్లో తెలుగు వారే అధికంగా ఉంటారని చెప్పారు. గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినా ప్రజల పక్షాన నిలబడాలని వామపక్షాల నాయకులు తిరస్కరించారని గుర్తు చేశారు. బర్ధన్, సీతారాం ఏచూరి వంటి నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో వచ్చే ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కాలానుగుణంగా మారుతూ బర్ధన్‌కి నివాళిగా వామపక్ష పార్టీలు ప్రజల్ని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మరో సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు కొత్త తరాన్ని ఆకర్షించటంలో విఫలమవుతున్నాయని చెప్పారు. వామపక్షాలు ఐక్యం కాకపోతే మరింత నష్టపోతామన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం ప్రధాన భూమిక పోషిస్తున్న తరుణంలో మత రాజకీయాలను నివారించటానికి కమ్యూనిస్టులకు శక్తి సరిపోవటం లేదన్నారు. మతోన్మాదులను ఎదిరించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కూడా కలుపుకుపోవాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలను ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. ముందుగా ఏబీ బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు పి.చంద్రనాయక్, రాష్ట్ర నాయకులు కె.కాశయ్య, ఎస్‌కే నజీర్ పోరాట యోధులను గుర్తు చేస్తూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికారు. ఏబీ బర్ధన్ శత జయంతి సభకు పెద్ద సంఖ్యలో వామపక్షాల నాయకులు హాజరయ్యారు.