విశాలాంధ్ర- పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకి అతి సమీపంలో అక్రమంగా నల్లరాయి క్వారీ నిర్వహిస్తున్నారు. స్థానికుల భద్రతకు తీవ్ర ముప్పుగా తయారైన ఈ క్వారీ వ్యవహారంపై ప్రజా సంఘాలు ఈ విషయంపై ఆందోళనలు చేసినప్పటికీ… మైనింగ్ మాఫియాను అడ్డుకునే నాథుడే లేడు. యథేచ్ఛగా నల్లరాయి బ్లాస్టింగ్ జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నత అధికారులు కిమ్మనడం లేదు. సంబంధిత మైనింగ్ శాఖలో బదిలీల నేపథ్యంలో కొత్త అధికారులు జిల్లాలో ఇంకా చార్జి తీసుకోకపోవడంతో ఇదు అదునుగా మైనింగ్ మాఫియా భారీ బ్లాస్టింగ్‌లతో నల్లరాయిని కొల్లగొడుతోంది. వారికి కేటాయించిన మైనింగ్‌ఏరియాతో పాటు పరిధి దాటి… అనువుగా ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా భారీ బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ దగ్గర్లోని గ్రామాలకు అతి సమీపంలో పెద్దఎత్తున బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ…పకృతి సంపదను దోచుకుంటున్నారు. గిరిజనులకు మాయ మాటలు చెప్పి వారి ఆరోగ్యానికి, పంట భూములకు హాని చేసే విధంగా గిరిజన ప్రాంతంలో అనుమతి లేనటువంటి పేలుడు పదార్థాలు(జిలిటెన్ స్టిక్స్) ఉపయోగించి నివాస ప్రాంతాల దగ్గర్లో భారీ పేలుళ్లను జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ దేవరపల్లి గ్రామానికి అతి సమీపంలో నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీ కి 2 హెక్టార్ల స్థలం మైనింగ లీజు ఇచ్చినప్పటికీ దానికి మించి తవ్వకాలు జరుపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలైన కొత్తబు, కురేడేమెట్ట, దేవరపల్లి ప్రజలకు మైనింగ్ పై అవగాహన లేదని తెలిసి… మైనింగ్ అధికారులతో కుమ్మక్కై పరిమితికి మించి ఊరికి అతి సమీపంలో పెద్దఎత్తున బ్లాస్టింగ్ లు జరుపుతున్నారు. దీనిపై స్థానిక విద్యావంతులు ప్రశ్నించినప్పుడు రాయి తవ్వుకోవడానికి తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని మభ్యపెట్టి వారిని బెదిరిస్తున్నారు. పత్రాలు చూపించమని అడిగితే… సంబంధిత శాఖకు మాత్రమే చూపిస్తాం మీకు చూపించవలసిన అవసరం లేదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోనీ సంబంధిత
జిల్లా అధికారుల దగ్గరికి వెళ్దాం అన్నా కూడా జిల్లా అధికారులు ఎవరు అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు వాపోయారు. ఈ విషయమై మైనింగ్ శాఖ ఉద్యోగులను వివరణ కోరగా… కొత్త అధికారులు ఎవరు ఇంకా చార్జి తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో ఆ చుట్టుపక్క ల ప్రాంతాల ప్రజలు ఎవరికి ఈ గోడు చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో మైనింగ్ మాఫియా ఏం చేస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ గ్రామాలను సందర్శించాలని… తగిన రీతిలో విచారణ జరిపించి మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.