విశాలాంధ్ర`కోటవురట్ల:
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పాస ట్రస్ట్ పేరుతో అనధికారికంగా నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇవి. ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ 15 సంవత్సరాల క్రితం కైలాసపట్నం వలసవచ్చి దేవుని పరిచయ ప్రారంభించారు. స్థిర నివాసం ఏర్పరచుకొని చర్చ్ నిర్వహించేవారు. 2009లో పాస ట్రస్ట్ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులను చేర్చుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఆశ్రమంలో 95 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారందరికీ శనివారం రాత్రి సమోసాలు ఇచ్చారు. అనంతరం పొందూరులో జరిగిన తద్దినంలో మిగిలిన ఆహారాన్ని చిన్నారులకు వడ్డించారు. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నిర్వాహకుడు కిరణ్ కుమార్ అస్వస్థతకు గురైన విద్యార్థులను కోటవురట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను అప్పగించారు. వారు తమ బిడ్డలను తీసుకొని సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడ ఆసుపత్రుల్లో విద్యార్థులను చేర్పించారు. వైద్య సేవలు పొందుతూ తాంబేల్లి జాషువా, గమ్మెల భవాని, పాంగి శ్రద్ధ మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభిం చారు. నిర్వాహకుడి నిర్వాకం వల్లే ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు నిర్ధారించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డిప్యూటీ డీఈవో అప్పారావు, సీఐ అప్పన్న వైద్య ఆరోగ్య అధికారులు ఆశ్రమాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు. కిరణ్ కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి చిన్నారుల మృతికి కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.
కలెక్టర్ పరామర్శ
అనకాపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం చిన్నారులను విశాఖ కేజీహెచ్‌కు తీసుకురాగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అక్కడకు వెళ్లి పరామర్శించారు. పిల్లల వార్డులో వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. భయపడాల్సిన పని లేదని అన్నారు.
జగన్ దిగ్భ్రాంతి
కైలాసపట్నంలో కలుషితాహారం తిని విద్యార్థులు మరణించిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పర్యవేక్షణ కొరవడిరదనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.