. మరమ్మతులు చేయకపోతే మనుగడ ప్రమాదం
. ‘ఉపాధి’లో ఖర్చు చేసిన కోట్ల రూపాయలు నిరుపయోగమేనా?
. పాలకుల నిర్లక్ష్యం… అధికారుల అలసత్వమే
విశాలాంధ్ర – లింగపాలెం : రాష్ట్రంలో సాగు, తాగునీటి కాలువల దుస్థితి పాలకులకు పట్టడం లేదు. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట పొలాలు, ప్రజల ఆవాసాలు ముంపు బారినపడటమే కాకుండా భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వెరసి కాలువల ఆనవాళ్లే కనిపించని పరిస్థితికి దారితీసింది. బుడమేరు వాగు ఉప్పొంగడంతో విజయవాడ నగరం నీటి ముంపులో చిక్కుకోవడం ఒకటైతే, మరోవైపు, అనేక గ్రామాల్లో పంట పొలాలు వరద బారినపడిన దుస్థితి నెలకొంది.
వర్షం పడితే ఆ నీటిని పొదుపుగా మళ్లించుకొని అవసరాలు తీర్చుకోవటం కోసం నిర్మించిన కాలువలు ఉపయోగంగా లేవు. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు నిండితే ఒక చెరువు నుంచి మరో చెరువులకు వెళ్లే లింకు చానళ్లు, చెరువులకు వచ్చే నీటి చానళ్లు సక్రమంగా లేకపోవడం వరద నీరు ఊళ్లపై పొలాలను, ఇళ్లను ముంచెత్తుతోంది. దశాబ్దాల తరబడి చానళ్ల నిర్వహణను పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి నెలకొందని రైతులు, ప్రజలు వాపోతున్నారు. కాలువల మరమ్మతుకు ఇరిగేషన్ శాఖకు కొన్నాళ్ల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోయినప్పటికీ ఉపాధి హామీ పథకంలో వీటి మరమ్మతుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెడుతున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయా? సద్వినియోగం అవుతున్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో దాదాపు రెండు వేల కాలువలు ఉన్నాయి. వీటిలో దాదాపు 60 శాతం కాలువలు సక్రమంగా లేవనేది ఇరిగేషన్ శాఖ అధికారులే అంటున్నారు. ఈ కాలువలు సరిగా ఉంటే ఉపద్రవాలు ఎదురుకావు. 2005లో ఉపాధి పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ పథకం కింద కాలువల మరమ్మతుల కోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ కాలువల పనులను పరిశీలిస్తే కూలీలకు ఉపాధి చూపుతున్నామని చెప్పుకుంటున్నారేగానీ కాలువలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనే విషయాలపై శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలువలపై శ్రద్ధ ఎందుకు చూపడం లేదని ‘ఉపాధి’ అధికారులను ప్రశ్నిస్తే అభివృద్ధితో తమకు సంబంధం లేదని, కూలీలకు ఉపాధి మాత్రమే చూపిస్తున్నామని కొందరు అధికారులు అంటున్నారు. ‘ఉపాధి’ అమలులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాలువల పనుల కోసం ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఏ ఏడాదికి ఆ ఏడాది చేసిన కాలువలోనే పనులు చేయిస్తూ వస్తున్నారు. చేసే పనులు కూడా ఉపయోగంగా ఉండటం లేదు. ఉపాధి నిధులతో పక్కాగా కాలువలను నిర్మించవచ్చు కదా అని ప్రశ్నిస్తే అలా చేయటం వల్ల కూలీలకు పనులు ఉండవని కొందరు అధికారులు విచిత్ర వాదన చేస్తున్నారు. ఈ వాదన ఎంత మాత్రం సమంజసం కాదని రైతులు అంటున్నారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు లింకు కాలువ దూరం 3 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ పూడిక తీసి కాలువకు రెండు వైపులా గట్టును పటిష్టం చేస్తే దాదాపు రూ.5 లక్షలు ఖర్చవుతుందని, ఇలా ఒకసారి చేస్తే దాదాపు 8 ఏళ్ల వరకు కాలువకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులతో ఎన్నో కాలువలను పటిష్టంగా నిర్మించుకోవచ్చన్న విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ కాలువల ద్వారా లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా చేసే సామర్థ్యం ఉంది. కానీ కాలువల రూపురేఖలే మారిపోవడంతో పూర్తిస్థాయిలో పంటలకు నీరందడం లేదు. కాలువల ద్వారా సక్రమంగా నీరు ప్రవహించడం లేదు. అసలు కాలువలు ఉన్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మెట్ట ప్రాంతంలో, డెల్టాలో కాలువలను జీవనాడులుగా తవ్వించారు. ఇప్పుడు వీటి తీరే మారింది. ఈ మధ్య కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలతో కాలువల దుస్థితి వెలుగు చూస్తోంది. ఉపాధి పనులు గుర్తించేటప్పుడు గ్రామ సభలు నిర్వహించి పనులు ఎంపిక చేస్తారు. పనులు జరిగే సమయంలో ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారం పనులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల నిధులు వృధా అవటమే కాకుండా చేసిన పనులు కూడా ఉపయోగంగా ఉండటం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెట్ట ప్రాంతంలోని కాలువల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నీరు సక్రమంగా ప్రవహించక పంటలకు నష్టం కలిగింది. కొన్ని కాలువలు ఇళ్లను ముంచాయి. అనేక మంది కాలువలను ఆక్రమించేసుకుని వాటి స్వరూపాన్ని మార్చేశారు. ఆక్రమణలను తొలగించకపోవడం వల్ల లింగపాలెం మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక కాలువలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. ఉన్న కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు కాలువల మరమ్మతులపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని, పటిష్టంగా మరమ్మతులు చేపట్టాలని, పనులపై ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ చేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. పర్యవేక్షణ లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్న కాలువలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉంది.