దేశంలో 2 వేలకు చేరువలో ఒమిక్రాన్
37 వేలు దాటేసిన రోజువారీ పాజిటివ్‌లు
‘మహా’ విజృంభణ.. ఒక్కరోజే 18,466 కేసులు
రాత్రి కర్ఫ్యూ విధించే దిశగా రాష్ట్రాలు
న్యూదిల్లీ : దేశంలో కరోనా కల్లోలం మొదలయింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్`19 కొత్త రకం ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండ టంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. ఒమిక్రాన్ కేసులు 2 వేలకు చేరవవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568, దిల్లీ 382, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 152, తమిళనాడులో 121గా ఉన్నాయి. మొత్తం ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటి వరకు 766 మంది కోలుకు న్నారు. ఇక దేశంలో కోవిడ్ రోజువారీ కేసులు 37,379 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,71,830కి పెరిగాయి. తాజాగా మరో 124 మందితో మృతుల సంఖ్య 4,82,017కి చేరింది. ప్రధాన నగరాలన్నింటిలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 18,466 కొత్త కేసులు నమోదయ్యాయి. 20 మంది మరణించారు. దిల్లీలో మంగళవారం కోవిడ్ కొత్త కేసులు 5,481 నమోదవగా ముగ్గురు మరణించారు. పాజిటివిటీ రేటు 8.37 శాతానికి పెరిగింది. నగరంలోని 90 శాతం కేసులు ఎటువంటి లక్షణాలు లేనివే. క్రియాశీల కేసులు 14,889గా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ బెంగాల్‌లో 9,073 నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడుల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో కొత్తగా 2,479 కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. కోల్‌కతాలో 83 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. తెలంగాణలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా, కోవిడ్ రోజువారీ కేసులు ఒక్కరోజే అత్యధికంగా 1,052 నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో తాజాగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
ముంబైలో ఒక్కరోజే 10,860 కేసులు..
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 18,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క ముంబై మహానగరంలోనే 10,860 కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కరోనా కేసులు సునామీలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ అన్నారు. జంబో కోవిడ్ సెంటర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
లూధియానా నర్సింగ్ కళాశాలలో 41 మంది విద్యార్థులకు కోవిడ్
పంజాబ్‌లోని లూధియానాకు చెందిన మల్కపూర్‌లోని డీఎంసీ నర్సింగ్ కళాశాలకు చెందిన 41 మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ‘ఇన్ఫెక్షన్ సోకిన మొత్తం విద్యార్థుల్లో 20 మందిని దయానంద్ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. మిగిలిన వారు స్వీయ నిర్బంధంలో ఉన్నారు’ అని డీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశ్వినీ చౌదరి తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లక్నోలోని మెదాంత హాస్పిటల్‌లో 33కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక ఎమెర్జన్సీ వైద్యుడు, 32 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
పటియాల వైద్య కళాశాల.. ఖరగ్‌పూర్ ఐఐటీలో…
పటియాల వైద్య కళాశాలలో మంగళవారం 60 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ సందీప్ హాన్స్ తెలిపారు. అలాగే ఖరగ్‌పూర్ ఐఐటీ క్యాంపస్‌లో 40 మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు సహా 60 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. అయితే అధిక శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని, కొందరు మాత్రం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ రిజిస్ట్రార్ తమల్‌నాథ్ వెల్లడిరచారు.